చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ ఇది అందుకు భిన్నమైన యాక్టర్ అయిన డాక్టర్ కథ. అవును…. డాక్టర్ అలేఖ్యను తన సినిమాలో హీరోయిన్ గా చేయాలని కలలు కన్న ఓ మేకర్ కథ కూడా ఇది. సుధీర్ బాబు, కృతీశెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ట్రైలర్ ను సోమవారం ప్రిన్స్ మహేశ్ బాబు సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు. బి. మహేంద్ర బాబు, కిరణ్ బళ్ళపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ నెల 16న జనం ముందుకు రాబోతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైయింది. కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం,చెడు అభిప్రాయం ఉంటాయి. ఇలాంటి నేపధ్యంలో నటి, దర్శకుడి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథా సారాంశం. సినిమాలంటే అందరికీ ఇష్టమే. అయితే ఇండస్ట్రీపై కొంతమందికి చెడు అభిప్రాయం ఉంటుంది. ఈ అంశం కారణంగా తమ కుమార్తెలను పరిశ్రమకు పంపేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తుంటారు. ఇంద్రగంటి ఈ సినిమాకి కథాంశంగా ఇదే సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. విశేషం ఏమంటే…. గతంలో సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ మూవీ కూడా సినిమా నేపథ్యంలో తెరకెక్కిందే. అందులో హీరోయిన్ నిజ జీవితంలో సినిమా కథానాయిక. హీరో తండ్రికి సినిమా నటుడు కావాలనే తీవ్రమైన కోరిక.
సో… ఇప్పుడు మరోసారి వీరిద్దరూ సినిమా నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని చేశారని అనుకోవాలి. ఈ ట్రైలర్ లో సుధీర్ బాబు యంగ్ ఫిల్మ్ మేకర్ గా ఛార్మింగా కనిపించాడు, భావోద్వేగాలని కూడా అద్భుతంగా చూపించాడు. నటిని కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి అందంగా వుంది. ఆమె పాత్ర కథపై ఆసక్తిని పెంచుతోంది. వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచారు. మిగతా నటులు తమ పాత్రలని సమర్ధవంతంగా పోషించారు. సినిమాటోగ్రాఫర్ పిజి విందా అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో వివేక్ సాగర్ సంగీతం క్లాస్‌గా వినిపించింది. ఈ ట్రైలర్‌ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటు కథలో సంఘర్షణని కూడా చూపించి సినిమాపై అంచనాలు పెంచింది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలో హీరో ఉన్నట్టు, అతన్ని ఏదో రకంగా సేవ్ చేయాలనే ఆలోచనతోనే డాక్టర్ అలేఖ్య అతని సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. మరి ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఏ రీతిన జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.
Happy to launch the trailer of #AaAmmayiGurinchiMeekuCheppali…looks like an interesting one! All the best to @isudheerbabu @IamKrithiShetty, #MohanaKrishnaIndraganti and the entire team!https://t.co/fGU4r3CraX@MythriOfficial @benchmarkstudi5
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2022
