Desoddharakulu: తెలుగువారి తొలి రంగుల చిత్రం ‘లవకుశ’. ఆ చిత్రంలో శ్రీరామచంద్రుని పాత్రలో అలరించారు నటరత్న యన్.టి.రామారావు. మొట్టమొదటి తెలుగు వర్ణచిత్రంలో కథానాయకునిగా నటించిన యన్టీఆర్ దాదాపు దశాబ్దం వరకు సాంఘికాలలో రంగుల చిత్రం తీయలేదు.ఈ విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకని యన్టీఆర్ అంత సమయం తీసుకున్నారు? ఆ రోజుల్లో కలర్ ముడి ఫిలిమ్ ఎంతో ప్రియం! పైగా కలర్ ఫిలిమ్ కోసం నిర్మాతలు పోటీపడేవారు. పరిమితమైన కోటా ఉండేది. ముందుగా వరుసలో ఉన్నవారికే దక్కేది. అందువల్ల తన నిర్మాతలు అన్ని పాట్లు పడవలసిన అవసరం లేదని అనేవారు యన్టీఆర్. పైగా ఆ తరువాత రంగుల్లో రూపొందిన చిత్రాలేవీ ‘లవకుశ’ స్థాయిలో విజయం సాధించలేదు. పైగా ‘లవకుశ’ తరువాత రూపొందిన అనేక యన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలర్ ముడి ఫిలిమ్ కోసం క్యూలో నిల్చోవాల్సిన పనిలేదని యన్టీఆర్ అన్నారు. అయితే 1971లో రంగుల్లో రూపొందిన చిత్రాలు ఘనవిజయాలు చూశాయి. దాంతో యన్టీఆర్ సైతం తమ సొంత చిత్రం ‘శ్రీకృష్ణసత్య’ను రంగుల్లోనే నిర్మించారు. అంతే తప్ప నిర్మాతకు భారం కాకూడదనే ఆయన భావించారు. కానీ, 1972 దాటాక కలర్ కు క్రేజ్ పెరిగింది. దాంతో యన్టీఆర్ నిర్మాతలు సైతం రంగుల్లోనే సినిమాలు తీయాలని నిర్ణయించారు. అలా యన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు, తరువాతి రోజుల్లో ఆయనతో వియ్యం అందిన యు.విశ్వేశ్వరరావు ముందడుగు వేశారు. తత్ఫలితంగానే యన్టీఆర్ తొలి రంగుల సాంఘిక చిత్రంగా ‘దేశోద్ధారకులు’ రూపొందింది. తెలుగువారి తొలి రంగుల చిత్రం ‘లవకుశ’ విడుదలైన మార్చి 29వ తేదీనే సరిగా పదేళ్ళకు 1973 మార్చి 29న ‘దేశోద్ధారకులు’ జనం ముందు నిలచింది.వారి మనసులు గెలిచింది.
‘దేశోద్ధారకులు’ కథ ఏమిటంటే- జమీందార్ శ్రీవరద శ్రీకృష్ణయాచేంద్ర కన్నుమూస్తూ వీలునామా రాస్తారు. దాని ప్రకారం వారినగలు భద్రాచలం శ్రీరాముల వారికి చెందాలి. అయితే ధర్మకర్త ధర్మారావు ఆధ్వర్యంలో ఆభరణాలు దేవాలయానికి తరలిస్తూ ఉండగా, ప్రమాదం జరుగుతుంది. ధర్మారావు మరణిస్తారు. ఆయన తనయులు రాజారావు, గోపాలరావు. ఇరవై ఏళ్ళు గడుస్తాయి. నగలు తీసుకు వచ్చే సమయంలో ఇన్ స్పెక్టర్ గా ఉన్న ప్రభాకరరావు పోలీస్ కమీషనర్ అవుతాడు. దివాన్ రాజభూషణం నగరంలో పేరు మోసిన పెద్దమనిషి.ధర్మారావు తనయుల్లో పెద్దవాడు రాజారావు బ్యాంకు ఉద్యోగి, చిన్నవాడు గోపాలరావు చెస్ ఛాంపియన్.ప్రభాకరరావు కూతురు రాధ, గోపాలరావు ప్రేమించుకుంటారు. వారి పెళ్ళికి ఇరువైపుల పెద్దలు కూడా అంగీకరిస్తారు. బ్యాంకు ఉద్యోగి అయిన రాజారావును పార్టీకి పిలిపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు రాజభూషణం. అయినా రాజారావు అతనికి లొంగకపోవడంతో అతని ఇంట్లో బ్లాక్ మనీ ఉన్నట్టు చూపించి జైలుకు పంపిస్తాడు రాజభూషణం. తన అన్న నిజాయితీ తెలిసిన గోపాలరావు ఆరా తీసి, రాజభూషణాన్ని కలుసుకుంటాడు. అతను నీ తండ్రి సైతం రాజావారి నగలు దోచి, ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతాడు. దోచినవాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఏదో ఉందని భావించిన గోపాలరావు, ప్రభాకరరావు వద్దకు వస్తాడు. అక్కడ రాజావారి నగల్లోని పచ్చలపిడిబాకు, రాజముద్రిక కనిపిస్తాయి. గోపాలరావు, ప్రభాకరరావు పోట్లాడుకుంటారు. లైట్లు ఆర్పేస్తాడు ప్రభాకరరావు. గోపాలరావు చేతిలోని పిస్తోలు పేలుతుంది. రాధ వచ్చి లైట్లు వేసి చూస్తే, ప్రభాకరరావు చనిపోయి ఉంటాడు. పిస్తోలు గోపాలరావు చేతిలో ఉంటుంది. గోపాలరావు జైలుకు పోతాడు. రాధ మనశ్శాంతి కోసం రాజభూషణం వద్ద సెక్రటరీగా చేరుతుంది. ఆ నగరానికి తెలుగువారిని ఎంతగానో ప్రేమించిన బ్రౌన్ దొర మనవడినంటూ జూనియర్ బ్రౌన్ వస్తాడు. అతని అంతస్తు చూసి, రాజభూషణం, అతని మనుషులు ఆయన పంచన చేరతారు. రాజభూషణం అనుచరులు సైతం సామాన్యులను దోచేసుకుంటూ ఉంటారు. రాజభూషణం, బ్రౌన్ ను ఎలాగైనా బుట్టలో వేసుకొని తన కూతురును ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. అతనికి తన ఆస్తిపాస్తులు చూపిస్తాడు. తాను దోచేసిన రాజావారి ఆభరణాలను ఎలా చెలామణి చేయాలో తెలియడం లేదని, వాటిని బ్రౌన్ కు చూపిస్తాడు రాజభూషణం. చాకూ భరోసా అనే రౌడీ రాజభూషణం మనుషులకు దగ్గరవుతాడు. అచ్చు గోపాలరావులాంటి మనిషి కనిపించడంతో అతను జైలు నుండి తప్పించుకున్నారని రాజభూషణం అనుచరుడు తాతారావు భావిస్తాడు. చాకూ భరోసా, గోపాలరావు ఒకరే అని తాతారావు అనుకుంటాడు. అయితే గోపాలరావు, చాకూ భరోసా ఇద్దరూ ఒకేసారి తారస పడతారు. ఇదిలా ఉంటే వజ్రాల వ్యాపారం పేరుతో రాజభూషణాన్ని, అతని మనుషులను బ్రౌన్ మోసం చేస్తాడు. అతని పట్టి బంధిస్తారు. వేషం తీసేసి చూస్తే అతను గోపాలరావు అని తేలుతుంది. మరో గోపాలరావు ఎవరో కాదు, చనిపోయాడనుకున్న ప్రభాకరరావు. గోపాలరావుతో కలసే అతను నాటకం ఆడి అసలు దోషులైన రాజభూషణం, అతని అనుచరులను పట్టుకోవాలని పథకం వేసి ఉంటారు. తప్పించుకోవాలని చూస్తాడు రాజభూషణం. కానీ, అప్పటికే అన్ని సాక్ష్యాలతో అతని బంధిస్తారు. చివరకు రాజభూషణం అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళతారు. జనం ఏవగించుకుంటారు. గోపాలరావు సీబీఐ ఆఫీసర్ అన్న విషయం చివరలో తెలుస్తుంది. అతని అన్నయ్య కూడా విడుదలవుతాడు. గోపాలరావు, రాధ ఒకటి కావడంతో కథ సుఖాంతమవుతుంది.
వాణిశ్రీ నాయికగా నటించిన ఈ చిత్రంలో సావిత్రి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని,ప్రభాకర్ రెడ్డి, నాగభూషణం, రాజనాల, సత్యనారాయణ, సిహెచ్.కృష్ణమూర్తి, త్యాగరాజు, ముక్కామల, ధూళిపాల, రాజసులోచన, శుభ, సంధ్యారాణి, పద్మాఖన్నా నటించారు. ఓ నాటి మేటి నటులు చిత్తూరు నాగయ్య, సిహెచ్. నారాయణరావు అతిథి పాత్రల్లో కనిపించారు. త్రిపురనేని మహారథి, మోదూకూరి జాన్సన్ మాటలు రాసిన ఈ చిత్రానికి విశ్వభారతి యూనిట్ కథ సమకూర్చింది. ఈ చిత్రానికి ‘లవకుశ’ దర్శకత్వంలో పాలుపంచుకున్న సి.యస్.రావు దర్శకత్వం వహించడం విశేషం!
కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, మోదుకూరి జాన్సన్, నిర్మాత యు.విశ్వేశ్వరరావు పాటలు రాశారు. ఇందులోని “మబ్బులు రెండూ బేటీ అయితే…”, “ఇది కాదూ మా సంస్కృతి…”, “స్వాగతం దొరా…సుస్వాగతం…”,”ఈ వీణకు శ్రుతిలేదు…”, “కోరుకున్న దొరగారూ…”, “మడీ మడీ శుచీ శుచీ…”, “ఏదో దాహం… ఒకటే మైకం…” అంటూ సాగే పాటలు అలరించాయి. నిర్మాత యు.విశ్వేశ్వరరావు రాసిన “ఆకలై అన్నమడిగితే…” పాటలో పద్మనాభం నటన భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. 12 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. కడప లక్ష్మీరంగా ప్యాలెస్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది.
‘దేశోద్ధారకులు’ కథను చూస్తే, అంతకు ముందు 1969లో యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ గుర్తుకు రాకమానదు. అందులోనూ హీరో, అతని అన్నయ్య అన్యాయమవుతారు. దాంతో హీరో మారువేషంలో వచ్చి, ఆ ఊరి నాయకులను చేరదీసి, అసలు దోచేసిన డబ్బును బయటపెట్టిస్తాడు. అదే తీరున ఈ చిత్రం కూడా సాగింది. అంతేకాదు, రెండు చిత్రాల్లోనూ ఆ నాటి రాజకీయాలపై వ్యంగ్యాస్థ్రాలనూ సంధించారు. అయినా రెండు చిత్రాలూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తరువాతి రోజుల్లో ఇలాంటి కథలతో పలు చిత్రాలు రూపొందాయి.