Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ కిడ్ అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ తలరాత ఏంటో కానీ ఇంకా తండ్రి చాటు తనయుడుగానే ఉన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా ఆ అతనికి స్టార్ హీరో అనే పేరు మాత్రం రాలేదు. ఇక అందాల సుందరి ఐశ్వర్య రాయ్ ను వివాహమాడిన అభిషేక్ ప్రస్తుతం తనదైన స్టైల్లో నటుడిగా ఎదగడానికి కష్టపడుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు అభిషేక్ తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ షాక్ ఇస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న కూతురు ఆరాధ్యను ట్రోల్ చేస్తే.. తనను, తన భార్యను అనడానికి మీరందరు అర్హులు.. ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం కోసమే మేము కష్టపడుతున్నాం కాబట్టి.. కానీ నా కూతురిపై ట్రోల్స్ చేయడానికి మీరు ఎవరు అని నిర్మొహమాటంగా అడిగేశాడు. ఇక అప్పట్లో అభిషేక్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తాజాగా మరోసారి అభిషేక్ బాలీవుడ్ హాట్ టాపిక్ గా నిలిచాడు. తనను ఏమన్నా పడతానేమో కానీ, తన తండ్రిని ఏదైనా అంటే భరించనని ఒక షో నుంచి బయటికి వెళ్లిపోవడం షాకింగ్ కు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. బుల్లితెరపై రితేష్ దేశముఖ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘కేస్ తో బన్ తా హై. ఈ షోలో కామెడీ, పంచులు అన్ని ఉంటాయి. ఇక ఈ షోలో తాజాగా జూనియర్ బచ్చన్ పాల్గొన్నాడు. షో మధ్యలో రితేష్ .. అమితాబ్ పై జోకు వేశాడు.ఇక దానికి అభిషేక్ సీరియస్ అయ్యాడు. తాను ఫూల్ కాదని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కోపంతో ఆ షో నుంచి వాకౌట్ చేశాడు. ” నేను ఈ షో లో పాల్గొనడానికి వచ్చాను. నా తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. నన్ను ఏమైనా అనండి.. నాపై జోక్స్ వేయండి పడతాను.. కానీ, మీరు హద్దు దాటి ప్రవరిస్తున్నారు. నా తండ్రిపై జోకులు వేస్తే అస్సలు బాగోదు”అని చెప్పి స్టేజి నుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై చాలామంది అభిషేక్ కు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బి పై జోకులు ఏంటీ..? అభిషేక్ చేసింది కరెక్ట్ అని చెప్పుకొస్తున్నారు.
