Masala Paneer Paratha Recipe: ఉదయాన్నే పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే కేవలం తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారయ్యే పన్నీర్ పరాటాను ఓసారి ప్రయత్నించండి. మృదువుగా, మంచిగా పొంగుతూ లోపల మసాలా పన్నీర్ స్టఫింగ్తో ఉండే ఈ పరాటాలను తిన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. గోధుమపిండితో చేసే ఈ పరాటాలు గంటల తరబడి సాఫ్ట్‌గా ఉండటమే కాకుండా, లంచ్‌కు లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు ఎంతో బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా పన్నీర్ పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో వివరంగా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
పిండి కలపడానికి:
* గోధుమపిండి – 2 కప్పులు (లేదా ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు మైదాపిండి)
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – 2 టీస్పూన్లు
* నీళ్లు – పిండి కలపడానికి సరిపడా
స్టఫింగ్ కోసం:
* పన్నీర్ – 150 నుండి 200 గ్రాములు (తురిమినది లేదా మెత్తగా మాష్ చేసినది)
* అల్లం – చిన్న ముక్క
* వెల్లుల్లి రెబ్బలు – 8
* పచ్చిమిర్చి – 4
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* కొత్తిమీర తరుగు – ఒక పిడికెడు
* కారం – 1/2 టీస్పూన్
* వాము – 1/2 టీస్పూన్
* గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్
* వేయించిన జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
* ఆమ్చూర్ పొడి – 1/2 టీస్పూన్ (లేదా చాట్ మసాలా / 1-2 టీస్పూన్ల నిమ్మరసం)
* పసుపు – 1/4 టీస్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* నెయ్యి లేదా బటర్ – పరాటాలు కాల్చడానికి సరిపడా
తయారీ విధానం:
పిండిని సిద్ధం చేసుకోవడం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి రెండు కప్పుల గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్‌గా ఉంటే స్టఫింగ్ పెట్టి వత్తేటప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పిండి కలిపిన తర్వాత ఒకటి రెండు టీస్పూన్ల నూనె వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా మర్దన (నీట్) చేయాలి. ఆ తర్వాత పిండిపై మూత పెట్టి కాసేపు పక్కన ఉంచాలి.
పన్నీర్ స్టఫింగ్ తయారీ
మరోవైపు స్టఫింగ్ కోసం 200 గ్రాముల పన్నీర్‌ను తీసుకుని గ్రేటర్‌తో సన్నగా తురుముకోవాలి లేదా చేతితో మెత్తగా బుర్జీలా మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పన్నీర్లో కలపాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి (లేదా నిమ్మరసం), పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. పన్నీర్ ముక్కలు పెద్దగా లేకుండా సన్నగా ఉంటే పరాటా వత్తేటప్పుడు చిరిగిపోకుండా చక్కగా వస్తుంది.
పరాటాలు వత్తే పద్ధతి
ఇప్పుడు నానబెట్టిన పిండి నుండి చిన్న బాల్ సైజు ముద్దను తీసుకుని పొడి పిండిలో అద్ది చిన్న పూరీ సైజులో వత్తుకోవాలి. దాని మధ్యలో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పన్నీర్ స్టఫింగ్‌ను నిండుగా పెట్టాలి. స్టఫింగ్ ఎక్కువగా ఉంటేనే పరాటా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పిండి అంచులను దగ్గరకు చేర్చి, పైన వచ్చే అదనపు పిండిని తీసేసి సీల్ చేయాలి. ఆ తర్వాత చేతితో సున్నితంగా ఒత్తుతూ లోపల స్టఫింగ్ అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. మళ్లీ పొడి పిండి చల్లుతూ మధ్యలో కాకుండా అంచుల వెంబడి సున్నితంగా తిప్పుతూ మీడియం మందంతో పరాటాను వత్తుకోవాలి.
పరాటాలు కాల్చే విధానం
స్టవ్ వెలిగించి పెనం బాగా వేడయ్యాక వత్తుకున్న పరాటాను దానిపై వేయాలి. పైన చిన్న బబుల్స్ రాగానే మరోవైపు తిప్పి 5 నుండి 10 సెకన్ల పాటు కాల్చాలి. నెయ్యి లేదా బటర్ వేయకముందే పరాటాను 60% వరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత రెండు వైపులా నెయ్యి లేదా బటర్ రాస్తూ ఎర్రగా, చక్కగా పొంగే వరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. డైట్ చేసేవారైతే నెయ్యిని తక్కువగా వాడుకోవచ్చు. ఇలా కాల్చిన పరాటాలను వేడివేడిగా సర్వ్ చేయాలి లేదా హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే గంటల తరబడి ఎంతో మృదువుగా, రుచికరంగా ఉంటాయి.

