(అక్టోబర్ 1న శివాజీ గణేశన్ జయంతి)
అనేక విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసి, జనాన్ని విశేషంగా ఆకట్టుకున్న నటులు శివాజీ గణేశన్. తమిళనాట శివాజీ అభినయం భావితరాల వారికి పెద్దబాలశిక్షగా నిలచిందంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్, శివకుమార్, జైశంకర్, విక్రమ్, సూర్య వంటి వారు తమకు శివాజీ గణేశన్ నటనే ఆదర్శం అంటూ పలుమార్లు నొక్కివక్కాణించారు. నేడు జనం చేత ‘ఉలగనాయగన్’ గా జేజేలు అందుకుంటున్న కమల్ హాసన్ “శివాజీగారి నటనలో పది శాతం చేయగలిగినా చాలు…” అన్నారు. దీనిని బట్టే శివాజీ గణేశన్ అభినయంలో ఎంతటి మహిమ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.
శివాజీ గణేశన్ అసల పేరు వి. చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి. 1928 అక్టోబర్ 1న ఆయన తమిళనాడులోని విల్లుపురంలో జన్మించారు. గణేశమూర్తి పేరులోని ‘వి’ అంటే ‘విల్లుపురం’ అనేవారు కొందరయితే, కాదు ‘వేట్టైతిడాల్’ అని మరికొందరు చెబుతారు. శివాజీ తనయులు ‘వేట్టైతిడాల్’ అనే గ్రామం నుండే తమ పూర్వీకులు విల్లుపురం చేరారని అంటారు. తమ కన్నవారికి నాల్గవ సంతానంగా శివాజీగణేశన్ జన్మించారు. ఆకలి ఆయనకు అభినయం నేర్పించింది అని చెప్పవచ్చు. ఏడేళ్ల ప్రాయంలోనే టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీ వెంట తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. తన పదవ ఏట తిరుచ్చి వెళ్ళి అక్కడ మరో నాటక సంస్థలో చేరి వరుసగా నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు గణేశన్. ఆ నాటకసంస్థలో ఆరితేరిన కళాకారులు ఉండేవారు. వారి వద్ద భరతనాట్యం, కథక్, కథాకళి నేర్చుకున్నారు. తరువాతి రోజుల్లో అవే తనకు సులభంగా భావాలు పలికేలా చేశాయని చెప్పేవారు గణేశన్. యుక్తవయసు వచ్చేసరికి గణేశన్ భారీ సమాసభూయిష్టమైన వచనాలను సైతం అతిసులువుగా అభినయిస్తూ చెప్పేవారు. ముఖ్యంగా శివాజీ పాత్రలో ఆయన నటన అందరినీ అలరించేది. ‘శివాజీ కంద హిందూ రాజ్యం’ నాటకంలో శివాజీ పాత్ర అద్భుతంగా పోషించేవారాయన. ప్రముఖ సంఘసంస్కర్త ఇ.వి. రామస్వామి ఓ సారి శివాజీగా గణేశన్ అభినయం చూసి ‘శివాజీ గణేశన్’ అని పిలిచారు. అప్పటి నుంచీ శివాజీ గణేశన్ గా కొనసాగారు.
