ఈ సారి అకాడమీ అవార్డుల బరిలో ప్రధాన విభాగాల్లో ఒకటయిన ఉత్తమ నటుడు కేటగిరీలో ‘కింగ్ రిచర్డ్’ ద్వారా విల్ స్మిత్, ‘ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్’తో డేంజల్ వాసింగ్టన్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ నల్లజాతి నటులు కావడం విశేషం. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా అరియానా డిబోస్, ‘కింగ్ రిచర్డ్’తో ఔంజునే ఎల్లిస్ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం అందరి చూపు వీరిపై ప్రసరిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి నల్లవారికి తక్కువ నామినేషన్స్ దక్కాయనే చెప్పాలి. అమెరికా కేంద్రంగా సాగే ఆస్కార్ అవార్డులలో మొదటి నుంచీ వర్ణ వివక్ష తాండవం చేస్తోందనే చెప్పాలి. 1929 మే 16న జరిగిన ప్రప్రథమ ఆస్కార్ అవార్డుల ప్రదానం మొదలు మొన్నటి దాకా సాగిన ఆస్కార్స్ ను పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది. ఈ సారి రెండు ప్రధాన కేటగిరీల్లో ఇద్దరిద్దరు నల్లవారు పోటీ పడడం అన్నది విశేషం! అందువల్లే అందరి చూపు ఈ నలుగురిపై సాగుతోందని చెప్పవచ్చు.
అయినా…
నల్లజాతి ఉన్నతి కోసం పరితపించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో తన విఖ్యాతి గాంచిన ‘ఐ డ్రీమ్ట్…’ అన్న ప్రసంగంలో “శరీరవర్ణాన్ని బట్టి కాకుండా అందరిలోనూ ఉన్న ప్రతిభను గుర్తించే రోజు వస్తుంది” అని ఆశించారు. మార్టిన్ లూథర్ కింగ్ అభిలషించిన దానికన్నా మిన్నగానే ఏకంగా శ్వేతసౌధంలోనే ప్రథమ పౌరునిగా బరాక్ ఒబామా అధ్యక్ష స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచారు. కానీ, 94 ఏళ్ళ నుండీ సాగుతున్న అకాడమీ అవార్డుల్లో మాత్రం వేళ్ళమీద లెక్కపెట్ట దగ్గ నల్లజాతీయులు మాత్రమే ప్రధాన విభాగాల్లో విజేతలుగా నిలిచారు. అందుకే ప్రతీసారి ఏ నల్లజాతీవారు ఆస్కార్ అవార్డ్స్ సంపాదిస్తారో అని బ్లాక్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అయితే…
ఇప్పటి దాకా ఆస్కార్ అందుకున్న నల్లజాతీయులు ఎవరో ఓ సారి చూద్దాం – 1939లో సూపర్ డూపర్ హిట్ ‘గాన్ విత్ ద విండ్’ చిత్రం ద్వారా హ్యాటీ మెక్ డానియెల్ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. అసలు ఆస్కార్ అవార్డ్స్ లో మొట్టమొదటి నామినేషన్ సంపాదించిన బ్లాక్ యాక్టర్ గానూ, అవార్డు సొంతం చేసుకున్న తొలి నల్లజాతి నటిగానూ హ్యాటీ మెక్ డానియెల్ నిలచిపోయారు. అయితే బెస్ట్ యాక్ట్రెస్ అనే విభాగమే అతి ప్రధానమైనది కదా! అందువల్ల నల్లవారిని కేవలం సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. తరువాత 1954లో ‘కార్ మెన్ జోన్స్’లో నటించిన డోర్తీ డాండ్రిడ్జ్ కు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ లభించింది. బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో నామినేషన్ సంపాదించిన తొలి నల్లజాతి నటిగా డోర్తీ నిలిచారే తప్ప అప్పట్లో అవార్డు గెలవలేదు.
తొలి ఉత్తమ నటుడు సిడ్నీ పొయిటర్!
అలాగే 1958లో సిడ్నీ పొయిటర్ ‘ద డిఫియెంట్ ఒన్స్’ సినిమా ద్వారా ఆస్కార్ నామినేషన్ సంపాదించిన తొలి నల్లజాతి నటుడుగా నిలిచారు. అయితే అప్పట్లో ఆయన విజేతగా నిలవలేదు. కానీ, 1963లో అదే సిడ్నీ పొయిటర్ ‘లిల్లీస్ ఆఫ్ ద ఫీల్డ్’ సినిమా ద్వారా ఉత్తమనటునిగా ఆస్కార్ ను సొంతం చేసుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమనటునిగా నిలచిన తొలి నల్లజాతి నటుడుగా సిడ్నీ పొయిటర్ చరిత్రలో నిలిచారు. అయితే ఉత్తమ నటి విభాగంలో మాత్రం ఆస్కార్స్ ఆరంభమైన దాదాపు 71 ఏళ్ళకు తొలి నల్లజాతీయురాలిగా హ్యాలీ బెర్రీ విజేతగా నిలిచారు. 2001లో ‘మాన్స్టర్స్ బాల్’ చిత్రం ద్వారా హ్యాలీ బెర్రీ బెస్ట్ యాక్ట్రెస్ గా గెలుపొందారు. అదే యేడాది డెంజెల్ వాషింగ్టన్ కూడా ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకొని, ఆ విభాగంలో సిడ్నీ పొయిటర్ తరువాత ఆ గౌరవం దక్కించుకున్న నల్లజాతి నటునిగా నిలిచారు. ఈ సారి మళ్ళీ ఉత్తమ నటుని కేటగిరీలో డెంజెల్ వాషింగ్టన్ నామినేషన్ పొందారు. హ్యాలీ బెర్రీ తరువాత మరేనటి ఉత్తమనటి విభాగంలో గెలుపొందలేదు. ఈ సారి ఈ విభాగంలో ఏ నటీ నామినేషన్ సంపాదించలేదు.
