NTV Telugu Site icon

Akbar Saleem Anarkali: ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ పాటల పల్లకి!

Amar Saleem Anarkali

Amar Saleem Anarkali

Akbar Saleem Anarkali: ఏ సినిమాకైనా జనమే అసలైన న్యాయనిర్ణేతలు! వారి మదిని గెలిచిన చిత్రాలను మెచ్చి మరీ మరీ చూస్తారు. నచ్చకపోతే ఎంతమంచి పాటలున్నా, ఎందరు మేటి నటులు నటించినా ఆదరించరు. చిత్రసీమలో అలాంటి సినిమాలూ ఎన్నో ఉన్నాయి. వాటిలో మహానటుడు యన్.టి.రామారావు నటించి, దర్శకత్వం వహించిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ ఒకటి. యన్టీఆర్ ఎంతగానో మెచ్చి, నచ్చి తెరకెక్కించిన ఈ చిత్రానికి విఖ్యాత హిందీ సంగీత దర్శకులు సి.రామచంద్ర స్వరకల్పన చేశారు. ఇందులోని పాటలూ జనాన్ని విశేషంగా అలరించాయి. అయితే హిందీలో సూపర్ డూపర్ హిట్ గా నిలచిన ‘ముఘల్-ఏ-ఆజమ్’ పోలికలతో రూపొందిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ని తెలుగువారు ఎందుకనో ఆదరించలేదు. అందుకు ఈ చిత్రంలోని కథనం రక్తికట్టించకపోవడం ఓ కారణమని చెప్పక తప్పదు. తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దుతున్న సమయంలో యన్టీఆర్ తెరకెక్కించిన చిత్రమిది. అంతకు ముందు యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన “తాతమ్మకల, దానవీరశూరకర్ణ” చిత్రాలలో బాలకృష్ణతో ప్రాధాన్యమున్న పాత్రలు ధరింప చేశారు. ఆ తరువాత యన్టీఆర్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన చిత్రం ‘అక్బర్ సలీమ్ అనార్కలి’. ‘దానవీరశూర కర్ణ’లో బాలకృష్ణకు జోడీగా నటించిన దీపనే ఇందులోనూ నాయికగా ఎంచుకున్నారు. 1978 మార్చి 15న విడుదలైన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ చిత్రం సంగీతపరంగా ఆదరణ పొందింది. బాలకృష్ణకు ఈ చిత్రంలో మధురగాయకుడు మహ్మద్ రఫీ నేపథ్యగానం చేయడం విశేషం!

‘ముఘల్-ఏ-ఆజమ్’కు దర్శకుడు కె.ఆసిఫ్ తో పాటు అమన్, కమల్ ఆమ్రోహి, వజాహత్ మీర్జా, ఎహ్సాన్ రిజ్వీ రచన చేశారు. అందులోని ఉర్దూ పదాలు కవితాత్మకంగా చెవులకు సోకగానే మనసు ఆనందంతో పొంగేది. ఉర్దూ భాష రానివారు సైతం ఆ పదాల అల్లికను ఎంతగానో ఆస్వాదించారు. తెలుగుతో పాటు ఉర్దూ సాహిత్యంతోనూ ఎంతో పరిచయం ఉన్న డాక్టర్ సి.నారాయణ రెడ్డి సంభాషణలు రాశారు. అంతకు ముందు యన్టీఆర్ నటించిన ‘ఏకవీర’కు కూడా సినారె రచన చేయడం విశేషం! తెలుగువారికి సులభంగా అర్థమయ్యేలా రచన సాగివుంటే బాగుండేదేమో! కానీ, ‘ముఘల్-ఏ-ఆజమ్’ ప్రభావంతో కొన్ని సన్నివేశాలు మక్కీకి మక్కీలా రూపొందించారు. కొంత కథనూ మార్చారు. అందులో రాజా మాన్ సింగ్ వచ్చి, సలీమ్ ను మందుగుండుకు బలి కాకుండా కాపాడితే, ఇందులో తాన్ సేన్ వచ్చి రక్షించినట్టు చూపించారు. అలాగే తాన్ సేన్ కోరికపైనే చివరలో అనార్కలిని అతనికి అప్పగించినట్టుగానూ చూపించారు. ఈ అంశాలను మినహాయిస్తే ‘ముఘల్- ఏ-ఆజమ్’నే తొంభై శాతం అనుసరించారు. ‘ముఘల్-ఏ-ఆజమ్’ చిత్రానికి నౌషద్ సంగీతం ప్రాణం పోసింది. అంతకు ముందు హిందీలో రూపొందిన ‘అనార్కలి’ చిత్రానికి సి.రామచంద్ర తనదైన సంగీతంతో యావద్భారతాన్నీ అలరించారు. అందువల్ల తమ ‘అక్బర్ సలీమ్ అనార్కలి’కి సి.రామచంద్రను సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు యన్టీఆర్. దీనికి ముందు ‘నిజం చెబితే నమ్మరు’ అనే చిత్రానికీ తెలుగులో స్వరకల్పన చేశారు రామచంద్ర. ఈ సినిమా ఆయనకు రెండో చిత్రం. అయితే ఆయన మనసుపెట్టి మరీ వీనులవిందు చేసే సంగీతం సమకూర్చారు. ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ని పాటల పల్లకిగా రూపొందించారు రామచంద్ర.

యన్టీఆర్ తమ తారకరామా ఫిలిమ్ యూనిట్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రంగా ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ తెరకెక్కింది. ఈ చిత్రానికి యన్టీఆర్ మూడో కుమారుడు హరికృష్ణ ఛీఫ్ కంట్రోలర్ గా వ్యవహరించారు. అక్బర్ గా యన్టీఆర్ సలీమ్ గా బాలకృష్ణ అనార్కలిగా దీప నటించిన ఈ చిత్రంలో జమున, మాధవి, గుమ్మడి, శ్రీధర్, చలపతిరావు, పి.జె.శర్మ ముఖ్యపాత్రధారులు. సినారె కలం నుండి జాలువారిన “సిపాయీ… సిపాయీ…”,”కలుసుకున్నా గుబులాయె…”, “మదనమోహనుడే…”, “ప్రేమిస్తే తప్పంటారా…”, “తానే మేలి ముసుగు తీసి…”, “తారలెంతగా మురిసేనో…”, “వెల ఎరిగిన దొరవుంటే…”, “ఓ దేవా…ఎందుకు ఎందుకు ఈ మౌనం…”, “రేయి ఆగిపోనీ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ముఖ్యంగా “సిపాయీ…ఓ సిపాయీ…” అంటూ రూపొందిన పాట ఆ రోజుల్లో రేడియోలలో మారుమోగింది. ఇందులోని పలు పాటలను సిలోన్ రేడియోలో పదే పదే ప్రసారం చేసి, సంగీతప్రియులకు ఆనందం పంచారు. అప్పట్లో యన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్ ఈ సినిమాకు ఓ శాపంగా మారిందనీ కొందరి అభిప్రాయం. అందువల్లే ఈ చిత్రం ఆదరణ పొందలేకపోయిందని వారి మాట! ఏది ఏమైనా సంగీతపరంగా విశేషంగా ఆకట్టుకున్న ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ జనాన్ని మెప్పించలేక పోయింది.