శివాజీ గణేశన్ మదరాసులో నాటకాలు వేస్తూ, తమిళ చిత్రాలలో నటించిన ప్రముఖ తెలుగునటులకు డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. మన తెలుగు నటులు ముక్కామలకు శివాజీ కొన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. శివాజీ నాటకాలు చూసిన పి.ఆదినారాయణరావు తాను నిర్మిస్తున్న ‘పరదేశి’ చిత్రంలో ఓ పాత్రకు ఆయనను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఏయన్నార్, అంజలీదేవి జంటగా నటించారు. ఏయన్నార్ మిత్రుని కొడుకుగా శివాజీ గణేశన్ కనిపించారు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే శివాజీకి తమిళంలో ‘పరాశక్తి’లో హీరోగా నటించే అవకాశం లభించింది. ‘పరాశక్తి’ ముందుగా విడుదలయింది. రామస్వామి ‘ద్రవిడ ఉద్యమం’లోని భావాలను చొప్పిస్తూ కరుణానిధి ఈ చిత్రానికి రచన చేశారు. క్లయిమాక్స్ లో కోర్టు సీన్ లో శివాజీ గణేశన్ భారీ డైలాగులు వల్లిస్తూ అభినయించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే శివాజీ గణేశన్ విజయం సాధించారు. అప్పటి నుంచీ వైవిధ్యమైన పాత్రలతో శివాజీ పయనం సాగింది. తనను చిత్రసీమకు పరిచయం చేసిన అంజలీదేవి, ఆదినారాయణరావుపై గౌరవంతో 1974లో వారు నిర్మించిన ‘భక్త తుకారాం’లో శివాజీగా కొద్ది సేపు నటించారు. ఆ రోజుల్లో తెలుగు, తమిళ జనం కలసి ఉండేవారు. కలసే నాటకాలు వేసేవారు. చిత్రాల్లో నటించేవారు. ఆ విధంగా తెలుగువారితో శివాజీ గణేశన్ కు విడదీయరాని అనుబంధం ఉండేది.
యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన తొలి చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ భరతునిగా నటించారు. తరువాత యన్టీఆర్ రామునిగా, శివాజీ గణేశన్ లక్ష్మణునిగా నాగయ్య నిర్మించి, నటించిన ‘భక్తరామదాసు’లో కనిపించారు. యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, శివాజీ గణేశన్ కర్ణునిగా నటించిన ‘కర్ణన్’ అపూర్వ విజయం సాధించింది. ఇక యన్టీఆర్ దర్శకత్వంలో ఏయన్నార్, శివాజీగణేశన్ ‘చాణక్య-చంద్రగుప్త’లో అభినయించారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన చిత్రాలు తెలుగులో యన్టీఆర్ హీరోగా కొన్ని సినిమాలు, ఏయన్నార్ కథానాయకునిగా కొన్ని మూవీస్ తెరకెక్కి అలరించాయి. అలాగే తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ నటించిన చిత్రాలను తమిళంలో శివాజీ గణేశన్ రీమేక్ చేసిన సందర్భాలు బోలెడున్నాయి. శివాజీ గణేశన్ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘వసంతమాళిగై’ నిలచింది. ఇది తెలుగులో ‘ప్రేమనగర్’ ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం.
ఆ తరువాత శివాజీ గణేశన్, కృష్ణతో కలసి “నివురుగప్పిన నిప్పు, విశ్వనాథనాయకుడు” వంటి చిత్రాలలో నటించారు. ఏయన్నార్, నాగార్జున తండ్రీకొడుకులుగా నటించిన ‘అగ్నిపుత్రుడు’లో ఓ కీలక పాత్రలో కనిపించారు శివాజీ. కృష్ణంరాజుతో రూపొందిన ‘జీవనతీరాలు’లోనూ ప్రధాన పాత్ర ధరించారాయన. ఇక తమిళనాట శివాజీని స్టార్ గా తీర్చిదిద్దింది మన తెలుగు వారయిన ఎల్.వి.ప్రసాద్. ఆయన తెరకెక్కించిన ‘మనోహర’ చిత్రంతో జానపద కథానాయకునిగా శివాజీ గణేశన్ విజయం సాధించారు. ఇదే ‘మనోహర’ చిత్రం తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకుంది. యస్వీరంగారావుతో కలసి అనేక తమిళ చిత్రాలలో శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో శివాజీగణేశన్ నటిస్తే ఆయనకు జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు. ఇలా తెలుగువారితో తనది విడదీయరాని బంధం అంటూ తరచూ చెప్పేవారు శివాజీ గణేశన్.
