Paneer Tomato Rice: ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతిరోజూ వంటింట్లో గంటల తరబడి సమయం కేటాయించడం చాలామందికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడో, వీకెండ్స్‌లో బద్ధకంగా అనిపించినప్పుడో… “అసలు ఈరోజు ఏం వండాలి?” అనే ప్రశ్న ప్రతి ఇంట్లోనూ ఎదురవుతూనే ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక జంక్ ఫుడ్ తినడమో లేదా బయట నుంచి ఆర్డర్ చేయడమో కాకుండా, ఇంట్లోనే నిమిషాల్లో పూర్తయ్యే ఆరోగ్యకరమైన వంటకం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా..
అలాంటప్పుడు కేవలం కడుపు నింపడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. శాఖాహారులకు ఉత్తమమైన ప్రోటీన్ మూలం ‘పన్నీర్’. అలాంటి పన్నీర్‌తో, కిచెన్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే టమాటాలు, మన నిత్యం తినే సాధారణ సోనా మసూరి బియ్యం కలిపి చేసేదే ‘పన్నీర్ టమాటో రైస్’. ఎలాంటి స్పెషల్ బిర్యానీ రైస్ అక్కర్లేకుండా, ఎక్కువ గిన్నెలు పాడుచేయకుండా.. ఒకే ఒక్క కుక్కర్‌లో చిటికెలో సిద్ధమైపోయే ఈ రెసిపీ గ్యాస్‌ను, సమయాన్ని ఆదా చేస్తుంది. పెద్దలకే కాకుండా లంచ్‌బాక్స్‌లలో వెరైటీ కోరుకునే పిల్లలకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఎక్కువ శ్రమ లేకుండా, రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోగల ఈ వన్-పాట్ మీల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
* సోనా మసూరి బియ్యం: ఒకటిన్నర కప్పు
* పన్నీర్ ముక్కలు: 200 గ్రాములు
* టమాటాలు: పావు కేజీ (ప్యూరీ చేసుకోవాలి)
* ఉల్లిపాయ తరుగు: అర కప్పు
* పచ్చిమిర్చి: 2–3 (చీల్చినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
* నూనె: 3–4 టేబుల్ స్పూన్లు
* నెయ్యి: 1 టీస్పూన్
* గరం మసాలా: కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు
* జీడిపప్పు: 2–3 టేబుల్ స్పూన్లు
* కరివేపాకు: 2 రెమ్మలు
* పసుపు: పావు టీస్పూన్
* కారం: 1 టీస్పూన్
* గరం మసాలా పొడి: 1 టీస్పూన్
* కసూరి మేతి: 1 టీస్పూన్
* కొత్తిమీర తరుగు: 1 టేబుల్ స్పూన్
* ఉప్పు: రుచికి తగినంత
* నీళ్లు: 3 కప్పులు
తయారీ విధానం
ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక కట్ చేసిన పన్నీర్ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పన్నీర్ ముక్కలను వెంటనే తీసి ఒక గిన్నెలోని నీళ్లలో వేసి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ గట్టిపడకుండా మెత్తగా ఉండి, మసాలాలను బాగా పీల్చుకుంటుంది.
అదే కుక్కర్‌లో మరో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేయాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో రుబ్బుకున్న టమాటో ప్యూరీని కుక్కర్‌లో వేసి, అందులోనే పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. గ్రేవీ నుంచి నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై మగ్గించాలి.
నూనె పైకి తేలాక నీటిలోంచి తీసిన పన్నీర్ ముక్కలను గ్రేవీలో వేసి రెండు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టి ఇందులో వేసి రెండు నిమిషాలు సన్నని మంటలో మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు బియ్యం తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల నీళ్లు (1:2 నిష్పత్తిలో) పోయాలి. రుచి చూసి ఉప్పు సరిచేసుకుని, గరం మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి నెమ్మదిగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి గ్రేవీ అవసరం లేదు. కాస్త చల్లని రైతాతో తింటే లంచ్ లేదా డిన్నర్‌కి పరిపూర్ణమైన భోజనం సిద్ధమవుతుంది.

