Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

Kitchenhacks

Kitchenhacks

Kitchen Tips: సాధారణంగా మనం మార్కెట్ లేదా సంత నుంచి తెచ్చిన కూరగాయలు రెండు మూడు రోజుల్లోనే వాడిపోతుంటాయి. ముఖ్యంగా ఆకుకూరలు, పచ్చిమిర్చి వంటివి త్వరగా పాడై పోతుంటాయి. అలా కాకుండా, మీరు తెచ్చిన కూరగాయలు రెండు మూడు వారాల పాటు అప్పుడే తెచ్చినట్లు తాజాగా ఉండాలంటే కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించాలి. ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. వీటికి బదులుగా జిప్ లాక్ ఉన్న కాటన్ బ్యాగులు లేదా నెట్ బ్యాగులను వాడటం ఉత్తమం. ఇవి గాలి ఆడేలా చేసి కూరగాయలు తాజాగా ఉండేలా చేస్తాయి. ఫ్రిజ్‌లో స్థలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగులు చాలా ఉపయోగపడతాయి. ఆకుకూరల విషయానికి వస్తే వాటిని నిల్వ చేసేటప్పుడు వాటి వేర్లను కట్ చేసి, పండిన ఆకులను ఏరివేయాలి. ఆ తర్వాత ఒక గాలి చొరబడని బాక్స్‌లో కింద, పైన టిష్యూ పేపర్ లేదా పేపర్ వేసి అందులో ఈ ఆకులను పెట్టి మూత పెట్టాలి. దీనివల్ల తేమను పేపర్ పీల్చుకుని ఆకుకూరలు ఎక్కువ రోజులు కుళ్లిపోకుండా ఉంటాయి.

కరివేపాకును కడిగిన తర్వాత తడి లేకుండా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఆకులను రెబ్బల నుంచి వేరు చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంట చేసేటప్పుడు సులభంగా ఉండటమే కాకుండా ఆకులు తాజాగా ఉంటాయి. చాలామంది పచ్చిమిర్చిని తెచ్చినది తెచ్చినట్లుగా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ పచ్చిమిర్చి త్వరగా పాడవ్వడానికి ప్రధాన కారణం వాటి ‘తొడిమలు’. పచ్చిమిర్చిని నిల్వ చేసే ముందు వాటి తొడిమలను తీసివేసి, ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసి భద్రపరిస్తే 15-20 రోజుల వరకు పాడవవు.

అల్లం పాడవకుండా ఉండాలంటే దానిపై ఉన్న మట్టిని శుభ్రం చేసి, పూర్తిగా ఆరిన తర్వాత పేపర్ బాగ్స్‌లో ఉంచాలి. వెల్లుల్లిని రెబ్బలుగా వొలుచుకుని ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటే వంట పని సులభం అవుతుంది. క్యారెట్లను పైన, కింద అంచులను కట్ చేసి జిప్ లాక్ బ్యాగుల్లో పెడితే తాజాగా ఉంటాయి. మునగకాయలను ముక్కలుగా కోసి గాలి చొరబడని డబ్బాల్లో లేదా కవర్లలో ఉంచాలి. అరటిపండ్లు త్వరగా పండిపోయి నల్లబడకుండా ఉండాలంటే, వాటి పైభాగం (కాడ) దగ్గర సిల్వర్ ఫాయిల్ (Silver Foil) తో చుట్టాలి. దీనివల్ల ఇథిలీన్ గ్యాస్ విడుదల తగ్గి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే ఫ్రిజ్‌లో పెట్టే బాక్స్‌లలో అప్పుడప్పుడు తేమ చేరుతుంటుంది. ఆ తేమను తుడుస్తూ, పేపర్ తడిస్తే మార్చుతూ ఉండాలి. పన్నీర్ వంటివి నిల్వ చేసేటప్పుడు నీటిని ప్రతిరోజూ మారుస్తూ ఉంటే అది తాజాగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ వంటగదిలోని కూరగాయలు వృథా కాకుండా ఉండటమే కాక, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

READ ALSO: Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!