Site icon NTV Telugu

Akash Puri: మా నాన్నను పక్కన పెట్టి.. చోర్ బజార్ చేశాను

Akash Puri Speech

Akash Puri Speech

తన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆకాశ్ పూరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా.. నెపోటిజంపై సుదీర్ఘంగా ప్రసంగించాడు. తనపై కూడా నెపోటిజం కామెంట్స్ వచ్చాయని తెలిపిన ఆకాశ్.. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ట్యాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, తానూ అదే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. తాను చిటికేస్తే కోరుకున్నవన్నీ తన ముందు వాలుతాయని, తన తండ్రి ఏం అడిగినా ఇచ్చేంత సౌకర్యం తనకుందని, కానీ తాను మాత్రం తన కాళ్లపై నిలబడాలనుకుంటున్నానని, అందుకే కష్టపడుతున్నానని అన్నాడు.

తనకు ఎన్ని అందుబాటులో ఉన్నా, అవన్నీ కేవలం తన తండ్రివేనని.. తనకు సంబంధించినంతవరకూ ఏవీ లేవని, తాను జోరీనన్నాడు. తన సోదరిని గానీ, తన జీవితంలో రాబోయే అమ్మాయిని గానీ చూసుకోవాలంటే, తానూ ఒక స్థాయికి చేరుకోవాల్సిందేనన్నాడు. తాను నిజంగానే నెపోటిజంను అడ్వాంటేజ్‌గా తీసుకుంటే.. విజయ్ దేవరకొండతో కాకుండా ‘లైగర్’ సినిమాను తనతో చేయమని తండ్రిని అడిగేవాడినని అన్నాడు. తాను అడిగితే తండ్రి పూరీ కచ్ఛితంగా తనతో సినిమా చేస్తాడని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి హీరోని లాంచ్ చేసేదాకా తన తండ్రి తనకు చాలా ఇచ్చారని, తనతో సినిమాలు చేయమని అడగడం సబబు కాదని, తాను కష్టపడి ఆయన స్థాయికి చేరుకున్నాకే తండ్రితో సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

నిజానికి.. తనతో ఒక సినిమాని తన తండ్రి ప్లాన్ చేశారని, కానీ ‘చోర్ బజార్’ కథ విపరీతంగా నచ్చడంతో మా నాన్నను పక్కనపెట్టి ఈ చిత్రం చేశానన్నాడు. ఇందులోని బచ్చన్ క్యారెక్టర్‌తో ప్రతిఒక్కరు ప్రేమలో పడతారని, ఈ సినిమా అందరికీ కచ్ఛితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాని ఆదరించాలని, మీ ఆశీర్వాదాలుంటే మరిన్ని సినిమాలతో మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తానని ప్రేక్షకుల్ని ఉద్దేశిస్తూ చెప్పాడు.

Exit mobile version