Site icon NTV Telugu

Akhanda 2: షాకింగ్.. 2026లో ‘అఖండ తాండవం’ రిలీజ్?

Akhanda 2 (2)

Akhanda 2 (2)

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ తాండవం’ కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా… నాల్గో తేదీ ప్రీమియర్స్‌తో ప్రారంభమై, ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, అభిమానుల అంచనాలను నిరాశపరుస్తూ, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ‘అఖండ తాండవం’ సినిమాను 14 రిల్స్ ప్లస్ (రామ్ ఆచంట, గోపి ఆచంట) సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు, హీరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల కారణంగా, సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. దీంతో, అనుకున్న తేదీల్లో సినిమా విడుదల అవుతుందా, ఎప్పుడు క్లారిటీ వస్తుంది అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత కరువైంది.

Also Read :Akhanda 2: ‘అఖండ తాండవం’ ఫైనాన్స్ ఇష్యూస్‌పై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు!

ఈ గందరగోళం మధ్య, ప్రముఖ టికెటింగ్ సంస్థ బుక్ మై షో ఒక అడుగు ముందుకేసి, తమ యాప్‌లో ఈ సినిమా 2026లో విడుదలవుతున్నట్లు పేర్కొంది. బుక్ మై షో వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదు కానీ, వారి యాప్‌లో 2026 రిలీజ్ డేట్‌ను చూపించడంతో చాలామంది సినిమా ఈ నెలలో కాకుండా వచ్చే ఏడాది విడుదలవుతుందని దాదాపు ఫిక్స్ అయిపోతున్నారు. మద్రాస్ హైకోర్టు స్టే, బుక్ మై షో ప్రకటనతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సినిమా నిర్మాతలు ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు (నాల్గో తేదీ) ప్రీమియర్స్ ప్రారంభించి, రేపు (ఐదో తేదీ) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఈరోజు సాయంత్రంలోగా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఈరోజు రిలీజ్ సమస్య పరిష్కారం కాకపోతే, ఈ సినిమాను డిసెంబర్ 18 లేదా 24 తేదీలకు, లేదా సంక్రాంతికి సైతం విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ‘అఖండ తాండవం’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం ప్రస్తుతానికి నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version