క్షయ వ్యాధి (టీబీ) బాధితులకు నెలల తరబడి రోజూ టాబ్లెట్లు మింగే భారం నుంచి ఉపశమనం కలిగించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ముందడుగు వేసింది. టీబీ నివారణకు, అలాగే చికిత్సకు ఉపయోగపడే దీర్ఘకాలిక ఇంజెక్షన్ల (Long-acting Injectable – LAI) అభివృద్ధి కోసం గ్లోబల్ టార్గెట్ ప్రొఫైల్స్‌ను ఆవిష్కరించింది. భవిష్యత్తులో టీబీ ముప్పు ఉన్నవారికి ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో నివారణ చికిత్సను అందించడం, వ్యాధి ఉన్నవారికి గరిష్టంగా 4 నెలల వ్యవధిలో కేవలం మూడు లేదా అంతకంటే తక్కువ దఫాల్లో డోసులు ఇచ్చి పూర్తి స్థాయిలో చికిత్స అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ఎందుకీ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్లు?
ప్రస్తుతం టీబీ చికిత్స విజయవంతం కావాలంటే బాధితులు నెలల తరబడి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజూ టాబ్లెట్లు గుర్తుంచుకుని వేసుకోవడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, పనులకు దూరమై ఆదాయం కోల్పోవడం , మందుల సైడ్ ఎఫెక్ట్స్ భరించడం పేద కుటుంబాలకు పెద్ద భారంగా మారుతోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికే మందులను శరీరంలోకి నెమ్మదిగా విడుదల చేసే టెక్నాలజీతో ఈ ఇంజెక్షన్లను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే గర్భనిరోధక సాధనాలు, మానసిక ఆరోగ్య చికిత్సలు, హెచ్ఐవీ (HIV) నివారణలలో వాడుతున్న ఈ పద్ధతిని ఇప్పుడు టీబీ కేర్ విభాగంలోకి తెచ్చేందుకు రీసెర్చర్లు ప్రయోగాలు చేస్తున్నారు.
భారత్‌కు ఎందుకంత కీలకం?
ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో నమోదయ్యే మొత్తం టీబీ కేసుల్లో దాదాపు నాలుగో వంతు మన దేశంలోనే ఉంటున్నాయి. కాబట్టి చికిత్సా విధానంలో వచ్చే చిన్న మార్పు అయినా కోట్లాది మంది బాధితుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. బాధితులు రోజూ ఆసుపత్రికి వెళ్లే అవసరం తగ్గడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. అంతేకాకుండా మధ్యలోనే మందులు ఆపేయడం వల్ల వచ్చే డ్రగ్ రెసిస్టెన్స్ (మందులకు వ్యాధి నిరోధకత పెరగడం) సమస్యను కూడా ఈ ఇంజెక్షన్ల ద్వారా అడ్డుకోవచ్చు. పైగా వీటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేలా రూపొందిస్తే రవాణా, పంపిణీ మరింత సులువవుతుంది.
ఇప్పుడే ఇవి అందుబాటులోకి వస్తాయా?
ప్రస్తుతానికి ఇవి మార్కెట్లో అందుబాటులో లేవు. డ్రగ్ డెవలపర్లు, పరిశోధకులు ఎలాంటి మందులు తయారుచేయాలో స్పష్టత ఇచ్చేందుకు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ ఈ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ కొత్త ఇంజెక్షన్లు ఇంకా క్లినికల్ ట్రయల్స్, భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని, సంబంధిత నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం టీబీకి చికిత్స పొందుతున్న రోగులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా డాక్టర్లు సూచించిన విధంగానే తమ టాబ్లెట్లను క్రమం తప్పకుండా వాడాలని, ఎలాంటి మార్పులు చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

