Nicole Kidman: హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులకు ఎంత క్రేజ్ ఉంటుందో, అదే స్థాయిలో ఆస్కార్ ఆనరరీ అవార్డులకూ గౌరవం ఉంటుంది. ఆ తరువాత అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుగా ‘ది అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’ (ఏఎఫ్ఐ) ప్రదానం చేసే జీవిత సాఫల్య పురస్కారం నిలుస్తుంది. 1973లో ఏఎఫ్ఐ అవార్డు ప్రదానం మొదలయింది. ఇప్పటిదాకా 48 మంది హాలీవుడ్, బ్రిటన్ సినీప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. కరోనా కారణంగా 2020-21 సంవత్సరాలలో ఎవరికీ పురస్కారం దక్కలేదు. ఈ యేడాది ఏఎఫ్ఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రముఖ బ్రిటిష్ నటి జూలీ ఆండ్రూస్ తన 86 ఏళ్ళ వయసులో అందుకున్నారు. కాగా, 49వ ఏఎఫ్ఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 55 ఏళ్ళ నికోల్ కిడ్మన్‌కు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. 2023 జూన్ 10న లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ప్రదానోత్సవంలో నికోల్ కిడ్మన్ ఈ అవార్డును అందుకోనున్నారు.
మొదటి నుంచీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అరవై ఏళ్ళు దాటిన వారికే ప్రదానం చేస్తూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే అత్యధికులు ఏడు పదులు దాటాకే ఈ అవార్డును అందుకున్నవారు ఉన్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారిని చిన్న వయసులోనే ఏఎఫ్ఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సన్మానించిన సందర్భాలున్నాయి. అలా పిన్నవయసులోనే ఈ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఘనత ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్‌కు దక్కుతుంది. ఆయన తన 46వ ఏట 2002లో ఈ అవార్డు అందుకున్నారు. అందరికంటే ఎక్కువ వయసులో ఈ అవార్డును సొంతం చేసుకున్నవారు నటి లిలియన్ గిష్. ఆమె తన 90వ ఏట 1984లో ఈ జీవిత సాఫల్య పురస్కారం పొందారు. అరవై ఏళ్ళలోపు ఈ అవార్డుకు ఎన్నికైన వారు ఎవరంటే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ (48), దర్శకుడు మార్టిన్ స్కార్ససె (54), నటి మెరిల్ స్ట్రీప్ (54), నటుడు జాక్ నికల్సన్ (56), నటుడు హారిసన్ ఫోర్డ్ (57), నటుడు జార్జి క్లూనీ (57), నటి బార్బరా స్ట్రెయిసాండ్ (58), నటుడు రాబర్ట్ డి నీరో (59) ఉన్నారు. వారి సరసన నికోల్ కిడ్మన్ చేరనుంది.
నికోల్ కిడ్మన్ 1967 జూన్ 20న జన్మించారు. అంటే మరో పది రోజులకు 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనగా.. నికోల్ 55 ఏళ్ళలోనే ఈ అవార్డును సొంతం చేసుకోబోవడం విశేషం! నికోల్ కిడ్మన్ కీర్తి కిరీటంలో ఇప్పటికే పలు అవార్డులూ, రివార్డులూ రత్నాల్లా వెలుగొందుతున్నాయి. ఇప్పటికీ ఐదుసార్లు ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ సంపాదించారామె. 2002లో తెరకెక్కిన ‘ద అవర్స్’ చిత్రంలో రచయిత్రి వర్జీనియా ఊల్ఫ్ పాత్రలో తనదైన బాణీ పలికించి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు నికోల్ కిడ్మన్. వాటితో పాటు ఓ సారి బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డునూ, రెండుసార్లు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులను, ఆరు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులనూ నికోల్ సొంతం చేసుకున్నారు. మరి ఏఎఫ్ఐ లైఫ్‌టైమ్‌అచీవ్ మెంట్ అవార్డు తరువాత నికోల్ నటజీవితంలో మరెన్ని పురస్కారాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
