NTV Telugu Site icon

Earphones Effect: ఇయర్‌ఫోన్స్‌ని ఎక్కువగా వాడితే.. ఈ సమస్యలు తప్పవు

Earphones Side Effects

Earphones Side Effects

Side Effects Of Earphones: ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఇయర్‌ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. కేవలం ఖాళీగా ఉన్నప్పుడే కాదు.. ప్రయాణ సమయాల్లో కూడా వాటిని వినియోగిస్తున్నారు. ఒకప్పుడు అవసరం కోసం వీటిని వాడితే.. ఇప్పుడు ప్యాషన్ కోసం చెవుల్లో పెట్టుకుని తిరిగేస్తున్నారు. ఇలా అధికంగా వాడటం వల్ల.. వినికిడి లోపమే కాకుండా, మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు చెప్తున్నారు.

ఇయర్‌ఫోన్స్‌ని ఎక్కువగా వినియోగిస్తే.. అవి చెవులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఫలితంగా.. చెవిలో నొప్పి పుడుతుంది. క్రమంగా ఈ సమస్య పెరిగితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొందరికి తల తిరిగే ప్రమాదం ఉందని, ఈ తరహా సమస్యల్ని చాలామంది ఎదుర్కున్నారని చెప్తున్నారు. ఏకాగ్రత కూడా లోపిస్తుందట! అయితే.. ఇయర్‌ఫోన్స్‌కి బదులు హెడ్ ఫోన్స్ వాడితే, కాస్త బెటరని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే.. ఈ స్పీకర్ల నుంచి వచ్చే సౌండ్‌కి, కర్ణభేరికి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. దాంతో.. హెడ్‌ఫోన్స్ చెవిపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ.. ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని, పెద్ద సౌండ్‌తో పాటలు వింటేనే ప్రమాదకరమని పేర్కొంటున్నారు.

ఒకవేళ ఇయర్‌ఫోన్స్ వాడుతుంటే.. సౌండ్ తక్కువగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాల్యూమ్ 60 డెసిబెల్స్‌ కంటే తక్కవగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. అలా కాకుండా 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ సౌండ్‌ పెట్టుకుంటే మాత్రం.. వినికిడి లోపం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఫోన్ సెట్టింగ్‌లో వాల్యూమ్‌ను 50 శాతం ఉంచుకుంటే ఉత్తమం. అలా చేస్తే.. సౌండ్ పెంచేటప్పుడు వార్నింగ్ వస్తుంది. అప్పుడు సౌండ్ లిమిట్‌లోనే పెట్టుకోవచ్చు.