NTV Telugu Site icon

Naga Rahavu: తొలి స్లోమోషన్ సాంగ్ సినిమా ‘నాగరహావు’!

Nagarahavu

Nagarahavu

Naga Rahavu: కన్నడ చిత్రసీమలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు విష్ణువర్ధన్. ఆయన అసలు పేరు సంపత్ కుమార్. 1971లో ‘వంశవృక్ష’ చిత్రంలో తొలిసారి కుమార్ పేరుతో తెరపై కనిపించారు విష్ణువర్ధన్. ప్రముఖ కన్నడ దర్శకులు పుట్టన్న కణగల్ ఆయన పేరును విష్ణువర్ధన్ గా మార్చి, ‘నాగరహావు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఈ ‘నాగరహావు’ 1972 డిసెంబర్ 29న విడుదలయింది. కన్నడనాట ‘నాగరహావు’ కమర్షియల్ సక్సెస్ ను చూడడమే కాదు, కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఈ సినిమాద్వారా విష్ణువర్ధన్, అంబరీశ్, ఆరతి ఎంతో పేరు సంపాదించారు. తరువాతి రోజుల్లో కన్నడ చిత్రసీమలో నటులుగా రాణించారు. ‘నాగరహావు’ సినిమాతో విష్ణువర్ధన్ కు ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఆధారంగానే తెలుగులో శోభన్ బాబుతో ‘కోడెనాగు’ చిత్రం తెరకెక్కింది. మన దేశంలో తొలి స్లోమోషన్ సాంగ్ తో రూపొందిన చిత్రంగా ‘నాగరహావు’ చరిత్రలో నిలచింది. ఇందులోని “బారే బారే..” అంటూ సాగే పాటను పూర్తిగా స్లోమోషన్ లో చిత్రీకరించడం విశేషం!

‘నాగరహావు’ కథలోకి తొంగి చూస్తే.. చిన్నతనం నుంచీ రామాచారి గడుగ్గాయిగా ఉంటాడు. పాములోడు పామును ఆడిస్తూ ఉంటే, దానిని పట్టుకుపోయి ఆనందిస్తాడు. పెద్దయ్యాక పరీక్షల్లో కాపీ కొడుతూ ఉంటే, బయటకు పంపించిన ప్రిన్సిపల్ ను బట్టలూడదీసి కరెంట్ స్తంభానికి కడతాడు. అతని ఆగడాలకు తల్లిదండ్రులు కుమిలి పోతుంటారు. అయితే రామాచారికి చిన్నప్పుడు విద్యనేర్పిన చమయ్య మాత్రం అతడిని అర్థం చేసుకుంటూ ఉంటాడు. రామాచారికి ముక్కుమీద కోపం ఉంటుంది. కోపం వస్తే తానేమి చేస్తున్నాడో తెలియకుండా చేసేస్తూ ఉంటాడు. రామాచారికి కాలేజ్ ఫ్రెండ్ వరద. అతని చెల్లెలు అలిమేలును జలీల్ అనేవాడు ఏడ్పిస్తూ ఉంటాడు. వాడు వరదను కూడా కొడతాడు. ఇది తెలిసిన రామాచారి వాడిని చితగ్గొడతాడు. తరువాత రామాచారి, అలిమేలు ప్రేమించుకుంటారు. కానీ, ఆమె కన్నవారు తమ కులం వాడికే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అలిమేలు తన మనసులో మాట కన్నవారితో చెబుతుంది. కానీ, వారు బలవంత పెడతారు . విషయం రామాచారి గురువు చమయ్య చెంతకు చేరుతుంది. స్వార్థపూరితమైన ప్రేమ కన్నా, త్యాగం మిన్న అని గురువు బోధిస్తాడు. ఆయన మాటపై రామాచారి తన ప్రేమను త్యాగం చేస్తాడు. కొన్నాళ్ళ తరువాత రామాచారి, అలిమేలును ఓ స్టార్ హోటల్ లో కాల్ గళ్ గా చూస్తాడు. ఆమె భర్తనే ఆ వృత్తిలోకి బలవంతంగా తోశాడని చెబుతుందామె.

