Blood Group Mismatch: రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. పొరపాటున ఒకరి వారికి సంబంధించిన గ్రూపు రక్తం కాకుండా వేరే బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్లు చేసే సమయంలో, లేదంటే రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి రక్తం అవసరం అయినప్పుడు బ్లడ్ బ్యాంకుల నుంచి లేదా అదే బ్లడ్ గ్రూప్ కలిగిన దాతల నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఒకరికి వాళ్లకు సంబంధించిన రక్తానికి బదులుగా వేరే గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: India-China Flights: షాంఘై- న్యూఢిల్లీ మధ్య విమాన రాకపోకలు పునరుద్ధరణ..
వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే శత్రువు ప్రవేశించినట్లే..
ప్రతి మనిషి శరీరంలో రక్తం నాలుగు ప్రధాన గ్రూపులుగా ఉంటుంది. అవి A, B, AB, O. వీటికి పాజిటివ్, నెగటివ్ అనే ఉప వర్గాలు కలిపితే ఎనిమిది రకాల రక్త గ్రూపులు వస్తాయి. ఇక్కడ విషయం ఏమిటంటే మనిషి శరీరం ఒక బ్లడ్ గ్రూపును మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. పొరపాటు ఒక రక్తం గ్రూప్‌కు బదులుగా వేరే బ్లడ్ గ్రూపు ఎక్కిస్తే, శరీరం దాన్ని శత్రువుగా భావించి ప్రతిస్పందిస్తుందని వైద్యులు వివరించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. సాధారణంగా ఉండే ఈ బ్లడ్ గ్రూపులతో పాటు ప్రపంచంలో కొన్ని అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు.
బ్లడ్ గ్రూప్ ఎలా నిర్ధరిస్తారు?
బ్లడ్ గ్రూప్ నిర్ధరించడానికి రెండు ముఖ్యమైన పరీక్షలు చేస్తారు. అందులో ఎర్ర రక్తకణాలపై ఉండే యాంటిజెన్లను నిర్ధరించే ఫార్వర్డ్ గ్రూపింగ్ పరీక్ష ఒకటి. మరొకటి రక్తంలో ఉండే వేరు రక్త కణాలను గుర్తించేది అంటే యాంటీబాడీలను గుర్తించే రివర్స్ గ్రూపింగ్ పరీక్ష.
రక్తం గ్రూపు మారితే ఏం జరుగుతుంది..
పలువురు వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. శరీరంలో రక్తం గ్రూప్‌కు సంబంధించిన కాకుండా వేరేది ఎక్కించినప్పుడు శరీరంలో హీమోలిటిక్ రియాక్షన్ (ఎర్ర రక్త కణాలు పగిలిపోవడం) జరుగుతుందని వెల్లడించారు. “రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ఒక్కసారిగా పగిలిపోతాయి. దాంతో రోగికి జ్వరం, వణుకు, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, ఛాతీ నొప్పి, ఊపిరి బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితి ప్రాణాపాయం కలిగించవచ్చు. తప్పు గ్రూపు రక్తం ఎక్కితే, రోగిలోని రోగనిరోధక వ్యవస్థపై ఆ రక్తమే దాడి చేస్తుంది. దీన్నే ‘అక్యూట్ హీమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. అనుమానం వచ్చిన వెంటనే మొదట ట్రాన్స్‌ఫ్యూజన్ (రక్తం ఎక్కించడం) ఆపాలి” అని పేర్కొన్నారు.
“ఆ తర్వాత రోగికి ద్రవాలు, మందులు ఇచ్చి కిడ్నీలను కాపాడే ప్రయత్నం చేయాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయాటిక్స్, అవసరమైతే ఐసీయూలో మానిటరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రోగి రక్త నమూనా, బ్లడ్ బ్యాగ్ లేబుల్‌ని మళ్లీ చెక్ చేసి, తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం అవుతుంది” అని డాక్టర్లు హెచ్చరించారు. వాస్తవానికి “ఒక యూనిట్ రక్తం రోగికి చేరే క్రమంలో మూడు, నాలుగు సార్లు క్రాస్ చెక్ చేస్తారు. బ్లడ్ బ్యాంకులో గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్, లేబుల్స్ చెక్ చేయడం, మరోసారి బ్లడ్ గ్రూప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదం, హడావిడి లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల తప్పు జరిగే అవకాశం ఉంది. అయితే ఇలా తప్పులు జరగడం చాలా అరుదు’’ అని వైద్యులు పేర్కొన్నారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ.. మహా కూటమిలో చీలిక?
