Site icon NTV Telugu

30 weds 21: (అన్) హ్యాపీ జర్నీ!

చైతన్యరావ్, అనన్య శర్మ జంటగా నటించిన ’30 వెడ్స్ 21′ సీజన్ 2 ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ వెబ్ సీరిస్ లోని 7వ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సింగపూర్ లో ఉద్యోగం సంపాదించుకున్న పృధ్వీ ఆ విషయం భార్య మేఘనకు చెప్పడానికి సతమతమౌతుంటాడు. ఉద్యోగంతో బిజీ అయిపోయి తనను పట్టించుకోని మేఘనను సింగపూర్ తీసుకెళ్ళిపోతే తమ వివాహ బంధం మరింత బలోపేతం అవుతుందని పృథ్వీ భావిస్తాడు. అయితే ఆ విషయాన్ని మేఘనతో కాకుండా స్నేహితుడు కార్తీక్ కు చెబుతాడు. సంక్రాంతి సందర్భంగా మామగారి ఆహ్వానం మేరకు భీమవరం వెళ్ళే టైమ్ లో మేఘనకు కొత్త జాబ్ కు సంబంధించిన వివరాలు చెప్పమని కార్తీక్ సలహా ఇస్తాడు. మేఘనకు ఇష్టం లేకపోయినా సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళడానికి ఆమెను ఒప్పిస్తాడు పృధ్వీ. అయితే దారిలో తన కొత్త ఉద్యోగం గురించి అతను చెప్పేలోపే, కార్తీక్ ద్వారా జెస్సీకి.. ఆమె ద్వారా తనకు తెలిసిపోయిందని మేఘన చెబుతుంది. ఆ తర్వాత ఇదే విషయమై వారి మధ్య జరిగిన వాగ్వివాదంతో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది.

ఈ రెండో సీజన్ లో ఏ మాత్రం ఆసక్తి కలిగించని ఎపిసోడ్ ఏదైనా ఉందంటే ఇదే! ఉద్యోగం చేసే మహిళల కష్టాలను పురుషులు అర్థం చేసుకోలేరనే విధంగా ఈ ఎపిసోడ్ సాగింది. అలానే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలను భర్త మాత్రమే తీసుకోవడం ఎలాంటి గొడవలకు దారితీస్తుందో దర్శకుడు చూపించాడు. మహిళలు తమ స్వేచ్ఛ, స్వాతంత్రాల విషయంలో పగ్గాలు వేరొకరి చేతుల్లో ఉంటే ఎంత మాత్రం తట్టుకోలేరని మేఘన పాత్ర ద్వారా చెప్పించాడు. ఈ ఎపిసోడ్ లో మేఘనలో కాస్తంత ఫెమినిస్టు ధోరణలు కనిపిస్తే, పృధ్వీలో పురుషాహంకారం గోచరించింది. ఇద్దరి భవిష్యత్ కు సంబంధించిన విషయంలో అతను ఒంటెద్దు పోకడ పోవడం ఎంత తప్పో… మేచ్యూర్డ్ పర్శన్ అనుకునే మేఘన క్షణికావేశానికి లోనై అతిగా ప్రవర్తించడం కూడా అంతే తప్పు!! మొత్తం మీద వీరిద్దరి ఇగో క్లాషెస్ తో ఈ ఎపిసోడ్ పేలవంగా సాగింది. మరి వచ్చే ఎపిసోడ్ తో అయినా ఇది తిరిగి ట్రాక్ లోకి వస్తే సరే… లేదంటే ఈ వారంలానే వీక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భీమవరం ట్రిప్ కు తన కారు తీసుకెళ్ళమని కార్తీక్ కీస్ పృధ్వీకి ఇస్తాడు. కానీ వీరి ప్రయాణించేది టాక్సీలో అన్నట్టు చూపించారు!

Exit mobile version