తరువాత రామాచారి జీవితంలోకి మార్గరెట్ ప్రవేశిస్తుంది. ఆమెతో పోట్లాడి, అహం దెబ్బతినడంతో మార్గరెట్ ను ముద్దు పెట్టుకుంటాడు రామాచారి. ఆమె అతడిని ప్రేమిస్తుంది. అలిమేలును మరచిపోతున్న సమయంలోనే మార్గరెట్ కనిపించడంతో ఆమెకు దగ్గరవుతాడు రామాచారి. మళ్ళీ సమాజంలో ఓ బ్రాహ్మణ అబ్బాయికి, క్రిస్టియన్ అమ్మాయికి పెళ్ళేంటన్న చర్చ సాగుతుంది. మరోసారి చమయ్య మధ్యలో వస్తాడు. శిష్యుడికి ప్రేమకన్నా త్యాగం మిన్న అని చెబుతాడు. కానీ, ఈసారి గురువునే ఎదురు ప్రశ్నిస్తాడు శిష్యుడు. ఒకవేళ ఆ అమ్మాయిని చేసుకుంటే తన శవం చూస్తావంటాడు గురువు. అనుకోకుండా నిజంగానే పై నుండి చమయ్య పడి మరణిస్తాడు. తన గురువుకు చావులోనైనా తోడుగా ఉండటానికి నిర్ణయించుకుంటాడు రామాచారి. ఈ విషయం మార్గరెట్ తో చెబుతాడు. ఆమె కూడా ఈ సమాజం నుండి దూరంగా పోయి జీవించడానికే అంగీకరిస్తుంది. అలాగే రామాచారితో కలసి చావడానికీ ఆనందంగా ఒప్పుకుంటుంది. రామాచారి, మార్గరెట్ ఇద్దరూ కొండపై నుండి దూకి కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.

రామాచారిగా విష్ణువర్ధన్, అలిమేలుగా ఆరతి, మార్గరెట్ గా శుభ, చమయ్యగా కె.యస్.అశ్వథ్ నటించిన ఈ చిత్రంలో హెచ్.ఆర్.శాస్త్రి, ప్రతిమాదేవి, లీలావతి, ఎమ్.జయశ్రీ, అంబరీశ్, ఎమ్.ఎన్.లక్ష్మీదేవి, శివరామ్, లోకనాథ్, ధీరేంద్రగోపాల్, వజ్రముని, శక్తిప్రసాద్ నటించిన ఈ చిత్రంలో “ఒనకే ఒబవ్వా..” పాటలో జయంతి అతిథి పాత్రలో కనిపించారు. హైదర్ అలీని ఎదిరించిన ధీరవనితగా ఒనకే ఒబవ్వా పేరు సంపాదించారు. ఆమె వీరగాథ నేపథ్యంలో ఈ పాట రూపొందింది. విజయ్ భాస్కర్ స్వరకల్పనలో చి.ఉదయ్ శంకర్, విజయ నరసింహా, ఆర్.యన్. జయగోపాల్ పాటలు పలికించారు. ఇందులోని “బారే బారే..” పాట భారతదేశంలో స్లోమోషన్ లో పూర్తిగా తెరకెక్కిన పాటగా నిలచిపోయింది. “హావిన ద్వేష హన్నెరుడు వర్ష..”, “కన్నడ నాడిన..”, “కర్పూరద గొంబె..”, “సంగమ సంగమ..”, “కథ హేలువే..” అంటూ సాగే పాటలు సైతం ఎంతగానో అలరించాయి.

‘నాగరహావు’ చిత్రానికి అదే పేరుతో మూడు నవలలుగా వచ్చిన టి.ఆర్.సుబ్బారావు కథ ఆధారం. ఈ సినిమా చూసి “పుట్టన్న నా కథను ‘నాగుపాము’లా కాకుండా ‘ఎలుకపాము’లా చిత్రీకరించారు” అన విమర్శించారు సుబ్బారావు. తరువాతి రోజుల్లో ఆయన సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ సినిమా కన్నడ నాట విడుదలై విజయఢంకా మోగించింది. దీనిని పుట్టన్న దర్శకత్వంలోనే హిందీలో రిషి కపూర్ హీరోగా ‘జహ్రీలా ఇన్ సాన్’ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో కె.యస్.ప్రకాశరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ, లక్ష్మితో ‘కోడెనాగు’ పేరుతో యమ్.యస్.రెడ్డి నిర్మించారు. తమిళంలో ‘రాజా నాగమ్’ పేరుతో రూపొందించారు. ఏది ఏమైనా విష్ణువర్ధన్ ను స్టార్ గా నిలిపిన చిత్రంగా ‘నాగరహావు’ నిలచింది.