Blood Pressure: తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. తాజా పరిశోధనలు, వైద్యుల వివరాల ప్రకారం.. శరీరంలో నీరు తగ్గితే రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇజ్రాయెల్‌లో జరిగిన ఓ పరిశోధన రిపోర్టు విడుదలైంది. ఇందులో నాలుగు లక్షల మందికి చెందిన ఆరోగ్య వివరాలను పరిశీలించారు. రక్తంలో సోడియం మోతాదు పెరిగితే రక్తపోటు, గుండె వైఫల్యం ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ దాటినప్పుడు హైబీపీ ముప్పు దాదాపు 29 శాతం పెరుగుతుందని తేలింది.
READ MORE: Humane Sagar: బ్రేకింగ్: మేనేజర్ బలవంతం.. స్టార్ సింగర్ మృతి
శరీరంలో సరైన నీటిశాతం ఉన్నప్పుడు సోడియం స్థాయిలు సహజంగానే నియంత్రణలో ఉంటాయి. మన గుండెనే తీసుకుంటే దానిలో 73 శాతం నీరు ఉంటుంది. అందుకే గుండె పనితీరును సాఫీగా కొనసాగించడానికి, రక్తం రక్తనాళాల్లో సులభంగా ప్రవహించడానికి నీరు ఎంతో అవసరం. నీరు రక్తాన్ని పలుచన చేస్తుంది. రక్తనాళాలను సడలిస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో కూడా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. వైద్యుల మాటల్లో చెప్పాలంటే.. రక్తపోటు నియంత్రణకు నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ సరిపడ నీరు తాగటం ఒక చిన్న అలవాటు అయినప్పటికీ దీర్ఘకాలంలో పెద్ద మార్పును తీసుకురాగలదు.
నీటితో పాటు నిమ్మరసం, దోసకాయ నీరు, హెర్బల్ టీ, తక్కువ సోడియం సూప్, పాలు, పెరుగు వంటి వాటిని కూడా తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బీపీ నియంత్రణలో ఉపయోగపడతాయి. అయితే కేవలం నీటితోనే కాదు, జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే రక్తపోటును మరింత సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచడం, రోజూ కనీసం అరగంట వాకింగ్ చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి సుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఓ నివేదిక ప్రకారం.. సాధారణంగా మగవారు రోజుకు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని సూచించారు. కానీ ఇది వాతావరణం, పనిభారం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇది మారుతుంది.
