Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్‌ కష్టాలు

Ishwarya Rajesh

Ishwarya Rajesh

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేశ్ నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం సాధించినప్పటికీ, తనకు అనుకున్నంత స్థాయిలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని స్వయంగా ఐశ్వర్య రాజేశ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దొరికిన అవకాశాల్లోనే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటీవల ఆమె నటించిన ‘ఓ సుకుమారి’ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది.

ఓవైపు ఈ ఫ్లాప్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకునే లోపే ఐశ్వర్య రాజేశ్ చేతికి వచ్చిన ఒక క్రేజీ ప్రాజెక్టు చేజారినట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో దర్శకుడు హసిత్ గోలి ఒక ఆసక్తికరమైన మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డేతో పాటు ఐశ్వర్య రాజేశ్‌ను హీరోయిన్లుగా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఐశ్వర్య రాజేశ్ స్థానంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ హఠాత్ మార్పునకు గల అసలు కారణాలు ఏమిటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే సంక్రాంతి బరిలో సినిమాను నిలబెట్టాలని నిర్మాత దిల్ రాజు పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ప్రస్తుతం బడ్జెట్ అదుపులో ఉంచేందుకు కాస్ట్ కటింగ్ ఫార్ములా ఉపయోగిస్తున్న దిల్ రాజు, తక్కువ పారితోషికానికి అంగీకరించే భామలనే ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయిస్తారనేది ఫిల్మ్‌నగర్ టాక్. ఒకటి రెండు రోజుల్లో హీరోయిన్ల ఎంపికపై మేకర్స్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.