NTV Telugu Site icon

యన్టీఆర్ తొలి ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ ‘అగ్గిరవ్వ’

40 Years to Aggiravva Movie

(ఆగస్టు 14న ‘అగ్గిరవ్వ’కు 40 ఏళ్ళు)
అసభ్యత, అశ్లీలం, అరాచకం, అతిహింస అన్నవి కనిపించినప్పుడు సెన్సార్ వారు తమ కత్తెరకు పనిపెడుతూ ఉంటారు. ఆ రోజుల్లో అయితే సెన్సార్ వారి నిబంధనలు మరింత కఠినంగా ఉండేవి. ఆ నాటి మేటి హీరోలు తమ చిత్రాల్లో సెన్సార్ వారి కత్తెరకు పని చెప్పని అంశాలకే ప్రాధాన్యమిచ్చేవారు. అయినా, ఎక్కడో ఓ చోట సెన్సార్ అభ్యంతరం చెప్పడం, అందుకు అంగీకరిస్తే సరి, లేదంటే అంతే మరి! 1960ల నుండి సెన్సార్ వారు తమ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తూ వచ్చారు. ‘దాగుడుమూతలు’లోని “అడగక ఇచ్చిన మనసే ముద్దు…” పాటలో “నువ్వు నేను ముద్దుకు ముద్దు…” అనే మాటల్లో వారికి ద్వంద్వార్థం వినిపించింది. దాంతో కత్తెరకు పదనుపెట్టారు. ఆ పదాలను తొలగించేదాకా వదల్లేదు. ఇక 1965లో జయలలిత తొలి తెలుగు చిత్రం ‘మనుషులు-మమతలు’లో హీరోయిన్ స్విమ్ షూట్ లో కనిపించడాన్ని అశ్లీలమని సెన్సార్ వారు అభ్యంతర పెట్టారు. కత్తెర వేస్తామన్నారు. దర్శకనిర్మాతలు అంగీకరించలేదు. దాంతో ఆ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అలా తొలి ‘ఏ’ సర్టిఫికెట్ మూవీగా ‘మనుషులు-మమతలు’ నిలచింది. ఇలా చెప్పుకుంటూ పోతే సెన్సార్ వారి విచిత్రాలు చాలానే ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇప్పటి నిబంధనలు సరళంగానే ఉన్నాయని అంగీకరించవచ్చు. పైగా ఇప్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా జనం అంతగా పట్టించుకోవడం లేదు. ఆ రోజుల్లో ఓ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారంటే, సదరు చిత్రంపై జనాల్లో చిన్నచూపు ఉండేది. అలాంటి ఆపద రాకూడదనే నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల్లో సెన్సార్ వారు అభ్యంతరం చెప్పిన సీన్స్ ను కట్ చేయడానికి అంగీకరించేవారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మహానటుడు యన్టీ రామారావు నటించిన ‘అగ్గిరవ్వ’కు కూడా ఆ పరిస్థితి దాపురించింది. ఆయన చిత్రాల్లో తొలిసారి ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన చిత్రం ‘అగ్గిరవ్వ’. ఈ సినిమా ఆగస్టు 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రంలో హీరోను దుండగులు పోరాట సన్నివేశంలో కత్తితో చీరుతారు. ఆ సీన్ లో విపరీతమైన హింస ఉందని తొలగించాలని సెన్సార్ వారు సూచించారు. ఆ సీన్ తరువాత వచ్చే కోర్టు సీన్ లో హీరో తన శరీరంపై ఉన్న గాట్లను ప్రదర్శిస్తాడు. అందువల్ల కంటిన్యుటీ పోతుందని నిర్మాత యన్టీఆర్, దర్శకుడు కె.బాపయ్య అంగీకరించలేదు. దాంతో ‘అగ్గిరవ్వ’కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఇక అగ్గిరవ్వ కథలోకి తొంగిచూస్తే – ఇది అప్పటికే పాత చింతకాయ. దానిని రుచికరంగా జనానికి అందించాలని బాపయ్య తపించారు. రాము తండ్రి ఐ.జి. రాజశేఖరం. రామును అతని తండ్రి పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటాడు. తల్లి కడుపులో చల్ల కదలకుండా ఉండే ఉద్యోగం చేసుకోమని చెబుతుంది. తల్లి కోరిక మేరకు వాణీ అనే అమ్మాయి ఆఫీసులో చేరిన రాము, ఆమెను ప్రేమిస్తాడు. తరువాత క్యాంప్ అనే పేరుతో ఊరు వదలి వెళ్ళి పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటాడు. నాగరాజపురం అనే ప్రాంతంలో నరసింహం, భైరవయ్య, మేనక అనే ముగ్గురు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ, పైకి పెద్దమనుషుల్లా ప్రవర్తిస్తుంటారు. వారి ఆట కట్టించడానికి రాము స్నేహితుడు ఇన్ స్పెక్టర్ సూర్యం వెళతాడు. సూర్యం భార్య రాధను కిడ్నాప్ చేసి, సూర్యంను బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ కేసును ఛేదించడానికి రాము తండ్రి రాజశేఖరం స్వయంగా వెళతారు. కాల్పుల్లో ఆయన కాలు పోగొట్టుకుంటారు. రాము, ఆ ముగ్గురి భరతం పట్టడానికి పూనుకుంటాడు. అయితే అతనూ వారి దెబ్బకు గురవుతాడు. దాంతో మారు వేషం వేసి, ఆ ముగ్గురినీ బురిడీ కొట్టిస్తాడు. ఈ నేపథ్యంలో రాము తల్లిని దుండగులు చంపుతారు. దాంతో ప్రళయకాల రుద్రునిలా రాము చెలరేగిపోయి, ఆ ముగ్గురినీ చిత్తుచేసి, చివరకు చట్టానికి వారిని అప్పచెబుతాడు. రాము, వాణి వివాహంతో కథ సుఖాంతమవుతుంది.