ముచ్చటగా మూడోసారి!
ఈ సారి ఉత్తమ నటుని విభాగంలో పోటీ పడుతున్న మరో నల్ల నటుడు విల్ స్మిత్ గతంలో తన ‘అలీ’ సినిమా ద్వారా 2002లో నామినేషన్ సంపాదించారు. అయితే విన్నర్ కాలేక పోయారు. ఆ తరువాత ఆయన 2007లోనూ ‘పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ అందుకున్నారు. కానీ, అప్పుడూ విజేతగా నిలవలేదు. కానీ, అదే ఏడాది ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’తో ఫారెస్ట్ విటాకెర్ అనే నల్లజాతి నటుడు గెలుపు సాధించారు. ఇప్పుడు మూడోసారి ‘కింగ్ రిచర్డ్’తో బెస్ట్ యాక్టర్ విభాగంలో పోటీపడుతున్నారు విల్ స్మిత్. అలా మూడు సార్లు ఉత్తమనటుని కేటగిరీలో నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ ఇదే ‘కింగ్ రిచర్డ్’తో నిర్మాతగా బెస్ట్ మూవీ నామినేషన్ అందుకున్నారు.
ఇప్పటి దాకా విజేతలు వీరే:
బెస్ట్ యాక్టర్స్ : సిడ్నీ పొయిటర్ (1963- లిల్లీస్ ఆఫ్ ద ఫీల్డ్), డెంజెల్ వాషింగ్టన్ (2001- ట్రెయినింగ్ డే), జామీ ఫాక్స్ (2004- రే), ఫారెస్ట్ విటాకెర్ (2006- ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్)
బెస్ట్ యాక్ట్రెస్ : హ్యాలీ బెర్రీ (2001- మాన్స్టర్స్ బాల్)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్: లూయిస్ గాసెట్ జూనియర్ (1982- ఏన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్ మేన్), డెంజెల్ వాషింగ్టన్ (1989- గ్లోరీ), క్యూబా గూడింగ్ జూనియర్ (1996- జెర్రీ మాగ్వేర్), మోర్గాన్ ఫ్రీమన్ (2004 – మిలియన్ డాలర్ బేబీ), మహెర్సెలా అలీ (2016 – మూన్ లైట్/ 2018- గ్రీన్ బుక్), డేనియల్ కలూయా (2020 – జూడాస్ అండ్ బ్లాక్ మెస్సెయా)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్: హ్యాటీ మెక్ డానియెల్ (1939 – గాన్ విత్ ద విండ్), వూఫీ గోల్డ్ బెర్గ్ (1990 – ఘోస్ట్), జెన్నీఫర్ హడ్సన్ (2006- డ్రీమ్ గర్ల్స్), మోనిక్ (2009- ప్రీసియస్), ఓక్టేవియా స్పెన్సర్ (2011 -ద హెల్ప్), లుపిటా న్యోంగో (2013- 12 ఇయర్స్ ఏ స్లేవ్), వోలా డేవిస్ (2016 – ఫెన్సెస్), రెజీనా కింగ్ (2018- ఇఫ్ బీలే స్ట్రీట్ కుడ్ టాక్)
మరికొందరు:
ఆస్కార్స్ లో అన్నిటి కన్నా మిన్న అయినది ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరీనే. ఈ విభాగంలో స్టీవ్ మెక్వీన్ (2013- 12 ఇయర్స్ ఏ స్లేవ్), బ్యారీ జెంకిన్స్ (2016- మూన్ లైట్) ఉత్తమ నిర్మాతలుగా నిలిచారు. ఇతర విజేతలు ఎవరంటే?
