పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హిట్ కొట్టి.. ఐకాన్ స్టార్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఆ దర్శకుడు.. కానీ ఇప్పట్లో బన్నీతో ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా లేదు.. దాంతో అఖిల్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.. అలాగే అఖిల్ కూడా ఈ సారి భారీగా రిస్క్ చేయబోతున్నాడు.. ఇంతకీ అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏజెంట్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా..!
చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో.. కాస్త సక్సెస్ రుచి చూసిన అఖిల్.. ఈ సారి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రాబోతున్నాడు. అందుకే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు.. అఖిల్ మార్కెట్‌కు మించి ఖర్చు చేస్తున్నారట. అందుకోసం సురేందర్ రెడ్డి, అఖిల్ తమ పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఆగష్టులో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా తర్వాత ఈ అక్కినేని కుర్రాడు ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో ఫస్ట్ హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌తోనే మరో సినిమా చేయబోతున్నాడని ఈ మధ్య వినిపించింది. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ వంటి సినిమా తీసి హిట్ కొట్టిన వేణు శ్రీరామ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వేణు శ్రీరామ్ అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’ అనే ప్రాజెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. కానీ బన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐకాన్ ముందుకు వెళ్లేలా లేదు. దాంతో వేణు మరో కథను రెడీ చేసి అఖిల్‌కు వినిపించినట్టు తెలుస్తోంది. ఆ కథ అఖిల్‌కు నచ్చడంతో.. ఏజెంట్ తర్వాత ఈ కొత్త సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో.. అసలు బన్నీతో ఐకాన్ ఉంటుందా లేదా అనేది సందేహంగా మారింది.
