Mosquito Home Remedies: దోమల బెడద ఎక్కువ అయిపోయింది.. ఇక, వేసవి కాలం రాగానే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంటి లోపల, బయట దోమలు ఇబ్బందికరంగా మారుతాయి. ఇవి నిద్రకు భంగం కలిగించడమే కాకుండా.. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతాయి. చాలామంది దోమలను తరిమికొట్టేందుకు కాయిల్స్, కెమికల్ స్ప్రేలు వాడుతుంటారు. అయితే, వాటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హానికరంగా ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని సహజమైన, సులభమైన గృహ నివారణలను ఉపయోగించి కూడా దోమలను దూరంగా ఉంచవచ్చు.
1. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడండి
దోమలు సాధారణంగా నిల్వ నీటిలోనే పెరుగుతాయి. కుండలు, బకెట్లు, కూలర్లు, డ్రెయిన్లు వంటి ప్రదేశాల్లో నీరు పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దోమల లార్వా పెరగకుండా అడ్డుకోవచ్చు.
2. వెల్లుల్లి స్ప్రే ఉపయోగించండి
వెల్లుల్లిలో దోమలకు ఇష్టంకాని బలమైన వాసన ఉంటుంది. వెల్లుల్లిని నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో వేసి కిటికీలు, తలుపులు లేదా మొక్కల దగ్గర పిచికారీ చేస్తే దోమలు దూరంగా ఉంటాయి.
3. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడండి
దోమలు కొన్ని వాసనలను అసహ్యించుకుంటాయి. నిమ్మ గడ్డి (లెమన్ గ్రాస్), యూకలిప్టస్, టీ ట్రీ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటితో కలిపి గదిలో స్ప్రే చేయవచ్చు. లేదా కాటన్ బాల్స్‌లో ఈ నూనెలను వేసి తలుపులు, కిటికీల దగ్గర ఉంచవచ్చు.
4. వేప ఆకులను పొగబెట్టండి
పాతకాలంలో ప్రజలు దోమలను తరిమికొట్టడానికి ఎండిన వేప ఆకులను కాల్చేవారు. ఆ పొగ వాసన దోమలకు ఇష్టంకాదు. బాల్కనీ, వరండా లేదా తోటలో వేప ఆకులను పొగబెట్టడం వల్ల దోమలు తగ్గుతాయి.
5. కిటికీలు, తలుపులకు మెష్ అమర్చండి
దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు కిటికీలు, తలుపులకు ఫైన్ మెష్ అమర్చడం మంచి పరిష్కారం. ఇలా చేస్తే గాలి లోపలికి వస్తుంది కానీ దోమలు లోపలికి రావు.
6. దోమలను దూరం చేసే మొక్కలు నాటండి
కొన్ని మొక్కల వాసన దోమలకు నచ్చదు. సిట్రోనెల్లా, తులసి, లావెండర్, పుదీనా వంటి మొక్కలను తలుపులు, కిటికీలు లేదా బాల్కనీ దగ్గర నాటితే దోమలు తగ్గుతాయి. ఇవి ఇంటి చుట్టూ పచ్చదనాన్ని పెంచడంతో పాటు గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.
7. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచండి
చెత్త, దట్టమైన పొదలు లేదా మురికి ప్రదేశాలు దోమల పెరుగుదలకు కారణమవుతాయి. అందువల్ల ఇంటి లోపల మరియు చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.