బెస్ట్ యానిమేషన్ : పీటర్ రామ్సే (2018- స్పైడర్ మేన్ : ఇన్ టు ద స్పైడర్ వర్స్)
బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్ : రూత్ ఈ కార్టర్ (2018- బ్లాక్ ఫ్యాంతర్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : టి.జె.మార్టిన్ (2012- అన్ డిఫీటెడ్), ఎజ్రా ఎడెల్మెన్ (2016- ఓ.జె.: మేడిన్ అమెరికా)
బెస్ట్ రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే): జోర్డాన్ పీలే (2017- గెట్ ఔట్)
బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): జెఫ్రీ ఫ్లెచర్ (2009-ప్రీసియస్), జాన్ రిడ్లే (2013- 12 ఇయర్స్ ఏ స్లేవ్), బ్యారీ జెంకిన్స్, టారెల్ అల్విన్ మెక్ క్రేనీ (2016- మూన్ లైట్), కెవిన్ విల్ మాట్, స్పైక్ లీ (2018- బ్లాక్ క్లాన్స్ మన్)
బెస్ట్ సౌండ్ : విల్లీ డి.బర్టన్ (1988- బర్డ్, 2006- డ్రీమ్ గర్ల్స్), రస్సెల్ విలియమ్స్ II (1989- గ్లోరీ, 1990-డాన్సెన్స్ విత్ వూల్వ్స్)
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్): ప్రిన్స్ (1984- పర్పుల్ రెయిన్), హెర్బీ అన్ కుక్ (1986-రౌండ్ మిడ్ నైట్), జోన్ బెటిస్టే (2020- సోల్)
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) : ఇసాక్ హేస్ (1972- షాఫ్ట్), ఐరీన్ క్యారా (1983- ఫ్లాష్ డ్యాన్స్), స్టీవీ వండర్ (1984-ద ఉమన్ ఇన్ రెడ్), లియోనెల్ రిచీ ( 1985- వైట్ నైట్స్), ఫ్రేసర్ బోయ్, జూసీ.జె, డిజె పౌల్ (2005- హజిల్ అండ్ ఫ్లో), కామన్ జాన్ లెజెండ్ (2014- సెల్మా), హెచ్.ఇ.ఆర్, డెర్నస్ట్ ఎమిలే II, టియారా థామస్ (2020- జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయా)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: మియా నీల్, జమికా విల్సన్ (2020- మా రియనేస్ బ్లాక్ బాటమ్)
బెస్ట్ షార్ట్ ఫిలిమ్ (లైవ్ యాక్షన్) : ట్రావన్ ఫ్రీ (2020- టూ డిస్టాంట్ స్ట్రేంజర్స్)
బెస్ట్ షార్ట్ ఫిలిమ్ (యానిమేషన్): కొబే బ్రయాంట్ (2017- డియర్ బాస్కెట్ బాల్), మ్యాథ్యూ ఏ, చెర్రీ, కరేన్ రూపెర్ట్, టొలివర్ (2019 – హెయిర్ లవ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : హన్నా బీచ్లర్ (2018-బ్లాక్ ఫ్యాంతర్)
ఇక ఇప్పటి దాకా ఆస్కార్ బరిలోని బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ విభాగాల్లో ఏ నల్లజాతీయులు విజేతలుగా నిలవలేదు. ఇక గౌరవ ఆస్కార్ అవార్డులు అందుకున్నవారిలో సిడ్నీ పొయిటర్ (2001), జేమ్స్ ఎర్ల్ జోన్స్ (2011), స్పైక్ లీ (2015), చార్లెస్ బర్నెట్ (2017), సిసిలీ టైసన్ (2018), సామ్యూయెల్ ఎల్. జాక్సన్ (2022) ఉన్నారు.
ఈ 93 ఏళ్ళలో ఇప్పటి వరకు అన్ని విభాగాలలో కలిపి విజేతలుగా నిలచిన వారి సంఖ్య : 3,140. వారిలో 52 మంది మాత్రమే నల్లజాతి విజేతలు ఉన్నారు. వీరితో పాటు గౌరవ అవార్డులు అందుకున్న వారిని లెక్క వేసినా, 65కు మించరు. అంటే 93 ఏళ్ళలో కేవలం 2.07 శాతం నల్లజాతీయులు మాత్రమే ఆస్కార్స్ అందుకోగలిగారు. మరి ఈ సారి బరిలో ఉన్న నల్లజాతీయుల్లో బెస్ట్ పిక్చర్: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్),
బెస్ట్ యాక్టర్స్ : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మేగ్బెత్)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్: అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ఔంజిన్ ఎల్లిస్ (కింగ్ రిచర్డ్)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ : డిక్సన్, బెయాన్స్ నోలెస్, కార్టర్ (కింగ్ రిచర్డ్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: కార్లా ఫార్మర్, స్టేసీ మోరిస్ (కమింగ్ టు అమెరికా)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: స్టాన్లీ నెల్సన్ (అట్టికా), ఆమిర్ ‘క్వెస్ట్లోవ్’ థామస్ (సమ్మర్ ఆఫ్ సోల్)
బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్ : పాల్ టేజ్వెల్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
మాత్రమే ఉన్నారు. వీరిలో నల్లజాతీయుల కళ్ళలో ఎవరు ఆనందం నింపుతారో మార్చి 27న తేలనుంది.
