NTV Telugu Site icon

సాయికుమార్ పోలీస్ స్టోరీకి పాతికేళ్ళు

Sai-Kumar

(డిసెంబ‌ర్ 19తో పోలీస్ స్టోరీకి 25 ఏళ్ళు)
అప్ప‌టి దాకా త‌న‌దైన గాత్రంతో ఎంతోమందిని స్టార్స్ గా నిలిపిన ప్ర‌ముఖ న‌టుడు సాయికుమార్ ను స్టార్ గా మ‌ల‌చిన చిత్రం పోలీస్ స్టోరీ. తెలుగువార‌యిన సాయికుమార్ కు న‌ట‌నంటే ప్రాణం. అయితే ఆయ‌న‌కు త‌గ్గ పాత్ర‌లు తెలుగులో అంత‌గా ల‌భించ‌లేదు. దాంతో త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ అందివ‌చ్చిన పాత్ర‌ల్లో న‌టించేవారు. సాయికుమార్ యాక్టింగ్ లో మ‌హాన‌టుడు శివాజీగ‌ణేశ‌న్ క‌నిపిస్తార‌ని, అప్ప‌ట్లో క‌న్న‌డిగులు అనేవారు. దానిని ఆధారం చేసుకొని ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్, న‌టుడు, ద‌ర్శ‌కుడు థ్రిల్ల‌ర్ మంజు మ‌దిలో ఓ క‌థ మెదిలింది. దానికి ఎస్.ఎస్.డేవిడ్ క‌థారూపం కల్పించారు. త‌త్ఫ‌లితంగా రూపొందిన చిత్ర‌మే పోలీస్ స్టోరీ. క‌న్న‌డ‌నాట సాయికుమార్ ను ఈ సినిమా రాత్రికి రాత్రి స్టార్ హీరోని చేసింది. ఈ క‌న్న‌డ చిత్రం 1996 ఆగ‌స్టు 16న విడుద‌ల కాగా, ఈ సినిమా అక్క‌డ సాధించిన సంచ‌ల‌న విజ‌యం చూసిన గాజుల నాగేశ్వ‌ర‌రావు తెలుగులో అదే టైటిల్ తో డ‌బ్బింగ్ చేశారు. తెలుగునాట పోలీస్ స్టోరీ అదే యేడాది డిసెంబ‌ర్ 19న విడుద‌ల‌యింది. ఇక్క‌డ కూడా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా సాధించిన విజ‌యంతో సాయికుమార్ కు తెలుగులోనూ హీరోగా అవ‌కాశాలు రావ‌డం మొద‌ల‌య్యాయి.

పోలీస్ స్టోరీ క‌థ విష‌యానికి వ‌స్తే – పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ అగ్ని సిన్సియ‌ర్ ఆఫీస‌ర్. అతనికి అన్యాయ‌మంటే అస‌లు న‌చ్చ‌దు. న్యాయం కోసం ప్రాణాల‌యినా ఫ‌ణంగా పెట్టే త‌త్వం. బ్లాక్ టైగ‌ర్ అనే గ్యాంగ్ స్ట‌ర్ ను ప‌ట్టుకోవ‌డంలో త‌న స‌హ‌చ‌రులైన పోలీసుల ప్రాణాలు పోతాయి. దాంతో అగ్ని ఆ బ్లాక్ టైగ‌ర్ ను అంత‌మొందించ‌డానికి న‌డుం బిగిస్తాడు. అలాగే న‌గ‌రాన్ని గ‌జ‌గ‌జ‌లాడిస్తున్న స‌త్య‌, ధ‌ర్మ అనే మ‌రో ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్స్ ను కూడా అగ్ని అదుపులో పెడ‌తాడు. ఒక‌ప్పుడు శోభ‌రాజ్ గా ఉండి, లోకం దృష్టిలో చ‌నిపోయినవాడే బ్లాక్ టైగ‌ర్ అని తెలుసుకుంటాడు అగ్ని. ముంబై నుండి వ‌చ్చిన ప్ర‌త్యేక సీబీఐ ఆఫీస‌ర్ ను కూడా బ్లాక్ టైగ‌ర్ మ‌ట్టు పెడ‌తాడు. ఆ ఆధారాల‌ను రూపు మాపేందుకు ఓ పోలీసాఫీస‌రే స‌హ‌క‌రిస్తాడు. అయితే ఓ యువ‌కుణ్ని ఆధారంగా తీసుకు వ‌స్తాడు అగ్ని. అత‌ణ్ని కూడా కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే గ్యాంగ్ స్ట‌ర్ స‌త్య కాలుస్తాడు. అగ్ని వెంట‌నే స‌త్య‌ను కాల్చి పారేస్తాడు. అత‌ని ప‌క్క‌నే ఉన్న ధ‌ర్మ వైపు గురి పెడ‌తాడు. భ‌య‌ప‌డిపోయిన ధ‌ర్మ నిజం చెప్పేస్తాడు. త‌రువాత చికిత్స పొందుతున్న సాక్షిని కూడా అంత‌మొందిస్తారు. అన్నిటికీ ఓ జ‌ర్నలిస్టు ఇచ్చిన ఆధారాల‌తో బ్లాక్ టైగ‌ర్ ను అరెస్ట్ చేస్తాడు అగ్ని. ముఖ్య‌మంత్రి , అగ్నిసాహ‌సాన్ని కొనియాడ‌డంతో క‌థ ముగుస్తుంది.

న‌ట‌ద‌ర్శ‌కుడు థ్రిల్ల‌ర్ మంజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయికుమార్, పి.జె.శ‌ర్మ‌, స‌త్య‌ప్ర‌కాశ్, శోభ‌రాజ్, అవినాశ్, రాక్ లైన్ వెంక‌టేశ్ త‌దిత‌రులు న‌టించారు. సాధు కోకిల అందించిన నేప‌థ్య సంగీతం సినిమాకు ఓ ఎస్సెట్ గా నిల‌చింది.

అగ్నిగా సాయికుమార్ న‌ట‌న జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో పోలీస్ స్టోరీగానే అనువ‌దించి, విడుద‌ల చేయ‌గా మంచి విజ‌యం సాధించింది. హిందీలో అగ్ని ఐపీఎస్గా అనువ‌దించారు. అప్ప‌ట్లో పోలీస్ క‌థ‌ల్లో ఓ ట్రెండ్ సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్స్ గా పోలీస్ స్టోరీ 2, పోలీస్ స్టోరీ 3 కూడా వ‌చ్చిజ‌నాన్ని అల‌రించాయి. ఈ సినిమాతోనే క‌న్న‌డ నాట సాయికుమార్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించారు. అక్క‌డ అనేక చిత్రాల‌లో హీరోగా న‌టించి మురిపించారు. అదే స‌మ‌యంలో కొడుకులు, అత‌ను, అంతఃపురం, శివ‌న్న‌, స్వ‌ర్ణ‌ముఖి వంటి చిత్రాల‌లో క‌థానాయ‌కునిగా న‌టించారు. ఈశ్వ‌ర్ అల్లా అనే చిత్రాన్ని తెలుగులో సొంత‌గా నిర్మించారు. ఈ నాటికీ సాయికుమార్ అన‌గానే అంద‌రికీ ముందుగా పోలీస్ స్టోరీయే గుర్తుకు రావ‌డం విశేషం!