Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips

Diwali Cleaning Tips

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే, దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు, పూజలు, రంగురంగుల ముగ్గులతో సందడి నెలకొంటుంది. ఇంటిని అందంగా అలంకరించేందుకు చాలామంది ఎక్కడపడితే అక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. అయితే దీపాల్లో నూనె పోసే సమయంలో కొన్ని చుక్కలు పొరపాటున నేలపై పడుతుంటాయి. మొదట్లో చిన్న మరకలుగానే కనిపించినా, ఎవరైనా వాటిపై అడుగు వేస్తే నూనె నేలంతా వ్యాపించి జిడ్డుగా మారుతుంది. దీంతో నేలపై నడవడం కూడా కష్టంగా మారుతుంది. సాధారణంగా తడి గుడ్డతో ఎన్నిసార్లు తుడిచినా నూనె జిడ్డు పూర్తిగా పోదు. సబ్బు, నీటితో శుభ్రం చేసినా నేల జారుడుగా ఉండే ప్రమాదం ఉంది. అయితే ఇందుకోసం ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో అందుబాటులో ఉండే గోధుమ పిండితోనే నూనె మరకలను తొలగించుకోవచ్చు.

నేలపై నూనె పడితే ముందుగా ఏం చేయాలి?
దీపాల నుంచి నూనె నేలపై పడిన వెంటనే తడి గుడ్డతో లేదా మాప్‌తో తుడవకూడదు. అలా చేస్తే నూనె మరింత విస్తరించి నేలంతా జిడ్డుగా మారుతుంది. ముందుగా నూనెను పీల్చుకునేలా చేయడం ముఖ్యం. ఇందుకోసం గోధుమ పిండి లేదా తవుడు ఉపయోగించవచ్చు.

గోధుమ పిండితో నూనె మరకలను తొలగించే విధానం
నేలపై నూనె పడిన ప్రాంతం మొత్తం కప్పేలా కొద్దిగా గోధుమ పిండి లేదా తవుడు చల్లాలి… పిండి నూనెను పీల్చుకునేలా కొంతసేపు (ఐదు నుంచి 10 నిమిషాలు) అలాగే ఉంచాలి. నూనెను పీల్చుకున్న తర్వాత పిండి తేమగా, బరువుగా మారుతుంది. ఇక, నూనెను పీల్చుకున్న పిండిని టిష్యూ పేపర్, పాత కార్డు లేదా ఇతర సాధనంతో జాగ్రత్తగా సేకరించి చెత్తబుట్టలో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా గిన్నెలు కడిగే లిక్విడ్ కలిపిన తడి గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. చివరగా శుభ్రమైన నీటితో మరోసారి తుడిచి నేలను పూర్తిగా ఆరనివ్వాలి.

బట్టలపై దీపపు నూనె పడితే ఇలా చేయండి!
దీపావళి పూజలు, దీపాల అలంకరణ సమయంలో కొన్నిసార్లు నూనె చుక్కలు బట్టలపై కూడా పడుతుంటాయి. అలాంటప్పుడు వెంటనే బట్టలను నీటిలో నానబెట్టకుండా ముందుగా మరక పడిన చోట కొద్దిగా టాల్కమ్ పౌడర్ చల్లాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే పౌడర్ నూనెను పీల్చుకుంటుంది. అనంతరం పౌడర్‌ను మెల్లగా దులిపేసి, మరక ఉన్న ప్రాంతంలో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి సాధారణంగా ఉతకాలి. అయితే, నేలపై పడిన నూనెను నేరుగా మాప్‌తో తుడవకూడదు. నూనె ఉన్న ప్రదేశంలో ఎక్కువగా నీళ్లు పోయకూడదు. ముందుగా పిండి ద్వారా నూనెను పూర్తిగా తొలగించిన తర్వాతే తడి గుడ్డతో శుభ్రం చేయాలి. శుభ్రపరిచిన అనంతరం నేల పూర్తిగా ఆరే వరకు పిల్లలు, పెద్దలు ఆ ప్రాంతంలో నడవకుండా జాగ్రత్తపడాలి. ఇలా చిన్న చిట్కాలు పాటిస్తే దీపావళి సమయంలో నూనె మరకల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.