Yogurt Facial for Glowing Skin: మారుతున్న వాతావరణం, కాలుష్యం, దుమ్ము ప్రభావంతో చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే పెరుగు ద్వారా తక్కువ ఖర్చుతో చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్, జింక్, విటమిన్-బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా తేమను అందించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కేవలం నాలుగు సులభమైన దశల్లో పెరుగు ఫేషియల్ చేసుకోవడం ద్వారా చర్మానికి తక్షణ కాంతిని అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* మొదటి దశలో ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇది చర్మంపై పేరుకున్న మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.
* రెండో దశలో పెరుగులో బియ్యప్పిండి లేదా రవ్వ కలిపి స్క్రబ్‌గా ఉపయోగిస్తే మృత కణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
* మూడో దశలో పెరుగులో కలబంద జెల్, బాదం నూనె కలిపి 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది.
* చివరిగా పెరుగులో శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
అయితే ఏదైనా కొత్త పదార్థాన్ని చర్మంపై ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో పరీక్షించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సహజ పద్ధతుల్లో చర్మ సంరక్షణ కోరుకునే వారికి పెరుగు ఫేషియల్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

