మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు.
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. అయితే ‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్యే ఉండనుంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నాడు. ఇక మంచు విష్ణు కూడా నేడు తన ప్యానల్ ను ప్రకటించేశారు. ఆయన ప్యానల్ నుంచి సీనియర్ నటుడు బాబు మోహన్ వైస్ ప్రెసిడెంట్ గా, రఘుబాబు జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు.
అయితే, తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై నరేశ్ స్పందించారు. విష్ణు ప్యానల్ చాలా బాగుందని నరేశ్ ప్రశంసించారు. ప్యానల్ సభ్యులెవరికీ ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. అందరూ చదువుకున్నవారేనని చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులను ఎంపిక చేశారని చెప్పారు. మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. విష్ణు విజయం సాధించాలని కోరుకుంటున్నానని నరేశ్ తెలిపారు.
