How to Store Fashion Jewellery: ఆధునిక కాలంలో ఎలాంటి ట్రెండీ డ్రెస్సెస్ వేసుకున్నా, వాటికి తగ్గట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ ధరించడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కావచ్చు, ఏడీ నెక్లెస్ లేదా కుందన్ వర్క్ నగలైనా సరే మన లుక్‌ను ఇట్టే మార్చేస్తాయి. అయితే, ఈ ఆర్టిఫిషియల్ నగలతో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే.. గాలి, తేమ, చెమట లేదా పర్ఫ్యూమ్ తాకగానే ఇవి త్వరగా నల్లబడిపోయి తమ మెరుపును కోల్పోతుంటాయి. మనకు ఎంతో ఇష్టమైన, కాస్త ఖరీదైన ఆభరాణాలు కూడా సరైన సంరక్షణ లేక త్వరగానే పాడైపోతుంటాయి. ఈ సమస్యకు మీరుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని సులభమైన, తెలివైన ఇంటి చిట్కాలను పాటిస్తే మీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీని సంవత్సరాల తరబడి కొత్తగా, మెరిసేలా ఉంచుకోవచ్చు.
కొత్త ఆర్టిఫిషియల్ నగలను వాడే ముందు వాటిపై పారదర్శకమైన నెయిల్ పాలిష్‌తో ఓ సన్నని పూత పూయాలి. ఇలా చేయడం వల్ల నగల లోహానికి, గాలికి మధ్య నేరుగా సంబంధం ఉండదు. ఫలితంగా చెమట, గాలి సోకక నగలు ఎప్పటికీ నల్లబడవు, వాటి రంగు కూడా పోదు. ఈ ఆభరాణాలను ఎప్పుడూ గాల్లో వదిలేయడం గానీ, వెల్వెట్ లేదా దూది ఉండే డబ్బాల్లో గానీ దాచకూడదు. ఎందుకంటే ఇవి తేమను త్వరగా పీల్చుకుంటాయి. వీటికి బదులుగా ఎయిర్‌టైట్ జిప్‌లాక్ బ్యాగుల్లో భద్రపరచాలి లేదా బటర్ పేపర్, కాటన్ గుడ్డలో చుట్టి ఉంచితే గాలి, తేమ లోపలికి వెళ్లవు. అలాగే ఎప్పుడైనా సరే ‘అన్నింటికంటే చివరగా నగలు ధరించాలి, ఇంటికి రాగానే మొదటగా వాటిని తీసేయాలి’ అనే సూత్రం గుర్తుంచుకోవాలి. మేకప్, హెయిర్ స్ప్రే, పర్ఫ్యూమ్ వేసుకున్న కనీసం పది పదిహేను నిమిషాల తర్వాతే నగలు పెట్టుకోవాలి. పర్ఫ్యూమ్లో ఉండే రసాయనాలు, ఆల్కహాల్ లోహపు రంగును వెంటనే నల్లగా మారుస్తాయి.
ఏదైనా పార్టీ లేదా కార్యక్రమం ముగించుకుని రాగానే ఆభరాణాలను అలాగే డబ్బాలో పెట్టేయకూడదు. చెమట తగలడం వల్ల లోహాలకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నగలను తీసేసిన వెంటనే పొడి డ్రెస్సింగ్ గుడ్డతో లేదా టిష్యూతో తుడిచి, పది నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాతే వాటిని జిప్‌లాక్ బ్యాగుల్లో భద్రపరచాలి. మీ నగలు పెట్టుకునే డబ్బాలో ఒకటి రెండు తెల్ల చాక్ పీస్ ముక్కలు లేదా సిలికా జెల్ చిన్న ప్యాకెట్లు (కొత్త బూట్లు లేదా బ్యాగుల్లో వచ్చేవి) ఉంచాలి. ఇవి డబ్బాలో ఉండే ఎలాంటి తేమైనైనా పీల్చుకుంటాయి. దాంతో మీ నగలు ఎక్కువ కాలం పాటు సురక్షితంగా, కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.

