Dhanama Daivama: నటరత్న యన్.టి.రామారావుకు, నిర్మాత డి.వి.యస్.రాజుకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది! యన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ ‘యన్.ఏ.టి.’లో డి.వి.యస్.రాజు భాగస్వామిగా ఉన్నారు. తరువాత కొన్ని సినిమాలు నిర్మించినా, తమ ‘డి.వి.యస్. ప్రొడక్షన్స్’ పతాకంపై యన్టీఆర్ తోనే చిత్ర నిర్మాణం ఆరంభించారు. రామారావుతోనే ఎక్కువ చిత్రాలు నిర్మించారు రాజు. యన్టీఆర్ తో “మంగమ్మశపథం, పిడుగురాముడు, తిక్కశంకరయ్య, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా?దైవమా?” వంటి చిత్రాలు నిర్మించారు డి.వి.యస్.రాజు. రామారావు, రాజు కలయికలో రూపొందిన చివరి చిత్రంగా ‘ధనమా?దైవమా?’ నిలచింది. ఈ సినిమా 1973 మే 24న విడుదలయింది.
‘ధనమా? దైవమా?’ చిత్రకథ ఏమిటంటే – లాయర్ రామచంద్రరావు, ఆయన భార్య జానకి అన్యోన్య దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు. రామచంద్రరావు తమ్ముడు మోహన్, చెల్లెలు శాంత వారితోనే ఉంటారు. దేవుణ్ణే నమ్ముకున్న కుటుంబం వారిది. రామచంద్రరావు మాత్రం తరచూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన వారినుండి కనీసం ఫీజు తీసుకోవడానికి కూడా మొహమాట పడే ప్లీడర్ ఆయన. కానీ, ఆయన తెలివితేటలు తెలిసిన వారు నిజాయితీని వీడితే ఎంతో సంపాదించ వచ్చునని అంటూంటారు. తన కుటుంబంలో వరుసగా సంభవించిన పరిస్థితుల కారణంగా రామచంద్రరావుకు దేవుడంటే విశ్వాసం పోతుంది. అడ్డదారుల్లో పయనిస్తాడు – లక్షలు సంపాదిస్తాడు. కానీ, ఆయనకు మనశ్శాంతి ఉండదు. రామచంద్రరావు అందం, ఐశ్వర్యం చూసి వైజయంతీ అనే టక్కులాడి వలలో వేసుకోవాలని చూస్తుంది. భార్యాబిడ్డలను సైతం అశ్రద్ధ చేసే స్థితికి వస్తాడు రామచంద్రరావు. భార్య జానకి అనారోగ్యం పాలవుతుంది. ఆమె బాగుపడాలని ఎంతయినా ఖర్చు చేస్తానని అంటాడు. కానీ, ఆమెకు భర్త సాహచర్యమే మందు అన్న విషయం అతనికి తెలియదు. అలాగే భార్య అనురాగంతోనే తాను బాగుపడతానన్న సత్యం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. వైజయంతి సహచరుడైన భూపతి, రామచంద్రరావు చెల్లెలు శాంతను మానభంగం చేసి ఉంటాడు. ఈ విషయం రామచంద్రరావుకు చెబుతానని అంటుంది వైజయంతి. ఆమెను పొడిచేసి పారిపోతాడు భూపతి. అదే సమయంలో అక్కడకు వచ్చిన రామచంద్రరావుకు నిజం చెప్పి కన్నుమూస్తుంది వైజయంతి. అలాగే రామచంద్రరావు తమ్ముడు మోహన్ కూడా ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయి ఉంటాడు. అతడినీ భూపతి మోసం చేస్తాడు. విషయం తెలిసిన రామచంద్రరావు, భూపతిని చిత్తు చేసి పోలీసులకు అప్పగిస్తాడు. మోహన్, అతని భార్య రాధను రక్షిస్తాడు. అప్పటికే ప్రాణాపాయస్థితిలో ఉన్న భార్య జానకిని చేరుకుంటాడు రామచంద్రరావు. తన భార్యను మందులు, డబ్బు ఏవీ కాపాడలేవని తెలుసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తాడు రామచంద్రరావు. చనిపోయిందనుకున్న జానకి కళ్ళు తెరుస్తుంది. మళ్ళీ అందరూ ఆనందంగా ఉండడంతో కథ ముగుస్తుంది.
యన్టీఆర్ సరసన జమున నాయికగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, వెన్నిరాడై నిర్మల, సత్యనారాయణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సాక్షి రంగరావు, జి.నాగరత్న, ముక్కామల, మల్లాది, పి.ఆర్.వరలక్ష్మి, విజయభాను, మాస్టర్ రాము, మాస్టర్ సురేంద్ర, బేబీ రమ నటించారు. ఈ చిత్రానికి మోదుకూరి జాన్సన్, సముద్రాల జూనియర్ రచన చేశారు. సి.నారాయణరెడ్డి పాటలు పలికించగా, టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. సి.యస్.రావు దర్శకత్వం వహించారు. ఇందులోని “రామా…శ్రీరామా…”, “రా రా నవమోహనా…”, “ఏమిటో ఇది…”, “హ్యాపీ న్యూ ఇయర్…”, “నాడు నీవు…” అంటూ సాగే పాటలు అలరించాయి. అన్నిటినీ మించి “నీ మది చల్లగా స్వామీ నిదురపో…” అన్న పాట విశేషాదరణ పొందింది. రెండు వర్షన్స్ లో ఈ పాట రూపొందింది. ఈ పాటకు హిందీలో ఎస్.డి.బర్మన్ బాణీల్లో రూపొందిన ‘షర్మిలీ’లోని “ఖిల్తే హై గుల్ యహా…” సాంగ్ ట్యూన్ ఆధారం! అయినప్పటికీ టి.వి.రాజు తెలుగు వారిని ఆకట్టుకొనేలా పాటను స్వరపరిచారు.
యన్టీఆర్ తో డి.వి.యస్.రాజు నిర్మించిన తొలి చిత్రం ‘మంగమ్మశపథం’లోనూ, చివరి సినిమా ‘ధనమా?దైవమా?’లోనూ జమున నాయిక కావడం విశేషం! కాగా, రామారావుతో రాజు నిర్మించిన అన్ని చిత్రాలకు టి.వి.రాజు సంగీత దర్శకుడు కావడం మరో విశేషం! ‘ధనమా? దైవమా?’ చిత్రాన్ని 1973లో యన్టీఆర్ బర్త్ డే అయిన మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ యేడాది ఆ తేదీ సోమవారం రావడంతో నాలుగు రోజులు ముందుగా మే 24న ఈ సినిమాను జనం ముందు నిలిపారు. అప్పటికే కలర్ సినిమాల హవా విశేషంగా వీస్తున్న సమయంలో బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ‘ధనమా? దైవమా?’ అంతగా అలరించలేక పోయింది. అయితే రిపీట్ రన్స్ లో ఈ సినిమా మంచి లాభాలు చూసింది.