Samantha: నటి సమంత రూత్ ప్రభు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన వర్క్‌ను కొనసాగిస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొన్ని మిర్రర్ సెల్ఫీల్లో తన పెరుగుతున్న బేబీ బంప్‌ను సమంత స్వయంగా చూపించడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆ ఫోటోలపైనే పడింది. తాజా ఫోటోల్లో సమంత చాలా సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించారు. రిలాక్స్‌డ్‌గా తీసుకున్న సెల్ఫీలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా తన పనికి బ్రేక్ ఇవ్వకుండా, వీలైనంత యాక్టివ్‌గా ఉంటూ ఈ కొత్త దశను ఆస్వాదిస్తున్నట్లు ఆమె ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవలే మాతృత్వం గురించి సమంత చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిల్లలు కలిగినా, కలగకపోయినా దాన్ని ప్రశాంతంగా అంగీకరించడానికి తాను, రాజ్ ఇద్దరూ సిద్ధంగా ఉన్నామని చెప్పిన సమంత.. ఇప్పుడు తమ జీవితంలోకి ఈ వార్త రావడం నిజంగా ఒక సర్‌ప్రైజ్ అని వెల్లడించారు. సమంత, రాజ్ నిడిమోరు కలిసి గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టుల కోసం పనిచేశారు. వీరి మధ్య ప్రేమ గురించి 2024లో పలు వార్తలు వచ్చినప్పటికీ, ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలాకాలం ప్రైవేట్‌గానే ఉంచారు. చివరకు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం సమంత సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ బిజీగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. సోనీ లివ్‌లో ప్రసారం కానున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ రియాలిటీ షోకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు తన ప్రెగ్నెన్సీ ప్రయాణానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న సమంత.. తాజాగా బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

