Coffee Mug Cleaning Tips: కాఫీ ప్రియులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో కాఫీ మగ్‌పై ఏర్పడే మొండి గోధుమ రంగు మరకలు ఒకటి. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల మగ్ లోపల ఏర్పడే ఈ మరకలు సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో సులభంగా తొలగవు. దీంతో చాలామంది బలంగా రుద్దడం లేదా ఖరీదైన క్లీనర్లు ఉపయోగించడం చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో ఎలాంటి శ్రమ లేకుండా మగ్‌ను మళ్లీ కొత్తదానిలా మెరిపించవచ్చు.
బేకింగ్ సోడాతో మరకలు మాయం..
బేకింగ్ సోడా కాఫీ మరకలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేసి మరకలపై రాసి 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. అనంతరం మృదువైన స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో సున్నితంగా రుద్ది నీటితో కడిగితే మరకలు సులభంగా తొలగిపోతాయి.
నిమిషాల్లో మరకలకు గుడ్‌బై..
తెల్లటి లేదా లేత రంగు మగ్‌లపై పాత మరకలు ఉంటే 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. మరకలు పూర్తిగా మునిగేలా ద్రావణం పోసి సుమారు 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్‌కు స్వల్ప బ్లీచింగ్ లక్షణం ఉండటంతో రంగురంగుల మగ్‌లపై ఉపయోగించకపోవడం మంచిది.
సులువుగ మరకలకు బైబై..
ఇంట్లో బేకింగ్ సోడా లేకపోతే, గిన్నెలు కడిగే ద్రవానికి కొన్ని చుక్కల తెల్ల వెనిగర్ కలిపి కూడా మరకలను తొలగించవచ్చు. ముందుగా మగ్‌ను వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి, తర్వాత ఈ మిశ్రమంతో మృదువైన స్పాంజ్ సహాయంతో శుభ్రం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే కాఫీ తాగిన వెంటనే మగ్‌ను నీటితో కడిగే అలవాటు చేసుకుంటే మొండి మరకలు ఏర్పడకుండా నివారించవచ్చు. కాఫీ అవశేషాలు ఎక్కువసేపు మగ్‌లో ఉండకుండా చూసుకోవడం వల్ల మగ్ ఎక్కువకాలం శుభ్రంగా, కొత్తదానిలా మెరిసిపోతుంది.

