Tiny Holes in Clothes: అల్మారాలోని బట్టలకు చిన్న రంధ్రాలా? ఎలుకలు కాకపోవచ్చు.. ఈ కీటకాలతో జాగ్రత్త!

Tiny Holes In Clothes

Tiny Holes In Clothes

Tiny Holes in Clothes: వార్డ్‌రోబ్‌లో ఎన్నో బట్టలు పెట్టేస్తుంటారు.. ఖరీదైన చీరలు, స్వెటర్లు, లెహంగాలు.. ఇలా ఎన్నో శుభ్రంగా మడత పెట్టి పెట్టుకుంటారు.. అయితే, కొన్ని బట్టల్లో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయా? అల్మారాలోకి ఎలుకలు వచ్చాయని వెంటనే నిర్ణయానికి రావద్దు. సిల్వర్‌ఫిష్‌ వంటి చిన్న కీటకాలు లేదా ఇతర వస్త్రాలను ఆశ్రయించే కీటకాల వల్ల కూడా బట్టలు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా బట్టలను నెలల తరబడి ఒకేచోట ఉంచడం, అల్మారాలో తేమ పేరుకుపోవడం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలు సమస్యను పెంచవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ విలువైన దుస్తులను కాపాడుకోవచ్చు.

సిల్వర్‌ఫిష్‌ కీటకాలు ఎలా ఉంటాయి?

సిల్వర్‌ఫిష్‌ అనేవి చిన్నగా, వెండి రంగులో మెరుస్తూ కనిపించే కీటకాలు. ఇవి సాధారణంగా చీకటిగా, తేమగా ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయి. పిండిపదార్థాలు, కాగితం, జిగురు వంటి పదార్థాలతో పాటు కొన్ని వస్తువులపై ఉండే పదార్థాలను కూడా తింటాయి. అల్మారాలను ఎక్కువకాలం శుభ్రం చేయకపోయినా, తేమ ఎక్కువగా ఉన్నా ఈ కీటకాలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, బట్టలకు రంధ్రాలు ఏర్పడటానికి ఇవే కారణమని నిర్ధారించలేం. ఇతర కీటకాలు కూడా దుస్తులను పాడుచేయవచ్చు..

బట్టలను కీటకాల నుంచి కాపాడుకునే 5 చిట్కాలు

1. దాల్చినచెక్కతో ప్రయత్నించండి
వంట గదిలో ఉండే దాల్చినచెక్క ఘాటైన సువాసన కారణంగా కొన్ని ఇంటి చిట్కాల్లో కీటకాలను దూరంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. కొన్ని దాల్చినచెక్క ముక్కలను పలుచని పత్తి వస్త్రంలో చుట్టి చిన్న మూటలా కట్టుకోవచ్చు. దాన్ని అల్మారా మూలల్లో లేదా డ్రాయర్లలో ఉంచవచ్చు. అయితే ఇది సిల్వర్‌ఫిష్‌ను నియంత్రిస్తుందని బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి అల్మారా శుభ్రతకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

2. దోసకాయ తొక్కలను ఉపయోగించవచ్చా?
ఇక, విరివిగా ఉపయోగించే దోసకాయ తొక్కలు సిల్వర్‌ఫిష్‌ను తరిమికొడతాయని కొన్ని గృహ చిట్కాలు సూచిస్తున్నాయి. అయితే దీనికి తగిన శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. అంతేకాకుండా తొక్కలను అల్మారాలో ఉంచితే అవి కుళ్లి, తేమ లేదా దుర్వాసన సమస్యను పెంచవచ్చు. అందువల్ల అల్మారాలో ఆహార వ్యర్థాలను ఉంచకుండా ఉండటమే మంచిది.

3. బేకింగ్ సోడా విషయంలో జాగ్రత్త
బేకింగ్ సోడాను చక్కెరతో కలిపి సిల్వర్‌ఫిష్‌ను చంపవచ్చని కొన్ని ఇంటి చిట్కాలు చెబుతాయి. అయితే ఈ పద్ధతి ప్రభావవంతమని నిర్ధారించే ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. ఈ మిశ్రమాన్ని బట్టలపై లేదా పిల్లలు, పెంపుడు జంతువులకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో చల్లకండి. కీటకాల సమస్య ఎక్కువగా ఉంటే తగిన నియంత్రణ పద్ధతులను ఎంచుకోవాలి.

