చలికాలంలో చాలామంది శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఉదయాన్నే టీ తాగుతుంటారు. అయితే, ప్రతిరోజూ టీ తాగడం వల్ల బొడ్డు కొవ్వు పెరుగుతుందా? బరువు పెరుగుతుందా? అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. ఈ భయంతో కొందరు చలికాలంలో టీ తాగడాన్ని పూర్తిగా మానేయాలని కూడా ఆలోచిస్తుంటారు.
అయితే, ఛాయ్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సలీం జైదీ తెలిపారు. సరైన విధానంలో, సరైన పదార్థాలతో టీని తీసుకుంటే అది హానికరంగా కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చలికాలంలో టీ శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచడమే కాకుండా జీవక్రియలను సక్రియంగా ఉంచడంలో సహాయపడుతుందని చెప్పారు. అంతేకాదు, శరీర బరువు నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు కూడా టీ ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం చాలామంది టీలో అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, సెలెరీ వంటి పదార్థాలను కలుపుతారు. ఇవన్నీ శరీరానికి వేడిని అందించే గుణం కలిగి ఉండటంతో చలికాలంలో ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ సహజ పదార్థాలు జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మెటబాలిజాన్ని పెంచడంలో సహాయపడతాయి.
అల్లం, దాల్చిన చెక్క లేదా నల్ల మిరియాలతో తయారైన టీ శరీరాన్ని లోపల నుంచి వేడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, కొవ్వు కరుగుదలకు కూడా తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు. అందువల్ల టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, అయితే టీలో అధికంగా చక్కెర లేదా పాలు కలపకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మితంగా టీ తాగడం చాలా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు న్యూట్రిషియన్ ని కలవడం మంచింది.
