NTV Telugu Site icon

Prakash Raj: విలక్షణానికి మరోపేరు ప్రకాశ్ రాజ్!

Prakash Raj

Prakash Raj

విలక్షణమైన అభినయానికి సలక్షణమైన రూపం ప్రకాశ్ రాజ్. కేవలం నటునిగానే కాదు, దర్శకనిర్మాతగానూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశ్. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటిస్తూ ఆల్ ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆయన ముక్కుసూటితనం సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వివాదాలకూ దారితీస్తూ సాగుతుంది. ఒకప్పుడు షూటింగ్స్ కు సరైన సమయానికి రాడని, క్రమశిక్షణ చర్యల కింద ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ కూడా చేశారు.కానీ, ప్రకాశ్ రాజ్ మాత్రమే పోషించదగ్గ పాత్రలు ఆయన కోసం పరుగులు తీశాయి. ఆయన క్రమశిక్షణారాహిత్యంపై జనం ఏమీ పట్టించుకోలేదు. ఆయన నటించిన చిత్రాలను చూడటానికి ప్రేక్షకులూ ఉరకలు వేశారు. ఈ నాటికీ ప్రకాశ్ రాజ్ క్రేజ్ ఉన్న యాక్టర్ గానే సాగుతూ ఉండడం విశేషం!

Read Also: Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూ.. కేంద్రంపైనే నిందలా?

ప్రకాశ్ రాజ్ అసలు పేరు ప్రకాశ్ రాయ్. 1965 మార్చి 26న బెంగళూరులో జన్మించారు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్ లో చదివిన ప్రకాశ్ రాజ్ తరువాత సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చేరారు. అప్పటి నుంచే ఆయనకు నటనాభిలాష కలిగింది. నాటకాలు రాసి, నటించేవారు. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ కు నటి గీత, ప్రకాశ్ ను పరిచయం చేశారు. బాలచందర్ సూచన మేరకే ప్రకాశ్ తన పేరులో ‘రాయ్’ బదులుగా ‘రాజ్’ చేర్చుకున్నారు. కళాక్షేత్రలో నాటకాలు వేస్తూ సాగారు. ఆరంభంలో కన్నడ చిత్రాలలో తళుక్కుమన్నారు ప్రకాశ్. బాలచందర్ ‘డ్యుయెట్’ సినిమాతో తమిళ సినిమారంగంలో అడుగు పెట్టారు. ఆపై జగపతిబాబు హీరోగా ఎ.ఎమ్.రత్నం రూపొందించిన ‘సంకల్పం’తో తెలుగువారి ముందు తొలిసారి కనిపించారు ప్రకాశ్ రాజ్. తరువాత మళయాళ సినిమాల్లోనూ నటించారు. ఎస్వీకృష్ణారెడ్డి ‘వినోదం’తో మరోమారు తెలుగువారి ముందుకు వచ్చిన ప్రకాశ్ రాజ్ ఈ సారి ఆకట్టుకున్నారు. వెంటనే ఎస్వీకృష్ణారెడ్డి తన ‘గన్ షాట్’లోనూ ప్రకాశ్ కు కీలకమైన పాత్రను అందించారు.

నటునిగా తొలి రోజుల్లో ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఇద్దరూ కలసి తిరిగేవారు. వారిద్దరూ తరువాత తోడల్లుళ్ళు కూడా అయ్యారు. అలా ‘పవిత్రబంధం’ చిత్రంలో శ్రీహరి, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ విలనీ పండించారు. పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’లో “నేను మోనార్క్ ని… నన్నెవరూ మోసం చేయలేరు…” అంటూ ప్రకాశ్ భలేగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత చిరంజీవి ‘చూడాలనివుంది’లోనూ కీలకమైన పాత్రలో “వాడు సామాన్యుడు కాదు…” అని పదే పదే చెబుతూ మురిపించారు ప్రకాశ్ రాజ్. తమిళ, కన్నడ చిత్రాల్లోనే అంతకు ముందు ఎక్కువగా కనిపించిన ప్రకాశ్ రాజ్, ఆ పై తెలుగు చిత్రాలలోనే బిజీ అయిపోయారు. కృష్ణవంశీ ‘అంతఃపురం’లో ప్రకాశ్ రాజ్ నటనకు స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డు లభించింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి చిత్రాలలోనూ ప్రకాశ్ రాజ్ నటించి, తెలుగువారికి మరింత చేరువ అయ్యారు. అనేక తెలుగు చిత్రాలద్వారా నంది అవార్డులు అందుకున్నారు. ‘కాంచీవరం’ తమిళ చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలిచారు ప్రకాశ్ రాజ్. ‘అంతఃపురం’ హిందీ రీమేక్ అయిన షారుఖ్ ఖాన్ ‘శక్తి- ద పవర్’లోనూ ప్రకాశ్ రాజ్ తనదైన బాణీ పలికించారు. తరువాత నుంచీ హిందీ చిత్రాలలోనూ ప్రకాశ్ రాజ్ నటిస్తూ సాగారు.

Read Also: నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

ఈ సంక్రాంతికి విడుదలైన ‘వారసుడు’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలలోనూ ప్రతినాయక పాత్రల్లో నటించి, ఆకట్టుకున్నారు ప్రకాశ్ రాజ్. పలుమార్లు ప్రకాశ్ రాజ్ పని అయిపోయిందని సినీజనం భావించారు. కానీ, ప్రతీసారి ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా ప్రకాశ్ రాజ్ తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. ‘శాకుంతలం’లో సారంగి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ -2’లో సుందర చోళ పాత్ర పోషించారు. ఇవి కాకుండా “వరాల్, వాయిస్ ఆఫ్ సత్యనాదన్, కుంజమ్మినీస్ హాస్పిటల్” అనే మూడు మళయాళ సినిమాల్లోనూ ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మరిన్ని చిత్రాలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.

Show comments