NTV Telugu Site icon

Bangaru Babu: యాభై ఏళ్ళ ‘బంగారు బాబు’

Bangar Babu

Bangar Babu

Bangaru Babu: మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థకూ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించడానికీ కారకులు ఏయన్నారే! జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘దసరాబుల్లోడు’ చిత్రంతోనే రాజేంద్రప్రసాద్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆ సినిమా ఏయన్నార్ కెరీర్ లో తొలి గోల్డెన్ జూబ్లీ హిట్ గా నిలచింది. అంతటి ఘనవిజయం సాధించిన చిత్రం తరువాత ఏయన్నార్ తో రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బంగారుబాబు’ సినిమాపై ఆరంభం నుంచీ అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉండేది. అంచనాలూ భారీగానే ఉండేవి. వాటిని నిజం చేస్తూ 1973 మార్చి 15న విడుదలైన ‘బంగారుబాబు’ ఘనవిజయం సాధించింది.

‘బంగారు బాబు’ కథ ఏమిటంటే- ఓ మారుమూల రైల్వే స్టేషన్ లో బుచ్చిబాబు స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తుంటాడు. ఊరిలో బుచ్చిబాబు తండ్రి రాఘవయ్య, అంధురాలయిన చెల్లెలు చంద్ర ఉంటారు. సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న వాణికి డబ్బు, కీర్తి అన్నీ ఉంటాయి. కానీ, సరైన మనశ్శాంతి లభించదు. ఆమె మేనమామ, వాణిని పెళ్ళాడి, ఎలాగైనా ఆమె ఆస్తి మొత్తం తనది చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. ఇది తెలిసిన వాణి పారిపోయి వచ్చి, బుచ్చిబాబు ఉండే స్టేషన్ లో దిగుతుంది. రాత్రివేళ ఆడపిల్ల ఎక్కడకు పోతుందని బుచ్చిబాబు ఆమెకు ఆశ్రయమిస్తాడు. మరుసటి రోజు అక్కడ ఉన్నవారు వాణిని చూసి, బుచ్చిబాబు భార్య అనుకుంటారు. బుచ్చిబాబు నిజం చెప్పబోతాడు. కానీ, ఎవరూ పట్టించుకోరు. ఆ తరువాత బుచ్చిబాబు దగ్గరే వాణి కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చెల్లెలు చంద్రకు పెళ్ళి నిశ్చయమయందని తెలిసి, ఆనందంగా వెళతాడు బుచ్చిబాబు. అయితే అక్కడ చంద్రను పెళ్ళాడాలంటే తన చెల్లిని బుచ్చిబాబు పెళ్ళి చేసుకోవాలని పెళ్ళి కొడుకు అంటాడు. అందుకు రాఘవయ్య అంగీకరిస్తాడు. కానీ, తాను వాణిని ప్రేమించిన కారణంగా మాట ఇవ్వలేడు. దాంతో రాఘవయ్య, కొడుకును వెళ్ళగొడతాడు. తిరిగివచ్చిన బుచ్చిబాబు జరిగిందంతా వాణికి చెబుతాడు. వాణి ఎక్కడ ఉందో తెలుసుకున్న ఆమె మేనమామ జగన్నాథమ్ రౌడీలతో వచ్చి ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. బుచ్చిబాబు అడ్డుకుంటాడు. అప్పుడు జగన్నాథమ్ ఆమె ఓ పేరున్న నటి అని, ఆమె లేకపోవడం వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లిందని చెబుతాడు. బుచ్చిబాబు అతని మాటలు నమ్మడు. కానీ, వాణి అది నిజమని చెప్పడంతో బుచ్చిబాబు ఆమె తనను మోసం చేసిందని భావిస్తాడు. ఆమెను వెళ్ళమని చెబుతాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా వాణిని పంపించేస్తాడు. ‘నేను ఏ నాటికైనా నీ దాణ్ణే’ అంటూ వాణి వెళ్ళిపోతుంది. బుచ్చిబాబు మనసు బాగోలేక, ఉద్యోగం చేయలేక రాజీనామా చేస్తాడు. అతని తండ్రి చనిపోతాడు. చెల్లెలిని తీసుకొని పట్నం వెళతాడు. అక్కడ వాణి అన్న డాక్టర్ రామ్ మోహన్ విదేశాల్లో చదువుకొని, పెద్ద డాక్టర్ అయి ఉంటాడు. వాణి ఓ సారి రిక్షా తొక్కుతున్న బుచ్చిబాబును చూస్తుంది. అతనితో ఉన్న చంద్రను కలుస్తుంది. తన అన్నతో చంద్రకు పరీక్ష చేయిస్తుంది. కళ్ళు వస్తాయని చెబుతాడు రామ్ మోహన్. తరువాత వాణి ఇంకా తననే ప్రేమిస్తుందన్న నిజం తెలుసుకుంటాడు బుచ్చిబాబు. ఈ లోగా వాణిని చంపాలని, ఆమె నటించే హెలికాప్టర్ లోనే టైమ్ బాంబ్ పెట్టిస్తాడు జగన్నాథమ్. సాహసోపేతంగా బుచ్చిబాబు హెలికాప్టర్ ను ఎక్కి, వాణిని రక్షిస్తాడు. రామ్ మోహన్ ఆపరేషన్ చేసి చంద్రకు చూపు తెప్పిస్తాడు. ఆమెను ఆయనే పెళ్ళాడతానని అంటాడు. వాణి, బుచ్చిబాబు ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.

‘దసరాబుల్లోడు’లో నాయికగా నటించిన వాణిశ్రీ ‘బంగారుబాబు’లోనూ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా విజయఢంకా మోగించింది. ఈ రెండు చిత్రాలకు మధ్యలో వచ్చిన ఏయన్నార్, వాణిశ్రీ నటించిన “ప్రేమనగర్, విచిత్రబంధం” కూడా ఘనవిజయం సాధించాయి. ఏయన్నార్, వాణిశ్రీ జోడీ హిట్ పెయిర్ గా రాజ్యమేలారు. ‘బంగారు బాబు’లో వాణిశ్రీ సినిమా యాక్టర్ గా నటించడం వల్ల సందర్భోచితంగా శివాజీ గణేశన్, శోభన్ బాబు, కృష్ణ, రాజేశ్ ఖన్నా, సత్యనారాయణ వంటి వారితో ఆమె నటించినట్టుగా చిత్రీకరించారు. ఇందులో యస్వీ రంగారావు, నాగభూషణం, రాజబాబు, రమాప్రభ, జగ్గయ్య, జయంతి, పద్మనాభం, గుమ్మడి, రమణారెడ్డి, సాక్షి రంగారావు, సూర్యకాంతం, ఎస్.వరలక్ష్మి నటించారు.

కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు-పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఇందులోని “గౌరమ్మ తల్లి…” , “తగిలిందయ్యో తగిలింది…”, “శ్రీరామచంద్రా నారాయణా…”, “చెంగావి రంగు చీర…”, “ఏడడుగుల సంబంధం…”, “ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు…”, “కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ముఖ్యంగా ఇందులోని “చెంగావి రంగు చీర..” పాటలో ఏయన్నార్, వాణిశ్రీ చేతి రుమాళ్ళు నోట పెట్టుకొని వేసిన స్టెప్స్ అప్పట్లో జనాన్ని భలేగా అలరించాయి. తరువాతి రోజుల్లో రికార్డింగ్ డాన్సుల్లోనూ ఈ పాట మారుమోగి పోయింది. ఈ చిత్రం 12 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. విజయవాడలో రజతోత్సవం జరుపుకుంది.