NTV Telugu Site icon

Satyam Shivam Sundaram: జీనత్ అందాలపర్వం – ‘సత్యం శివం సుందరం’!

Sss

Sss

Satyam Shivam Sundaram: ‘షో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన రాజ్ కపూర్ దర్శకత్వంలో ‘బాబీ’ తరువాత ఐదేళ్ళకు తెరకెక్కిన చిత్రం ‘సత్యం శివం సుందరం’. ‘బాబీ’లో తనయుడు రిషి కపూర్ ను హీరోగా పరిచయం చేసిన రాజ్ కపూర్, తరువాత తన తమ్ముడు శశికపూర్ హీరోగా ‘సత్యం శివం సుందరం’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. శశికపూర్ అప్పటికే హిందీ చిత్రసీమలో టాప్ హీరోగా సాగుతున్నారు. ఇక దేవానంద్ ‘హరే రామ హరే కృష్ణ’లో అందంతో హిందోళం పాడిన జీనత్ అమన్ ను ‘సత్యం శివం సుందరం’లో నాయికగా ఎంచుకున్నారు రాజ్ కపూర్.తన కెరీర్ లో ‘సత్యం శివం సుందరం’ లేకపోయి ఉంటే, జీవితమే చేదుగా ఉండేదేమో అంటూ జీనత్ అమన్ ఇటీవలే అన్నారు. మార్చి 24తో ఈ చిత్రం 45 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ‘బాబీ’ని మ్యూజికల్ హిట్ గా రూపొందించిన లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాణీల్లోనే ‘సత్యం శివం సుందరం’ కూడా వెలుగు చూసింది. 1978 మార్చి 24న హోళీ రోజున విడుదలైన ‘సత్యం శివం సుందరం’ మంచి ఆదరణ చూరగొంది. ఆత్మసౌందర్యానికి, శారీరక సౌందర్యానికి మధ్య ఆధ్యాత్మికతను ప్రతిబింబింపచేస్తూ ఈ సినిమా రూపొందింది.

కథ విషయానికి వస్తే – చిన్నతనంలో మరిగే నూనె ముఖంపై పడడంతో రూపా కుడిచెంప కాలిపోతుంది. ఆమె తండ్రి గుడిలో పూజారి. తన ముఖాన్ని ఓ వైపు కప్పుకుంటూ దేవుని సేవ చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటుంది రూప. ఆమె గానం ఆ ఊరికి డ్యామ్ పనిమీద వచ్చిన ఇంజనీర్ రాజీవ్ ను ఆకర్షిస్తుంది. అందానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజీవ్ రూప పాట కోసం ఆమె వెంట పడతాడు. అతని మంచితనం రూపను ఆకర్షిస్తుంది. రూప తండ్రిని ఒప్పించి, ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు రాజీవ్. అందాన్ని ఆరాధించే రాజీవ్ కు తన ముఖంపైని మచ్చ గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, అతను నిరాశచెందుతాడని భావించి, ఆ పెళ్ళిని అంగీకరించదు. కానీ, రాజీవ్ ఎలాగైనా రూపను పెళ్ళాడాలని తపిస్తాడు. ఊళ్ళో జనం కూడా నచ్చచెప్పడంతో రూప, రాజీవ్ కళ్యాణం జరుగుతుంది. మొదటిరాత్రి తన ముసుగు తీసి భర్తకు చూపిస్తుంది. కానీ, అతను తాను ప్రేమించిన రూప వేరు, ఈమె వేరు అని భావించి, మోసపోయానని అనుకుంటాడు. రూప ఎప్పటిలాగే సాదాసీదా దుస్తుల్లో కనిపిస్తుంది.

