జీవితంలో దేవుడు మనకు ఎన్నో బంధాలు ఇస్తాడు. కానీ మనమే మనసుతో ఏర్పరచుకునే అత్యంత విలువైన బంధం – స్నేహం. స్వార్థం లేని ప్రేమ, అండగా నిలిచే ఆసరా, ఆనందాన్ని పంచుకునే సహచర్యం – ఇవన్నీ ఒక నిజమైన మిత్రుడి లక్షణాలు. అలాంటి అపూర్వమైన అనుబంధానికి ఘనతనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం “ఫ్రెండ్‌షిప్ డే”గా జరుపుకుంటాం. ఈ ఏడాది 2025 లో, ఆ రోజు ఆగస్టు 3వ తేదీకి వస్తోంది.
స్నేహానికి అంతటి గొప్పతనం ఎందుకు?
స్నేహం అనేది వయసుతోనో, పరిస్థితులతోనో ఏర్పడే సంబంధం కాదు. అది హృదయంతో ఏర్పడే అనుబంధం. ఒకరి బాధను పంచుకునే, సంతోషాన్ని రెట్టింపు చేసే బంధం. చిన్నతనం నుండి ఎదిగే వరకు – స్కూల్ బెంచ్ మీద పంచుకున్న టిఫిన్ నుంచి, జీవితంలోని తేడాలను పంచుకునే వరకు, ప్రతి దశలో కూడా స్నేహం మన పక్కన ఉంటుంది. కాబట్టి… ఈ రోజు మిత్రుల జ్ఞాపకాలను ఆనందంగా గుర్తు చేసుకునే రోజు.
చరిత్ర ప్రకారం..
1958లో పరాగ్వేలో ఫ్రెండ్‌షిప్ డే మొదటిసారిగా అధికారికంగా ప్రకటించబడింది. ఆ తర్వాత అమెరికాలో, 1950లలో జాయిస్ హాల్ అనే వ్యాపారవేత్త “హాల్‌మార్క్ కార్డ్స్” ద్వారా ఈ బంధాన్ని సెలబ్రేట్ చేయాలని సూచించారు. కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఐక్యరాజ్యసమితి (UN) కూడా 2011లో జూలై 30 తేదీన “అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం”గా గుర్తించింది. కానీ భారతదేశంలో మాత్రం సంప్రదాయంగా ఆగస్టు మొదటి ఆదివారంనే ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకుంటున్నారు.
ఈ రోజు ఎలా జరుపుకోవాలి?
మీ బాల్య మిత్రులకు ఒక చిన్న మెసేజ్ పంపండి.. కాలేజీ రోజుల్లో తీసుకున్న ఫోటోలను షేర్ చేయండి. ఒక ఫోన్ కాల్ పెట్టి కాసేపు ముచ్చట్లు చెప్పండి. ఒక చిన్న గిఫ్ట్ లేదా చేతితో రాసిన లేఖ ఇచ్చి వాళ్ల మనసు గెలవండి. ముఖ్యంగా, అవసరమైన సమయంలో వారి పక్కన నిలబడతా అని వాగ్దానం చేయండి
స్నేహితులే జీవితానికి ఆస్తి..
ఒంటరితనాన్ని మిగిల్చే ఈ యుగంలో, ఒక మనసుతో మాట్లాడే మిత్రుడు ఎంతో విలువైనవాడు. కష్టాల్లో అడుగడుగునా తోడుగా నిలిచే వ్యక్తి, మన మనోభావాలను అర్థం చేసుకునే వ్యక్తి – అతడే నిజమైన స్నేహితుడు. స్నేహం మనకు ఆనందాన్ని ఇచ్చే మార్గమే కాక, మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తివంతమైన బంధం. కనుక ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా… మీ జీవితంలో ఉన్న ఆ మిత్రులందరినీ గుర్తు చేసుకోండి. వాళ్ల ప్రేమకు, మద్దతుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజెప్పండి. ఒక చిన్న ముద్దు మాట, ఒక చిన్న స్మైల్ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుంది.ఎందుకంటే..“స్నేహం అనేది జీవితాన్ని మార్చగలిగే శక్తి.
