Temple Style Daddojanam: దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎంతో కమ్మగా, నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. ఇంట్లో పండుగల సమయంలో అమ్మవారికి లేదా ఇతర దేవతలకు నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా సులువైన, ఆరోగ్యకరమైన ప్రసాదం. సరైన కొలతలతో చేసుకుంటే అస్సలు గట్టిపడకుండా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా కడుపుకి ఎంతో హాయినిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే విధానం ఎలానో ఇప్పుడు వివరంగా చూద్దాం.
కావలిసిన పదర్థాలు
అన్నం తయారీకి:
* బియ్యం – 1 కప్పు
* నీళ్లు – 3 కప్పులు
* వెన్న – 1 టేబుల్ స్పూన్
కలపడానికి:
* కాచి చల్లార్చిన పాలు – 2 కప్పులు
* కమ్మటి తాజా పెరుగు – 3 కప్పులు
* ఉప్పు – తగినంత (సుమారు 1½ టేబుల్ స్పూన్లు)
* పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్లు (3 నుండి 4 పచ్చిమిరపకాయలు)
* తురిమిన అల్లం – 1 అంగుళం ముక్క
* కొత్తిమీర తరుగు – కొద్దిగా
పోపు / తాలింపు కోసం:
* ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె – సరిపడా
* పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
* మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు
* మిరియాలు – 1 టీస్పూన్
* ఆవాలు – 1 టీస్పూన్
* ఎండుమిర్చి – 2 నుండి 3
* కరివేపాకు – 2 రెమ్మలు
* ఇంగువ – ¼ టీస్పూన్
తయారీ విధానం
అన్నం సిద్ధం చేసుకోవడం
ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్లో ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇందులోకి మూడు కప్పుల నీళ్లు పోసి, ఒక టేబుల్ స్పూన్ వెన్న (ఇంట్లో చేసినదైనా సరే) తప్పకుండా వేసుకోవాలి. వెన్న వేయడం వల్ల అన్నం గట్టిపడకుండా ఎంతో మృదువుగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి, అన్నం వేడిగా ఉన్నప్పుడే గరిటతో ఉండలు లేకుండా మెత్తగా మాష్ చేసుకోవాలి.
పాలు, పెరుగు కలపడం
మెత్తగా చేసుకున్న వేడి అన్నంలోకి కాచి చల్లారబెట్టుకున్న రెండు కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పెరుగు కలిపితే దద్దోజనం త్వరగా పులిసిపోతుంది. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, పులుపు లేని కమ్మటి తాజా పెరుగు మూడు కప్పులు వేసి కలపాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన అల్లం వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా గరిటతో కలపాలి.
తాలింపు
దేవాలయం రుచి రావాలంటే తాలింపు కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం మంచిది. ఒక కడాయిలో నెయ్యి వేడి చేసి, అందులో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీడిపప్పు పలుకులు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. ఆ తర్వాత ఆవాలు, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేగనివ్వాలి. చివరగా స్టవ్ ఆపే ముందు పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి, ఈ వేడి వేడి తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగన్నంలో వేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి బాగా కలిపితే ఎంతో రుచికరమైన గుడి స్టైల్ దద్దోజనం ప్రసాదం సిద్ధమవుతుంది.
చిట్కా: దద్దోజనం సాయంత్రం వరకు పులియకుండా తాజాగా ఉండాలంటే పాల పరిమాణం పెంచి, పెరుగు పరిమాణం తగ్గించుకోవాలి. వెంటనే లేదా మధ్యాహ్నానికే తినేటట్లయితే ఈ కొలతలు సరిగ్గా సరిపోతాయి.