ఆమె వెంట మళ్ళీ పడతాడు. రాత్రిళ్ళు కలుసుకుంటూ ఉంటారు. తన భర్తకు ఇష్టమైన రూపం అదేనని రూప భావించి, అలాగే అతనికి ఆనందం పంచుతుంది. రూప గర్భవతి అవుతుంది. భార్యను అనుమానించి గెంటేస్తాడు రాజీవ్. ఆమె ఎంత చెప్పినా, తన రూప వేరు అనుకుంటాడు. ఇక జీవితంలో రూప నీకు కనిపించదు అని చెబుతుంది. అదే సమయంలో భారీ తుఫాన్ నెలకొంటుంది. డ్యామ్ గేట్స్ ఎత్తడానికి రాజీవ్ వెళతాడు. ఆ వర్షంలో రూప ఎక్కడ ఉందోనని రాజీవ్ వెదుకుతాడు. గండి పడడంతో నీటి మట్టం పెరుగుతుంది. దాంతో ఊళ్ళో జనాన్ని ఖాళీ చేయిస్తారు. రూప మాత్రం రాజీవ్ వస్తాడని ఆశిస్తుంది. అతను రాకుంటే, అక్కడే తన తనువు చాలించాలనీ భావిస్తుంది. జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు. వారిలో రూప కనిపిస్తుందేమోనని రాజీవ్ వెతుకుతాడు. నీళ్ళలో కొట్టుకుపోతున్న రూపను రక్షిస్తాడు. రాజీవ్ లో పశ్చాత్తాపం మొదలవుతుంది. రూపను క్షమించమని వేడుకుంటాడు. తాను అందంగా లేనుకదా అంటుంది రూప. అసలైన అందం ఏమిటో తన కళ్ళతో చూడమని భార్యతో అంటాడు రాజీవ్. అతనిలో పరివర్తన కలగడంతో కథ సుఖాంతమవుతుంది.

రాజీవ్ గా శశికపూర్, రూపగా జీనత్ అమన్ నటించిన ఈ చిత్రంలో కన్హయ్య లాల్, ఏ.కే.హంగల్, హరి శివదసానీ, డేవిడ్ అబ్రహామ్, లీలా చిట్నిస్, విశ్వ మెహ్రా, శీతల్, మోనిక, జావేద్ ఖాన్, టున్ టున్ అభినయించారు. ఈ చిత్రానికి రచన జైనేంద్ర జైన్. ఇందులోని “సత్యం శివం సుందరం…”, “భోర్ భయే ఫంగట్…”, “వో ఔరత్ హై తూ మెహబూబా…”, “చంచల్ శీతల్ నిర్మల్ కోమల్…”, “యశోమతి మయ్యాసే బోలే నందలాల…”, “శ్రీరాధా మోహన్…శ్యామ్ శోభన్…”, “శ్రీరాధా మోహన్…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఇందులో జీనత్ అమన్ ను తెరపై చూపిన విధానం చూసి ‘ఏ సర్టిఫికెట్’ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

Read Also: CM YS Jagan: పోలవరం అంటే వైఎస్‌ఆర్‌.. ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది నేనే..

జీనత్ ను అలా చూపించడమే తరువాత వివాదానికి దారితీసింది. హిమాచల్ కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఇందులో నాయికను అశ్లీలంగా చూపించారని కోర్టులో దావా వేశారు. రాజ్ కపూర్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. కళాత్మక దృష్టితో చిత్రాలు చూసే రోజులు వచ్చాయంటూ తీర్పు వెలువడింది. ‘సత్యం శివం సుందరం’ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. పెట్టుబడికి నాలుగు రెట్లు రాబడి చూసింది. ఈ చిత్రంలో బాలనటిగా కనిపించిన పద్మినీ కొల్హాపురి తరువాతి రోజుల్లో రాజ్ కపూర్ దర్శకత్వంలో ‘ప్రేమ్ రోగ్’లో హీరోయిన్ గా నటించింది. జీనత్ అమన్ కెరీర్ లో ఓ మైలురాయిగా ‘సత్యం శివం సుందరం’ నిలచింది.