NTV Telugu Site icon

Shibari Technique: ఒకప్పుడు శిక్ష.. ఇప్పుడు మోక్షం

Shibari Technique

Shibari Technique

ప్రస్తుత ఉరుకు, పరుగుల జీవితంలో మానవులు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నా.. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నారు. అఫ్‌కోర్స్.. వ్యాయామాలు, క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే.. ఆరోగ్యంగా మెలగొచ్చు. కానీ, కొందరు అవి సాధ్యపడకపోవచ్చు. బిజీ లైఫ్ కారణంగానో, ఏ ఇతర సమస్యల వల్లనో.. ఆరోగ్య సూత్రాల్ని సరిగ్గా పాటించలేకపోతారు. అలాంటి వారి కోసం ఈ ‘షిబారి’ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.

షిబారి (పట్టుకో).. ఇది జపనీయుల యుద్ధకళ. ‘హొజో-జుట్సు’ అనే యుద్ధవిద్యలో ఇదొక భాగం. అప్పట్లో ఈ కళను శిక్షలో బాగంగా వినియోగించేవారు. అంటే.. యుద్ధంలో ఓడిపోయిన లేదా పట్టుబట్ట శతృ సైనికుల్ని బందీలుగా అదుపులోకి తీసుకున్నప్పుడు, తాళ్లతో కాళ్లు – చేతులను కట్టి వేలాడదీసేవారు. బందీలు చనిపోకుండా, ప్రాణాలతో ఉంచడమన్నదే ఈ విద్య ప్రధాన ఉద్దేశం. ఇలా చేయడం వల్ల శత్రువుల కాళ్ళు, చేతులు మొద్దుబారిపోయినా.. నడవడానికి కష్టంగా అనిపించినా ఆయుధాన్ని ఉపయోగించగలరు. అలా శత్రువును కట్టు బానిసను చేస్తారు. అంతేకాదు.. ఇదో శృంగార భంగిమగానూ ఉపయోగపడేది. ఎదురు తిరిగిన మహిళలనూ తాళ్లతో కట్టేసి, అత్యాచారానికి పాల్పడేవారు!

ఇప్పుడు ఈ షిబారి కళను మానసిక చికిత్సకు అన్వయించుకోవడం మొదలుపెట్టారు. సైకోథెరపీలో భాగంగా ఈ కళను ఉపయోగించవచ్చని నిపుణులు గుర్తించారు. ఫలితంగా.. ఇది క్రమంగా యూరోపియన్‌ దేశాలకూ విస్తరిస్తూ వచ్చింది. ఇది కాళ్లు, చేతులు, కీళ్లకు మసాజ్‌లా పనిచేస్తుంది. రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ షిబారి టెక్నిక్ వల్ల.. అవయవాలకు కొత్త బలం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. షిబారి టెక్నిక్‌ను జీవితంలో భాగం చేసుకున్న తర్వాత.. మునుపెన్నడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా ఉంటున్నట్టు నిపుణులు గమనించారు. బుద్ధిమాంద్యం, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారికి.. వైద్య నిపుణులు సైకోథెరపీలో ఈ కళను భాగం చేస్తున్నారు.

షిబారి కోసం ఉపయోగించే తాళ్లను నార నుంచి అల్లుతారు. ఇందులో భాగంగా ముడులు ఒడుపుగా వేయాలి. ఒక్క ముడి తప్పుగా పడినా.. శరీరానికి గాయమయ్యే ప్రమాదం ఉంది. కేవలం ముడి వేయడమే కదా అని సొంత ప్రయోగాలు చేసినా, చాలా ప్రమాదకరం. కాబట్టి.. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ కళను ప్రయోగించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాపులు, ఆన్‌లైన్‌ శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. యోగాలో ఉన్నన్ని ప్రయోజనాలు.. ఈ కళలోనూ ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 8 నుంచి 10 నిమిషాల వరకు ఈ టెక్నిక్ పాటిస్తే చాలు.. అందులేని ఆనందాన్ని ఆస్వాదిస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.