Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Vastu Shastra

Vastu Shastra

Vastu Tips: మన దైనందిన జీవితంలో కొన్నిసార్లు తెలియకుండానే చేతిలో ఉన్న వస్తువులు కింద పడిపోతుంటాయి. సాధారణంగా దీన్ని మనం పొరపాటు అనో లేదా ఏదో ఆలోచనలో ఉండి జరిగిందనో తేలికగా తీసుకుంటాం. కానీ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చేతి నుంచి కొన్ని నిర్దిష్టమైన వస్తువులు పదే పదే కింద పడటం కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు. అది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు లేదా అశుభ పరిణామాలకు ఒక సంకేతం కావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ లేదా హారతి ఇచ్చే సమయంలో చేతిలో ఉన్న వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కింద పడిపోతే దాన్ని చాలా అశుభంగా భావిస్తారు. దేవునికి చేసే పూజలో ఏదో లోపం ఉందనడానికి లేదా భవిష్యత్తులో ఇంట్లోకి ఏదైనా పెద్ద విపత్తు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతోందనడానికి ఇది సూచన అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మన వంటగదిలో వాడే ఉప్పు కేవలం వంటకాల రుచిని మాత్రమే పెంచదు, దానికి జ్యోతిష్యపరంగా శుక్ర, చంద్ర గ్రహాలతో తీవ్రమైన సంబంధం ఉంది. అనుకోకుండా చేతిలో నుంచి ఉప్పు తరచూ కింద పడుతుంటే అది ఇంట్లో దరిద్రానికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అంతేకాదు, ఉప్పు కింద పడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక పాలు పొంగి కింద పడటం లేదా పాత్ర నుంచి ఒలికిపోవడం ఇంట్లో చాలా సాధారణంగా జరుగుతుంటుంది. కానీ జ్యోతిష్య కోణంలో చూస్తే ఇది అస్సలు మంచిది కాదు. పాలు కింద పడిపోతే ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు ప్రతికూల శక్తి పెరుగుతుందని, ధన నష్టం జరుగుతుందని నమ్ముతారు. జాతకంలో చంద్రుని ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

వంటకు వాడే నూనె లేదా నూనె సీసా చేతి నుంచి జారి కింద పడిపోవడం లేదా పగిలిపోవడం పెద్ద అపశకునంగా పరిగణిస్తారు. నూనె నేలపాలు కావడం అనేది రాబోయే రోజుల్లో వ్యాపారంలో, ఉద్యోగంలో లేదా ఆర్థిక విషయాల్లో పెద్ద ఎత్తున నష్టాలు, ఆటంకాలు ఎదురుకాబోతున్నాయనడానికి ఒక హెచ్చరిక. అలాగే దేవుడి పూజ గదిలో పూజ తాంబూలం లేదా అందులోని అక్షతలు, కుంకుమ, పువ్వులు వంటి పదార్థాలు చేతి నుంచి జారి కింద పడి చెల్లాచెదురైతే అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇంట్లోని కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందనడానికి లేదా ఏదైనా అపశకునం జరగబోతుందనడానికి ఇది సంకేతం. ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.