NTV Telugu Site icon

15 ఏళ్ళ ‘స్టాలిన్’

ఆ రోజుల్లో ‘హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్’గా పేరొందిన జోసెఫ్ విస్సారియానోవిచ్ స్టాలిన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభిమానం ఉండేది. ఆయన పేరును తమ సంతానానికి పెట్టుకొనీ పలువురు భారతీయులు మురిసిపోయారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు, హేతువాదులు స్టాలిన్ ను విశేషంగా అభిమానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సైతం స్టాలిన్ ను అభిమానించి, తన తనయుడికి ఆ పేరే పెట్టుకున్నారు. కరుణానిధి వారబ్బాయి ఎమ్.కె.స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘స్టాలిన్’ టైటిల్ తో ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తెలుగునాట అడుగు పెట్టడం విశేషం. ఈ ‘స్టాలిన్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు కావడం మరింత విశేషం! అప్పటికే అనువాదచిత్రం ‘గజినీ’తో తెలుగువారిని ఆకట్టుకున్న మురుగదాస్ ‘స్టాలిన్’తో చిరంజీవి హీరోగా చిత్రం రూపొందిస్తున్నారు అనగానే అభిమానుల్లో అంచనాలు అంబరాన్నంటాయి. తన ప్రతి చిత్రంలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలని తపించేవారు మురుగదాస్. ఈ ‘స్టాలిన్’లో “ఎవరైనా మనకు సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడం కాదు, మరో ముగ్గురికి మనమూ సాయం చేయాలి” అనే సందేశాన్ని ఇచ్చారు. అది జనాన్ని భలేగాఆకట్టుకుంది. 2006 సెప్టెంబర్ 20న ‘స్టాలిన్’ చిత్రం విడుదలయింది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రం ‘జై హో’ పేరుతో తెరకెక్కింది.

‘స్టాలిన్’ కథలోకి తొంగి చూస్తే – పదిమందికి మేలు చేయాలనే ఆదర్శభావాలున్న వ్యక్తి స్టాలిన్. వార్ హీరోగా జేజేలు అందుకుంటాడు. అయితే మిలిటరీలో అతని పై అధికారి కల్నల్ ఇక్బాల్ కాకర్ , స్టాలిన్ ను వేరే చోటకు బదిలీ చేస్తాడు. తాను యుద్ధం చేయకుండా ఉండలేనని వచ్చేస్తాడు స్టాలిన్. అతని తల్లి, అక్క దగ్గరకువస్తాడు. స్టాలిన్ అక్క ఓ పంజాబీని పెళ్ళాడిందని, తల్లి ఆమెతో మాట్లాడదు. స్టాలిన్ మాత్రం ఎవరైనా మనకు సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడంతో సరిపెట్టకుండా మరో ముగ్గురికి మనమూ సాయం చేయాలని చెబుతుంటాడు. అతను నేర్పిన ఈ అంశం గొలుసులా పాకిపోతుంది. అందరినీ ఆకర్షిస్తుంది. ఇదే సమయంలో ఓ ధనవంతుడు గూండాలతో స్టాలిన్ ను ఎటాక్ చేస్తాడు. తరువాత స్టాలిన్ అక్కను, అతని స్నేహితురాలు చిత్రను కిడ్నాప్ చేస్తారు. వారిని చితక్కొడతాడు స్టాలిన్. వాళ్లు ఎమ్మెల్యే మనుషులు. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ ముద్దుక్రిష్ణయ్య అల్లుడు. దాంతో మరింత గొడవ అవుతుంది. ముఖ్యమంత్రి, స్టాలిన్ తో ముద్దుక్రిష్ణయ్యకు రాజీ చేయాలనుకుంటాడు. ముఖ్యమంత్రిని చంపేసి, ఆ నేరం స్టాలిన్ పై నెట్టాలనుకుంటారు. ముఖ్యమంత్రిని కాపాడతాడు స్టాలిన్. అయితే స్టాలిన్ కు కార్గిల్ వార్ సమయంలో ఓ బుల్లెట్ గుండెకు సమీపంలో అలాగే ఉండి ఉంటుంది. దానితో విపరీతమైన బాధ కలుగుతుంది. చివరకు అతి సున్నితమైన ప్రదేశంలో చిక్కుకున్న ఆ బుల్లెట్ ను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. ముఖ్యమంత్రి సైతం వచ్చి, స్టాలిన్ సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా మరో ముగ్గురికి సాయం చేయాలనే ఆశయానికి మద్దతు నిస్తాడు. ముద్దుక్రిష్ణయ్య అతని అనుచరులు అరెస్ట్ అవుతారు. తన కాన్సెప్ట్ పలువురి ప్రాణాలు కాపాడిందన్న సంతోషం స్టాలిన్ కు దక్కుతుంది.

కథలో వైవిధ్యం ప్రదర్శించిన ఎ.ఆర్.మురుగదాస్, కథనంలో అంత పట్టు చూపించలేకపోయారు. అయినా చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. చిరంజీవి సరసన త్రిష నాయికగా నటించిన ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో అనుష్క తళుక్కుమనడం విశేషం. చిరంజీవి తల్లిగా శారద, అక్కగా ఖుష్బూ నటించారు. మిగిలిన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, ముకేశ్ రుషి, బ్రహ్మానందం, రియాజ్ ఖాన్, రవళి, సునీల్, శివారెడ్డి, సుబ్బరాజు, ఎల్బీ శ్రీరామ్, రవిప్రకాశ్, పరుచూరి వెంకటేశ్వరరావు కనిపించారు.

ఈ చిత్రానికి కథ మురుగదాస్, మాటలు పరుచూరి బ్రదర్స్, సంగీతం మణిశర్మ నిర్వహించారు. ఇందులో సుద్దాల అశోక్ తేజ రాసిన “సూర్యుడే సెలవనీ…” సాంగ్ విశేషాదరణ పొందింది. “గో గో గోవా…”, “సిగ్గుతో ఛీ ఛీ…”, “ఐ వన్నా స్పైడర్ మేన్…”, “తోబారే తోబా…”, “పరారే పరారే…” పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అనంత్ శ్రీరామ్, పెద్దాడ మూర్తి, కందికొండ ఈ పాటలు పలికించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.