Site icon NTV Telugu

Chandra Hass : హీరోగా బుల్లితెర ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌

Prabhakar

Prabhakar

బుల్లితెర మెగాస్టార్‌ ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్‌) తనయుడు చంద్రహాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్నాడు. 17వ తేదీ తన పుట్టినరోజు పురస్కరించుకుని శుక్రవారం ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియా ముందుకు వచ్చారు. అతను నటిస్తున్న చిత్రాల పోస్టర్‌లను చంద్రహాస్‌ తల్లి మలయజ విడుదల చేశారు. మీడియా మిత్రుల సమక్షంలో చంద్రహాస్‌ కేక్‌ కట్‌ చేసి ఓ రోజు ముందే పుట్టినరోజు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. నాలా మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటననే వృత్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నాడు. ఓ వైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు సినిమా హీరోకు కావాల్సిన ఫైట్స్‌, డాన్స్‌, యాక్టింగ్‌ వంటి అంశాల్లో శిక్షణతో తనను తాను తీర్చి దిద్దుకున్నాడు. యూట్యూబ్‌లో నాటు నాటు అనే కవర్‌ సాంగ్‌ తనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతే కాదు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. వాటితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్‌ చేశాం. దీనికి కథ, స్క్రీన్‌ప్లేను నేను అందిస్తున్నాను. ముందు రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. తను హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

 

చంద్రహాస్‌ తల్లి మలయజ మాట్లాడుతూ ‘చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. పట్టుబట్టి హీరోగా మారుతున్నాడు. తను నిర్మాతలకు ఎప్పుడూ ఎస్సెట్‌ కావాలి అని కోరుకుంటున్నాను’ అన్నారు. చంద్రహాస్‌ మాట్లాడుతూ ‘ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు, టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌ ఇలా షూటింగ్‌ వాతావరణంలోనే పెరిగాను. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. పరిశ్రమలో అడుగుపెట్టేటప్పుడు బిహేవియర్‌ చాలా ముఖ్యం. నాన్నగారి కెరీర్‌లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ కళ్లారా చూశాను. ఆయన బిహేవియర్‌తోనే ఇప్పటికీ వ్యక్తిగా అందరూ ఇష్టపడే స్థాయిని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి ఎటువంటి లోపం లేకుండా కృషి చేస్తాను. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ను చూసి స్ఫూర్తి చెందాను’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో చంద్రహాస్‌ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకలు, ఇతర టెక్నీషియన్స్‌ను మీడియాకు పరిచయం చేశారు.

Exit mobile version