శివాజీ గణేశన్ తమిళంలో నటించిన అనేక విజయవంతమైన చిత్రాలు తెలుగువారినీ అనువాద రూపంలో ఆకట్టుకున్నాయి. శివాజీ అనువాద చిత్రాలలో “వీరపాండ్య కట్టబ్రహ్మన, బంగారు పతకం, విప్లవం వర్ధిల్లాలి” వంటి చిత్రాలు అలరించాయి. ‘వీరపాండ్య కట్టబొమ్మన’ తమిళ చిత్రం ద్వారా ఆఫ్రో ఏసియన్ చిత్రోత్సవంలో 1960లోనే ఉత్తమనటునిగా నిలిచారు శివాజీ గణేశన్. ఆ తరువాతే అదే చిత్రోత్సవంలో 1964లో ‘నర్తనశాల’ లోని కీచక పాత్రద్వారా ఎస్వీ రంగారావుకు ఉత్తమనటుడు అవార్డు లభించింది. తమిళ జనం మదిలో ‘నడిగర్ తిలగం’గా జేజేలు అందుకున్న శివాజీ గణేశన్, మరో తమిళ స్టార్ హీరో ఎమ్.జి.రామచంద్రన్ తో పోటీగా సాగారు. మాస్ రోల్స్ లో ఎమ్జీఆర్ అలరిస్తే, వరైటీ రోల్స్ తో శివాజీ ఆకట్టుకొనేవారు. కొందరు హాలీవుడ్ నటుడు మార్లన్ బ్రాండోతో శివాజీ అభినయాన్ని పోల్చేవారు.
తమిళ సినీరంగానికి, రాజకీయాలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రామస్వామి ఆరంభించిన ‘ద్రవిడ ఉద్యమం’ శివాజీని భలేగా ఆకర్షించింది. రామస్వామి భావాలను పలికిస్తూ కరుణానిధి రాసిన అనేక రచనలతో రూపొందిన చిత్రాలలో శివాజీ గణేశన్ నటించి ఆకట్టుకున్నారు. రామస్వామి తరువాత అన్నాదొరై ఆధ్వర్యంలో నెలకొన్న ‘ద్రవిడ మున్నేట్ర కళగం’ పార్టీలో శివాజీ క్రియాశీలంగా వ్యవహరించేవారు. ఆ పార్టీ నాస్తిక భావాలకు ఆయన దూరంగా ఉండేవారు. ఒకసారి తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని శివాజీ దర్శించుకోవడంపై అప్పట్లో డీఎమ్.కే. పార్టీలో విమర్శలు తలెత్తాయి. దాంతో ఆయన ఆ పార్టీ వీడి నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నసమయంలో శివాజీ దక్షిణ భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అదే సమయంలో 1978 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దక్షిణ భారత కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో శివాజీ ఆయనకు ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు గెలిచి, తరువాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ గానూ ఉన్నారు. ఇందిరా గాంధీ శివాజీ గణేశన్ ను రాజ్యసభ సభ్యునిగా నియమించారు. ఆమె మరణంతో శివాజీ రాజకీయ జీవితం కూడా మసకబారింది. తెలుగునాట యన్టీఆర్ ఘనవిజయం చూసిన శివాజీ గణేశన్ 1988లో తానూ సొంతగా ‘తమిళగ మున్నేట్ర మున్నాని’ అనే పార్టీని నెలకొల్పి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దాంతో వి.సి.సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ లో చేరారు. తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అనేక విలక్షణమైన పాత్రలకు సలక్షణంగా జీవం పోసిన శివాజీ గణేశన్ కీర్తి కిరీటంలో మేలిమి రత్నాలెన్నో పొదిగాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి జాతీయ అవార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే యన్టీఆర్ జాతీయ అవార్డునూ ఆయన అందుకున్నారు. 1995లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘చెవిలియర్’ అవార్డుతోనూ గౌరవించింది. ఆయన వారసుడు ప్రభు కూడా అనేక చిత్రాలలో హీరోగా నటించి అలరించారు. అయితే కమల్ హాసన్ ను తన నటవారసునిగా శివాజీ ప్రకటించడం విశేషం! 2001 జూలై 21న శివాజీ గణేశన్ కన్నుమూశారు. శివాజీ అభినయ వైభవం ఈ నాటికీ తమిళ జన హృదయాల్లో వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.