New Year Resolutions: మరో రెండు, మూడు రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. ఇప్పటికే అందరూ రాబోయే కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఎల్లప్పుడూ కొత్త ఆశలు, కొత్త కలలు, సరికొత్త అవకాశాలను తెస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో చాలా మంది కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే వైపుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మీరు కూడా ఇదే కోవలోకి చెందిన వారు అయితే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఈ 5 ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PVC Ration Card: PVC రేషన్ కార్డు పొందండిలా..!
బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన దినచర్యల కారణంగా, చాలా మంది వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమవుతున్నారు. 2026లో మీరు ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యాలు మిమ్మల్ని కేవలం ఫిట్‌గా ఉంచడమే కాకుండా, మీ జీవితాన్ని సమతుల్యంగా, శక్తివంతంగా, ఎలాంటి వ్యాధి బారిన పడకుండా ఉంచడంలో విశేషంగా సహాయపడతాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆ ఐదు అలవాట్లు ఇవే..
1. రోజూ వ్యాయామం చేయడం
ఈ నూతన సంవత్సరంలో రోజు వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవండి లేదా జాగింగ్ చేయండి. అలాగే మీరు యోగా లేదా స్ట్రెచింగ్‌ను కూడా మీ దినచర్యలో భాగం చేసుకోవచ్చు. మీరు జిమ్‌కు వెళ్లలేకపోతే, ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయవచ్చు. నిజానికి వ్యాయామం అనేది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
2. సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించండి.
సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయిన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి. దీనికి బదులుగా, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తినండి. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు బరువు పెరగకుండా ఉండటమే కాకుండా, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
3. నిద్రకు సరైన సమయాన్ని కేటాయించండి..
ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నిద్రకు సరైన సమయాన్ని కేటాయించేలా చూడండి. వాస్తవానికి మనకు నిద్ర అనేది చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి సమయంలో ఫోన్లలో గడుపుతూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల మనకు నాణ్యమైన నిద్ర అనేది తక్కువగా లభిస్తుంది. ఇది ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ అలవాటును మార్చుకోండి, త్వరగా పడుకుని, ఉదయమే నిద్రలేచే అలవాటును పెంచుకోండి.
4. ఒత్తిడి దూరం చేసుకోండి..
దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ఒత్తిడి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ప్రతిఒక్కరూ వారి జీవితంలో ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం ధ్యానం చేయడం అనేది ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక అలవాటుగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఇది మానసిక ప్రశాంతతకు, మంచి నిద్రకు, సానుకూల మనస్తత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
5. మంచి అలవాట్లను అలవర్చుకోండి
చిన్న చిన్న అలవాట్లు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మీకు ధూమపానం లేదా మద్యం తాగే అలవాటు ఉంటే, ఈ కొత్త సంవత్సరంలో వెంటనే మానేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే టైంకి భోజనం చేయడాన్ని అలవాటు చేసుకోండి. దీంతో పాటు ప్రతిరోజూ సూర్యకాంతిలో కొద్దిసేపు నడవండి. ఇలాంటి మంచి అలవాట్లను మీ జీవితంలో మరిన్ని అలవర్చుకోండి.
READ ALSO: Sudha Kongara: రజనీకాంత్‌తో ఆ సినిమా తీయాలి: సుధా కొంగర
