ఒకప్పుడు అందాలతో కనువిందు చేస్తూ అలరించిన హాలీవుడ్ భామ కేమరాన్ డియాజ్ మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట! ఇంతకు ముందు 2018లో కేమరాన్ డియాజ్ సినిమాలకు టాటా చెప్పేసింది. కానీ, ఫ్రెండ్ జామీ ఫాక్స్ అభ్యర్థనతో మళ్ళీ నటించడానికి అంగీకరించింది కేమరాన్. అయితే షూటింగ్స్ తో బోర్ కొట్టిందని, ప్రతీ చిత్రంలోనూ ఓ సమస్య రావడం, దానిని ఎదుర్కోవడం ఇదే తీరున కథలు సాగుతున్నాయని, దాంతో నటించడం కూడా కృతకంగా ఉంటోందని కేమరాన్ చెబుతోంది. అంతేకాదు తన భర్త బంజీ మాడన్, రాడిక్స్ తో గడిపేందుకు కూడా సమయం సరిపోవడం లేదని అంటోంది. లాంగ్ షెడ్యూల్స్ కారణంగా కుటుంబంతో గడపడం సాగడం లేదనీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఖచ్చితంగా సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని కేమరాన్ ప్రకటించింది.
హాలీవుడ్ లో సెక్స్ బాంబ్ గా పేరొందిన కేమరాన్ డియాజ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బ్రిటిష్ అకాడమీ అవార్డ్స్ లలో తన నటనకు గాను నామినేషన్స్ సంపాదించింది. విజేతగా నిలవక పోయినా, తన అందంతో కుర్రకారుకు బంధాలువేస్తూ పలు చిత్రాల్లో నటించింది. కేమరాన్ పేరు వినగానే “ద మాస్క్, ద బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, వనీలా స్కై, గ్యాంగ్స్ ఆఫ్ న్యూ యార్క్, చార్లీస్ ఏంజెల్స్ (సీక్వెల్స్)” వంటి చిత్రాలు చప్పున గుర్తుకు వస్తాయి. ఒకానొక దశలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటిగానూ కేమరాన్ రాజ్యం ఏలింది. ఇన్ని చూసిన తరువాత చిత్రసీమలో తాను చూడవలసింది ఏమీ లేదని కేమరాన్ భావిస్తోంది. అందువల్లే ఈ సారి తప్పకుండా సినిమాలకు గుడ్ బై చెబుదామనే ఆమె నిర్ణయించుకుంది. ఇప్పటికీ కేమరాన్ అందచందాలను తలచుకుంటూ సాగే అభిమానులు ఉన్నారు. మరి అలాంటి వారికి కేమరాన్ నిర్ణయం విచారం కలిగించక మానదు.