యన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించిన ‘అగ్గిరవ్వ’ మంచి ఓపెనింగ్స్ చూసింది. రామకృష్ణా సినీస్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో జగ్గయ్య, మోహన్ బాబు, ఎస్.వరలక్ష్మి, రాజ్యలక్ష్మి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కవిత, రాజబాబు, సుకుమారి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని ఏడు పాటలనూ ఆచార్య ఆత్రేయ రాశారు. యన్టీఆర్ సొంత బ్యానర్ లో ఆత్రేయ అన్ని పాటలూ రాసిన చిత్రం ఇదే. “వన్ టూ త్రీ ఐ యామ్ ఫ్రీ…”, “కాశీకి పోయాము రామా హరే…”, “పారిపోతుంది, జారిపోతుంది…”, “గొప్పల గోవిందం అమ్మా అమ్మమ్మా…”, “పండైతే పనికిరాదు ఆవకాయకి…”, “లేత పిందెలో…”, “బూబాబా బూబాబా… అరె శరబా…అశ్శరబా…” పాటలు ఆకట్టుకున్నాయి. గొల్లపూడి మాటలు రాశారు.

ఈ సినిమాకు తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ వచ్చినా, ‘అగ్గిరవ్వ’ వసూళ్ళ వర్షం కురిపించింది. సెకండ్ బంచ్ లో విడుదలైన కేంద్రాలలోనూ అనూహ్యంగా వసూళ్ళు చూసింది. అప్పట్లో ‘అగ్గిరవ్వ’ ఫ్లాప్ కు ‘ఏ’ సర్టిఫికెట్ రావడమే కారణమని అభిమానులు భావించారు. ఈ సినిమాకు లభించిన టాక్ కు, వచ్చిన వసూళ్ళకు ఎక్కడా పొంతనలేదని ట్రేడ్ పండిట్స్ ఆశ్చర్యపోయారు.