Laundry Tips: వర్షాకాలంలో నిత్యం కురిసే వర్షాల కారణంగా బట్టలు సరిగ్గా ఆరకపోవడం, వాటి నుంచి ఒక రకమైన చెడు వాసన రావడం సహజం. సాధారణంగా బట్టలు ఉతికేటప్పుడు ‘కంఫర్ట్’ వంటి ఫ్యాబ్రిక్ కండీషనర్లను ఉపయోగించడం మర్చిపోతే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి సమయాల్లో బట్టలు మంచి సువాసనతో ఉండేందుకు కొన్ని సులువైన టిప్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
* స్ప్రే బాటిల్ చిట్కా: ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌ను తీసుకుని, అందులో రెండు కంఫర్ట్ ప్యాకెట్ల లిక్విడ్‌ను పోయాలి. ఆపై దాంట్లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత (కొన్ని గంటల తర్వాత అయినా) ఈ లిక్విడ్‌ను బట్టలపై స్ప్రే చేయడం ద్వారా బట్టలు మంచి సువాసనతో ఉంటాయి.
* ఐరన్ చేసేటప్పుడు: కొన్నిసార్లు బట్టలు పూర్తిగా ఆరినప్పటికీ, వాటి నుంచి తేమ వల్ల వచ్చే ఒక రకమైన దుర్వాసన వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు పైన పేర్కొన్న కంఫర్ట్ లిక్విడ్‌ను బట్టలపై లైట్‌గా స్ప్రే చేసి, ఆపై ఐరన్ చేయడం వల్ల బట్టల నుంచి దుర్వాసన పూర్తిగా పోయి, చక్కటి సువాసన వస్తుంది.
* బేకింగ్ సోడా : బట్టల నుంచి వచ్చే ఎలాంటి చెడు వాసననైనా పోగొట్టడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ పౌడర్‌తో పాటు ఒక చెంచా బేకింగ్ సోడాను కూడా వేయాలి. ఇలా చేస్తే బట్టల్లోని దుర్వాసనను బేకింగ్ సోడా లాగేసి, బ్యాక్టీరియాను దూరం చేస్తుంది.
* వెనిగర్ : వెనిగర్ బట్టలకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది దుర్వాసనను పూర్తిగా తగ్గిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. బట్టలు ఉతికిన తర్వాత, చివరిసారిగా నీళ్లలో ముంచేటప్పుడు కొద్దిగా వైట్ వెనిగర్ వేసి అందులో బట్టలను కాసేపు నానబెట్టి ఆరేయండి. ఆరిపోయాక వెనిగర్ వాసన అస్సలు ఉండదు.
* కర్పూరం: బీరువాలో లేదా బట్టలు సర్దే చోట తేమ చేరడం వల్ల కూడా బట్టలు వాసన వస్తాయి. ఇలాంటి సమయాల్లో బట్టలు మడతపెట్టి పెట్టే అల్మారాల్లో కొన్ని కర్పూరం బిళ్లలు లేదా నాఫ్తలీన్ గోళీలను చిన్న కాటన్ క్లాత్‌లో చుట్టి ఉంచండి. ఇవి తేమను పీల్చుకుని బట్టలు తాజాగా ఉండేలా చేస్తాయి.
* నిమ్మరసం: నిమ్మరసంలో ఉండే యాసిడ్ గుణాలు బట్టల జిడ్డును, బ్యాక్టీరియాను వదిలిస్తాయి. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. బట్టలు పిండే నీటిలో ఒక చెంచా నిమ్మరసం కలిపితే, బట్టలు మంచి తాజాదనంతో కూడిన సువాసన వస్తాయి.
* వర్షం పడుతున్నప్పుడు బట్టలను ఇంట్లోనే ఆరేయాల్సి వస్తే, కచ్చితంగా ఫ్యాన్ కింద ఆరేయండి. గాలి ఆడకపోతేనే బట్టల నుంచి దుర్వాసన వస్తాయి.
* బట్టలను ఉతికిన తర్వాత ఎక్కువసేపు వాషింగ్ మెషీన్‌లో గానీ, బకెట్‌లో గానీ అలాగే వదిలేయకండి. వెంటనే ఆరేయడం వల్ల వాసన రాకుండా చూసుకోవచ్చు.
* చెమట పట్టిన లేదా వర్షానికి తడిసిన బట్టలను నేరుగా మిగతా బట్టల బాస్కెట్‌లో వేయకండి. వాటిని విడిగా ఆరబెట్టిన తర్వాతే ఉతకడానికి వేయండి. ఇలా చేస్తే బట్టలు వాసన రావని చెబుతున్నారు.

