Aathmika Counter To Shankar Daughter Aditi: దక్షిణాది చిత్రసీమలో నెపోటిజం ఎప్పట్నుంచో ఉందో కానీ, దీనిపై ఎవ్వరూ పెద్దగా నోరు మెదిపింది లేదు. ఎందుకంటే.. చాలామంది తమ ప్రతిభతోనే ఇండస్ట్రీలో నిలబడగలిగారు కాబట్టి! వారసత్వంతో పరిశ్రమలోకి వచ్చినా, తమదైన సత్తా చాటుకోవడం వల్ల సినీ ప్రియులు వారిని అభిమానిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండానే వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకుంటున్నారు. ఇదే ఆత్మికకు మండిపోయేలా చేసింది. అందుకే, ఆమె పరోక్షంగా నెపోటిజంపై ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితినే టార్గెట్ చేసింది.
అదితి శంకర్ ఇప్పటివరకూ చేసింది ఒక్క సినిమానే! అయితే.. ఆమెకు ఆఫర్లు మాత్రం బోలెడన్ని వచ్చి పడుతున్నాయి. స్టార్ల సరసన నటించే ఛాన్సులు కొల్లగొడుతోంది. సింగర్‌గానూ రాణిస్తోంది. కానీ.. సినీ పరిశ్రమలో ఎంతోకాలం నుంచి శ్రమిస్తున్న ఆత్మికకు మాత్రం పెద్దగా ఛాన్సులు లేవు. తాను తెరంగేట్రం చేసిన ‘మిసాయి మురుకు’ మంచి విజయం సాధించినా, నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టినా.. ఆత్మికకు ఆఫర్లేమీ రావడం లేదు. కానీ, శంకర్ కూతురు అదితికి మాత్రం స్వయంగా అవకాశాలే వచ్చి వాలుతున్నాయి. ఒకదాని తర్వాత మరొక ఛాన్సులు అందిపుచ్చుకుంటూ.. ఫుల్ బిజీ అయిపోయింది. దీంతో మండిపోయిన ఆత్మిక.. ట్విటర్ మాధ్యమంగా పరోక్షంగా అదితికి చురకలు అంటించింది.
‘‘వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లందరూ నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా! మరి.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటి?’’ అంటూ కన్నీరు కార్చే ఓ ఎమోజీని షేర్ చేసింది ఆత్మిక. ఇప్పుడు ఈ ట్వీట్ కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అదితిని టార్గెట్ చేసుకునే ఆత్మిక ఆ ట్వీట్ చేసిందని అక్కడి మీడియా కోడై కూస్తోంది. కాగా.. అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్‌గా చాన్స్ కొట్టేయగా.. తాజాగా శివ కార్తికేయన్ సినిమాలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది.
