Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి

Pets

Pets

Pet Hair Cleaning Tips: ఇంట్లో ఓ కుక్క లేదా పిల్లి ఉంటే ఆ సందడే వేరు. వాటితో ఆడుకోవడం, కాసేపు సరదాగా గడపడం అంటే అందరికీ ఇష్టమే. కానీ, మన ముద్దుల పెంపుడు జంతువులు (Pets) ఉన్న చోట ఇంకో పెద్ద సమస్య వచ్చిపడుతుంది.. అదే వాటి జుట్టు ( వెంట్రుకలు)! బెడ్‌షీట్లు, సోఫాలు, కార్పెట్లు, మనం వేసుకునే దుస్తులు, ఆఖరికి నేలమీద కూడా సన్నటి వెంట్రుకలు అతుక్కుని దర్శనమిస్తుంటాయి. ఎంత ఊడ్చినా, తడిగుడ్డ పెట్టి తుడిచినా కాసేపటికే మళ్లీ ప్రత్యక్షమవుతాయి. పెట్స్ పెంచుకునే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే పెద్ద తలనొప్పి ఇది. ముఖ్యంగా సోఫాలు, పరుపులు వంటి ఫ్యాబ్రిక్స్‌కు అతుక్కుపోయిన వెంట్రుకలను వదిలించడం చాలా కష్టం. ఎంత శుభ్రం చేసినా ఇల్లు ఇంకా మురికిగానే ఉందేమో అనే భావన కలుగుతుంది. అయితే, ఈ చిన్ని చిన్ని చిట్కాలను పాటిస్తే రోజువారీ శ్రమను తగ్గించుకుంటూ, ఇంట్లోని పెట్ హెయిర్‌ను క్షణాల్లో సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.

చేతికి రబ్బరు గ్లౌజులు (Rubber Gloves) తొడుక్కుని సోఫా లేదా బెడ్‌పై ఉన్న వెంట్రుకలపై తేలికగా నిమిరినట్లు రుద్దితే చాలు. స్టాటిక్ విద్యుత్ కారణంగా ఆ వెంట్రుకలన్నీ గ్లౌజుకు అతుక్కుని ఒకే చోట కుప్పగా అవుతాయి. వాటిని చాలా తేలికగా తీసేయవచ్చు. అలాగే బట్టలు, ఫర్నిచర్‌పై ఉండే సన్నటి వెంట్రుకలను తొలగించడానికి ‘లింట్ రోలర్’ (Lint Roller) అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని జుట్టు ఉన్న ప్రదేశంలో అటు ఇటు తిప్పితే వెంట్రుకలన్నీ దానికి ఉన్న గమ్‌కు చిక్కుకుపోతాయి. ఇంట్లో పెట్స్ ఉన్నవారు ఒక లింట్ రోలర్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం చాలా మంచిది.

ఇక కార్పెట్లు, రగ్గుల్లో ఇరుక్కుపోయిన వెంట్రుకలు మామూలు చీపురుతో అస్సలు రావు. దీని కోసం మనం కిటికీలు శుభ్రం చేయడానికి వాడే ‘స్క్వీజీ’ (Squeegee) ని ఉపయోగించవచ్చు. కార్పెట్‌పై స్క్వీజీని ఒకే దిశలో లాగితే, దారాల్లో దాక్కున్న వెంట్రుకలన్నీ బయటకు వచ్చి ఒక దగ్గర జమ అవుతాయి. ఇంట్లో రోజూ వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటే నేల, సోఫాలు, తలుపు తెరలను అప్పుడప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్‌తో డీప్ క్లీన్ చేయడం శ్రేయస్కరం. చేతులు అందని ఫర్నిచర్ మూలల్లో దాక్కున్న వెంట్రుకలను తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతిసారీ వ్యాక్యూమ్ క్లీనర్ తీయాల్సిన అవసరం లేకుండా తేలికపాటి తడి ఉన్న స్పాంజ్ లేదా గుడ్డతో కూడా శుభ్రం చేయవచ్చు. వెంట్రుకలు ఉన్న చోట తడి స్పాంజ్‌తో తుడిస్తే అవన్నీ దానికి అంటుకుంటాయి. అయితే గుడ్డ మరీ ఎక్కువగా తడిసి ఉండకూడదు, అలాగే శుభ్రం చేసేటప్పుడు దాన్ని తరచూ నీళ్లలో ముంచి పిండుతుండాలి.

నేలమీద పడిన వెంట్రుకలను శుభ్రం చేయడానికి సాధారణ చీపురు కంటే ‘రబ్బర్ బ్రూమ్’ (Rubber Broom) చాలా మెరుగ్గా పనిచేస్తుంది. దీని రబ్బర్ కుచ్చులు వెంట్రుకలను ఒక్క చోట చేర్చడానికి సహాయపడతాయి. పనిచేసిన తర్వాత ఈ చీపురును నీళ్లతో కడిగి ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్‌కు బాగా అతుక్కుపోయి మొండిగా మారిన వెంట్రుకలను వదిలించడానికి ‘ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ షీట్’ను ఆ ప్రదేశంలో తేలికగా రుద్దవచ్చు. ఇది వెంట్రుకల పట్టును వదులు అయ్యేలా చేస్తుంది, దాంతో వాటిని సులువుగా ఎత్తేయవచ్చు. ప్రతిసారీ గంటల తరబడి శ్రమపడాల్సిన పనిలేకుండా, ఏ ప్రదేశానికి ఏ చిట్కా సరిపోతుందో చూసుకుని పాటిస్తే ఇంటిని నిమిషాల్లో శుభ్రంగా ఉంచుకోవచ్చు.