Home Safety Tips : వేసవి కాలం రాకతో ప్రకృతిలో అనేక కీటకాలు, జంతువులు చురుగ్గా మారతాయి. వీటిలో బల్లులు, బొద్దింకలు మాత్రమే కాకుండా, ప్రమాదకరమైన విషపూరిత పాములు కూడా ఉంటాయి. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ, పాములు తమ కోసం చల్లని , చీకటిగా ఉండే ఆశ్రయ స్థలాలను వెతుక్కుంటూ తమ బిలాల నుండి బయటకు వస్తాయి. ఇలాంటి సమయంలో తోటల్లోని పొదల్లో, ఇంటి ముంగిట ఉన్న పూల మొక్కల మధ్య లేదా కొన్నిసార్లు నేరుగా ఇంటి లోపలికి కూడా పాములు ప్రవేశించడం సాధారణం. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకుండా, పరిస్థితిని అత్యంత శాంతంగా , ఎచ్చరికతో నిర్వహించడం చాలా ముఖ్యం. ఇంటి చుట్టుపక్కల పాము కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన మునెచ్చరికా చర్యలు ఇక్కడ ఉన్నాయి:
మొదట శాంతంగా ఉండండి, గాబరిపడకండి
పాము కనిపించిన తక్షణమే అరుస్తూ, కేకలు వేస్తూ శబ్దం చేయకూడదు. ఎందుకంటే పాములు సాధారణంగా స్వభావతః ఆక్రమణకారులు కావు; వాటికి ఏదైనా ముప్పు లేదా ప్రమాదం ఎదురైందని అనిపించినప్పుడు మాత్రమే తమను తాము రక్షించుకోవడానికి దాడి చేస్తాయి. పాముపై రాళ్లు విసరడం, కర్రలతో కొట్టడానికి ప్రయత్నించడం లేదా హఠాత్తుగా కదలడం వల్ల అవి మరింత కోపోద్రిక్తం అవుతాయి. అందువల్ల, దీర్ఘ శ్వాస తీసుకుని, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ పరిస్థితిని సురక్షితంగా నియంత్రించడంపై దృష్టి పెట్టండి. ఇది మీరు స్పష్టంగా ఆలోచించి, బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి సహాయపడుతుంది.
దూరం నుంచే పాముపై నిఘా ఉంచండి
పాము ఎక్కడ ఉంది, ఏ వైపుకు కదులుతోంది అనేది కిటికీ, బాల్కనీ లేదా గేట్ వెనుక నుండి సురక్షితంగా నిలబడి గమనించండి. దానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే దాని కదలికలను గమనించడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు, అలాగే అది ఎక్కడ దాక్కుందో తెలుసుకోవడానికి వీలవుతుంది.
6 నుండి 8 అడుగుల సురక్షిత దూరాన్ని పాటించండి
పామును చూసిన వెంటనే గాబరిపడకుండా నిదానంగా వెనక్కి జరగండి, అంతేకాని హఠాత్తుగా వెనక్కి పరుగెత్తకండి. పాము నుండి కనీసం 6 నుండి 8 అడుగుల సురక్షిత దూరాన్ని ఎల్లప్పుడూ పాటించాలి. అది విషపూరితమైనదా కాదా అని గుర్తించడానికి దాని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు. అలాగే ఆ ప్రాంతంలో పిల్లలు, పెంపుడు జంతువులు ఉండకుండా వెంటనే దూరంగా పంపించండి.
సొంతంగా పట్టే ప్రయత్నం వద్దు, నిపుణులను సంప్రదించండి
పామును గెలకడం, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదా కర్రలతో కొట్టడం మీ ప్రాణాలకే పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పామును పట్టే సాహసాలకు వెళ్లకండి. ఒకవేళ పాము మీ ఇంటి లోపల లేదా చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉండిపోతే, వెంటనే స్థానిక వన్యప్రాణి సంరక్షకులు (స్నేక్ క్యాచర్స్) లేదా అటవీ శాఖ నిపుణులను సంప్రదించి వారి సహాయాన్ని తీసుకోండి.
ఇంటి చుట్టుపక్కల పాములు రాకుండా ఉండేందుకు చిట్కాలు
ఇంటి చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారం, ఎండిపోయిన ఆకులు , దట్టమైన పొదలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇవి పాములకు మంచి నివాస స్థలాలుగా మారతాయి. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఇంటి చుట్టుపక్కల తిరిగేటప్పుడు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే టార్చ్ లైట్ ఉపయోగించడం చాలా మంచిది.
