A Petition Seaks Stay On Adipurush Release Filed In Delhi Court: ఏ ముహూర్తాన ఆదిపురుష్ టీజర్‌ని విడుదల చేశారో గానీ.. అప్పట్నుంచి ఇది తరచూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. తొలుత గ్రాఫిక్స్ నాసిరకంగా ఉందని విమర్శలు ఎక్కుపెడితే.. ఆ తర్వాత ఇందులో రాముడు, హనుమంతుడు, రావణ పాత్రల్ని తప్పుగా చూపించారని హిందూ సంఘాలు సహా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్న సన్నివేశాల్ని తొలగించాలని.. లేకపోతే సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపుతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ తలనొప్పులు చాలదన్నట్టు.. ఇప్పుడు మరో కొత్త వివాదంలో ఈ సినిమా చిక్కుకుంది. యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ‘ఆదిపురుష్’ టీజర్‌ని తొలగించడంతో పాటు.. సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ టీజర్‌లో రాముడు, హనుమంతుడ్ని అసమంజసంగా చూపించారని.. ఆ రెండు పాత్రలకు ఇందులో తోలు పట్టీలు ధరించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఇద్దరితో పాడు రావణుడ్ని సైతం తప్పుగా చూపించారన్నారు. రాజ గౌరవ్ అనే న్యాయవాది.. ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్‌లకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తీస్ హజారీ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అభిషేక్ కుమార్ ఎదుట విచారణకు సోమవారం లిస్ట్ చేశారు. ఈ టీజర్‌లో హిందువుల మత, సాంస్కృతిక, చారిత్రక, నాగరికత మనోభావాలను దెబ్బతీసే విధంగా రాముడు, హనుమంతుడు రావణుడి పాత్రలను చూపించారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. హిందూ విశ్వాసం ప్రకారం.. రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండే వ్యక్తి ఉంటారన్నారు. కానీ.. ఈ టీజర్‌లో మాత్రం రాముడ్ని కోపంగా, ఇతరుల్ని చంపే భావనల్ని కలిగి ఉన్న వ్యక్తిగా చూపించారంటూ మండిపడ్డారు.
అలాగే.. సైఫ్ అలీఖాన్ పోషించిన రావణుడి పాత్ర చాలా చౌకగా చూపించారని పిటీషన్‌దారుడు పేర్కొన్నారు. బాయ్-కట్, క్రూకట్ హెయిర్‌స్టైల్‌తో చెవులపై బ్లేడ్ గుర్తులతో ఉన్నాయని.. అతను గబ్బిలంపై స్వారీ చేస్తున్నట్లు చూపించారని చెప్పారు. నిజానికి.. రావణుడు శివుడి పరమభక్తుడని, అతను మనోహరమైన దుస్తులు ధరించడంతో పాటు మీసాలు కూడా కలిగి ఉంటాడని, ఎల్లప్పుడూ బంగారు కిరీటంతో ఉంటాడని తెలిపారు. అలాగే.. తన అద్భుతమైన పుష్పక్ యాన్‌లో సవారీ చేస్తాడన్నారు. దసరా సందర్భంగా అతని దిష్టిబొమ్మను ఉత్తర భారతంలో దహనం చేసినప్పటికీ.. చాలా ప్రదేశాల్లో రావణుడు పూజించబడతాడన్నారు. అలాంటి రావణుడ్ని, మధ్యప్రాచ్య ఆసియాకు చెందిన వ్యక్తిగా, భారతదేశంపై దండెత్తిన మొఘల్ పూర్వీకుడిగా చూపించారని పిటిషన్‌దారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టీజర్‌ని నిషేధిస్తూ.. సినిమా విడుదలపై స్టే విధించాల్సిందిగా కోర్టుని కోరారు.
