నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలకు ఇంటి పైకప్పులపైన లేదా బాల్కనీలలో కోతులు కనిపించడం ఒక పెద్ద సమస్యగా మారింది. అవి కొన్నిసార్లు ఆరబెట్టిన బట్టలను చించడం, పూల కుండీలను పడగొట్టడం, మొక్కలను పాడుచేయడం వంటి పనులతో తీవ్ర చికాకు కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం కోసం నీటి ట్యాంకుల మూతలను తెరవడం లేదా ఇళ్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం చేస్తుంటాయి. దీంతో విసిగిపోయిన ప్రజలు కోతుల బెడదను నివారించడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం, హాని తలపెట్టకుండా కొన్ని సహజమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా కోతులను మన ఇంటికి దూరంగా ఉంచవచ్చు. ఆ సులభమైన పద్ధతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటి పైకప్పు మీద ఆహారం ఉంచవద్దు
కోతులు తరచుగా తినడానికి ఏమైనా దొరుకుతుందనే ఆశతోనే పైకప్పుల మీదకు వస్తుంటాయి. పండ్లు, కూరగాయలు, రొట్టె లేదా ఇతర ఆహార పదార్థాలను పైకప్పు మీద కనపడేలా ఉంచడం వల్ల కోతులు వచ్చే అవకాశం విపరీతంగా పెరుగుతుంది. అందువల్ల పైకప్పు మీద ఎప్పుడూ ఆహారాన్ని ఉంచవద్దు. ఒకవేళ పైకప్పు మీద చెత్తబుట్ట ఉంటే దానిని ఎల్లప్పుడూ మూసి ఉంచండి , మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కడా పారవేయవద్దు. మీకు పెంపుడు జంతువులు ఉంటే, వాటి ఆహారాన్ని కూడా పైకప్పు మీద లేదా బాల్కనీలో బహిరంగంగా వదిలివేయవద్దు.
వెనిగర్ , వెల్లుల్లి ఘాటైన వాసన
కొంతమంది కోతులను దూరంగా ఉంచడానికి వెనిగర్, వెల్లుల్లి వంటి వంటింటి చిట్కాలను ఉపయోగిస్తారు. వీటి ఘాటైన వాసన కోతులను కొన్ని ప్రాంతాల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. వెనిగర్ లేదా వెల్లుల్లి రసంలో నానబెట్టిన గుడ్డను ఇంటి పైకప్పు మూలల్లో ఉంచవచ్చు. అయితే, ఏదైనా ద్రావణాన్ని పిచికారీ చేసే ముందు అది మీ మొక్కలకు, పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలిగించదని నిర్ధారించుకోవడం మంచిది.
రబ్బరు లేదా ప్లాస్టిక్ పాముల వినియోగం
రబ్బరు లేదా ప్లాస్టిక్ తో చేసిన నకిలీ పాములను ఉపయోగించి కోతులను తాత్కాలికంగా భయపెట్టి తరిమివేయవచ్చు. వీటిని ఇంటి పైకప్పు మీద, బాల్కనీలో లేదా కోతులు తరచుగా తిరిగే ఇతర ప్రదేశాలలో ఉంచవచ్చు. అయితే కాలక్రమేణా కోతులు అటువంటి వస్తువులకు అలవాటుపడే అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతి అన్నివేళలా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.
పాత సీడీలు , అల్యూమినియం ఫాయిల్
ఇంట్లో పడి ఉన్న పాత సీడీలు , అల్యూమినియం ఫాయిల్‌ను కేవలం పావురాలను దూరంగా ఉంచడానికే కాకుండా, కోతులు పైకప్పు మీదకు రాకుండా నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. వీటిని సీలింగ్‌కు లేదా బాల్కనీకి వేలాడదీయడం ద్వారా గాలికి ఊగుతూ కాంతిని ప్రతిబింబిస్తాయి. వీటి నుంచి వచ్చే ఆకస్మిక కాంతి మెరుపులు, కదలికలు కోతులకు చికాకు కలిగిస్తాయి.
బలమైన వలలు , గ్రిల్స్ ఏర్పాటు
కోతులు తరచుగా నీటి ట్యాంకుల మూతలను తెరవడం లేదా పైకప్పుపై వస్తువులను పాడుచేయడం చేస్తుంటాయి. అందువల్ల నీటి ట్యాంకు మూత దృఢంగా ఉండేలా చూసి గట్టిగా మూసి ఉంచాలి. అదనంగా కోతులు ఇంట్లోకి ప్రవేశించగల స్కైలైట్లు (పైకప్పు కిటికీలు), బాల్కనీలు , ఇతర బహిరంగ ప్రదేశాలలో బలమైన ఇనుప జాలీలను అమర్చవచ్చు. ఈ వలలు దృఢంగా ఉండాలి, అలా అని కోతులు చిక్కుకుపోయేంత లేదా గాయపడేంత బిగుతుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
చెట్ల కొమ్మలను కత్తిరించడం
మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు పైకప్పును తాకుతుంటే, కోతులు ఆ కొమ్మల సహాయంతో మరింత సులభంగా మీ ఇంట్లోకి ప్రవేశించగలవు. అందువల్ల ఇంటి చుట్టూ ఉన్న చెట్లను క్రమం తప్పకుండా కత్తిరించడం , పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