4. లావెండర్‌, నిమ్మ నూనెలతో సువాసన
లావెండర్‌, నిమ్మ, నారింజ వంటి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను కీటకాలను దూరంగా ఉంచేందుకు కొందరు ఉపయోగిస్తారు. అయితే ఇవి సిల్వర్‌ఫిష్‌ను పూర్తిగా నియంత్రిస్తాయని చెప్పలేం. నూనెలను నేరుగా ఖరీదైన చీరలు, పట్టు వస్త్రాలు లేదా ఇతర దుస్తులపై పిచికారీ చేయవద్దు. మరకలు పడే అవకాశం ఉంటుంది. ఉపయోగించే ఉత్పత్తిపై సూచనలను పాటించండి.

5. డయాటోమేషియస్‌ ఎర్త్‌ ఉపయోగం
డయాటోమేషియస్‌ ఎర్త్‌ అనేది కొన్ని రకాల కీటకాల నియంత్రణకు ఉపయోగించే సన్నని పొడి. ఇది కీటకాల బయటి పొరపై ప్రభావం చూపి, వాటిలో నీటి నష్టాన్ని కలిగించగలదు. అయితే ప్రతి రకమైన డయాటోమేషియస్‌ ఎర్త్‌ గృహ వినియోగానికి అనువైనది కాదు. లేబుల్‌పై సూచించిన విధంగానే ఉపయోగించాలి. పొడిని పీల్చకుండా జాగ్రత్తపడాలి; బట్టలపై నేరుగా చల్లకండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి.

బట్టలకు రంధ్రాలు కనిపిస్తే ఈ పొరపాట్లు చేయకండి!

* బట్టలపై చిన్న రంధ్రాలు కనిపించగానే సిల్వర్‌ఫిష్‌ వల్లే నష్టం జరిగిందని భావించకండి. ముందుగా బట్టలను, అల్మారాను పూర్తిగా తనిఖీ చేయాలి. సమస్యను గుర్తించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.

బట్టలను పరిశీలించండి: రంధ్రాలు కనిపించిన దుస్తులను ఇతర బట్టల నుంచి వేరుగా ఉంచి, వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. అవసరమైతే సంరక్షణ సూచనల ప్రకారం ఉతకండి లేదా డ్రై క్లీనింగ్‌ చేయించండి.

అల్మారాను శుభ్రం చేయండి: డ్రాయర్లు, మూలలు, అరల వెనుక భాగాల్లో పేరుకున్న దుమ్ము, చెత్తను తొలగించండి.

తేమను నివారించండి: ఉతికిన బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే అల్మారాలో పెట్టండి. అల్మారాలో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోండి.

బట్టలను ఎక్కువకాలం అలాగే వదలకండి: నిల్వ ఉంచిన చీరలు, స్వెటర్లు, లెహంగాలను అప్పుడప్పుడు బయటకు తీసి పరిశీలించండి.

కీటకాల ఆనవాళ్లను గమనించండి: చిన్న కీటకాలు, వాటి గుడ్లు లేదా ఇతర ఆనవాళ్లు కనిపిస్తే సమస్య మూలాన్ని గుర్తించండి. నష్టం కొనసాగితే కీటక నియంత్రణ నిపుణులను సంప్రదించండి.

మరీ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఖరీదైన బట్టలను కాపాడుకోవడానికి సువాసనలపై మాత్రమే ఆధారపడకండి. అల్మారాను శుభ్రంగా, పొడిగా ఉంచడం, బట్టలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, కీటకాల అసలు కారణాన్ని గుర్తించడం అత్యంత ముఖ్యం.. డబ్బుు ఖర్చు చేసి ఖరీదైన బట్టలను కొనడమే కాదు.. వాటిని కాపాడు కోడం కూడా మన బాధ్యతే మరి.