మీకు ఇష్టం లేకపోయినా ప్రతిదానికీ ‘అవును’ అని చెప్పేస్తారా? ఇతరులను సంతోషపెట్టే ఈ అలవాటును వదిలించుకోవడానికి ఈ 5 చిట్కాలు మీకు సహాయపడతాయి. మీరు ఏదైనా విషయాన్ని తిరస్కరించాలనుకున్నా, ఎదుటివారిని సంతోషపెట్టాలనే భావనతో లేదా సంకోచం వల్ల “సరే” అని చెప్పేస్తుంటారా? మీకు ఇష్టం లేకపోయినా ప్రతిదానికీ అంగీకరించడాన్ని ‘పీపుల్-ప్లీజింగ్’ (ఇతరులను మెప్పించే అలవాటు) అంటారు. మొదట్లో ఇది మంచిదిగా అనిపించినా, కాలక్రమేణా ఇది మానసిక అలసట, ఒత్తిడి, సమయం వృధాకు దారితీస్తుంది. కాదని చెప్పడం ఎలా అనేది నేర్చుకుని, మీ జీవితాన్ని సులభం చేసుకోవడానికి సహాయపడే ఐదు ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
1. మీ ప్రాధాన్యతలను స్పష్టం చేసుకోండి
ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కానీ అది మీ స్వంత జీవితాన్ని దెబ్బతీస్తే సరికాదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు, ముందుగా మీ పనుల జాబితాను చూసుకోండి. ఆ పని చేయడానికి మీకు సమయం ఉందా? అది మీ ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తుందా? మీ ప్రాధాన్యతల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉంటే, “కాదు” అని చెప్పడానికి సంకోచం చాలా తగ్గిపోతుంది.
2. వెంటనే స్పందించకుండా కొంత సమయం అడగండి
చాలా మంది ఒత్తిడికి లొంగి వెంటనే “అవును” అని చెప్పేస్తారు. ఈ అలవాటును మార్చుకోవాలంటే, కాస్త ఆగి ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇలా చెప్పండి. “నేను ఆలోచించి చెబుతాను.” “నా పనులన్నీ సమీక్షించుకుని చెబుతాను.” ఇలా చేయడం వల్ల ఒత్తిడి లేకుండా, పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి సమయం దొరుకుతుంది.
3. ‘కాదు’ అని చెప్పే విధానాన్ని మార్చుకోండి
“వద్దు” అని చెప్పడం అంటే అమర్యాదగా ప్రవర్తించడం కాదు. మీరు దయగా, ప్రశాంతంగా కూడా తిరస్కరించవచ్చు. అవతలి వ్యక్తి మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకునేలా సానుభూతితో మాట్లాడండి. పెద్ద పెద్ద సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. సరళంగా, నిజాయితీగా చెప్పడం మంచిది. ఉదాహరణకు..“ఈసారి నాకు సాధ్యం కాదు, సారీ.”
4. అపరాధ భావాన్ని వదిలేయండి
చాలా మంది “కాదు” అని చెప్పితే తమ పరువు పోతుందని లేదా ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారని భయపడతారు. కానీ నిజం ఏమిటంటే- మీరు ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టలేరు. మీ సమయం, శక్తి, మానసిక ఆరోగ్యం మీకు ముఖ్యం. మొదట్లో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ క్రమంగా ప్రజలు మీ సరిహద్దులను గౌరవించడం మొదలు పెడతారు.
5. చిన్న విషయాలతో ప్రారంభించండి
పెద్ద విషయాల్లో “కాదు” అని చెప్పడం మీకు కష్టంగా ఉంటే, చిన్న చిన్న విషయాల నుంచి మొదలు పెట్టండి. ఉదాహరణ.. మీకు నచ్చని సినిమా చూడడానికి స్నేహితుడు అడిగితే సాఫీగా “ఈసారి వద్దు రా” అని చెప్పండి. ఏదైనా చిన్న ఆహ్వానాన్ని తిరస్కరించండి. ఈ చిన్న “కాదు”లే మీలోని ధైర్యాన్ని పెంచి, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి.
